కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు ఇది ఓ అరుదైన అవకాశమనే చెప్పాలి. దీంతో ఈ లాక్డౌన్ సమయాన్ని వాళ్లు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీలు ఇంటి పనులు చేయడంలో నిమగ్నమైతుంటే.. కొంతమంది మాత్రం ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కాలక్షేపం కోసం చేయగలిగే పనుల గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ భామ ఎమ్మా వాట్సన్ కూడా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కొన్ని మార్గాల గురించి చెబుతోంది. అవేంటో మీరే చూడండి.
‘మా బామ్మ వయసు 70 ఏళ్ల పైనే ఉంటుంది.. అంటే ఆమెకు వైరస్ సోకే అవకాశం ఎక్కువ. మా అమ్మ టైప్-1 డయాబెటిక్. నా స్నేహితురాలు వైద్యసేవలు అందిస్తుంటుంది. వీళ్లందరి ఆరోగ్యం కోసం నేను స్వీయ నిర్బంధంలో ఉంటున్నా..! మరి మీరు ఎవరి కోసం ఉంటున్నారు..?’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ.
అంతేకాదు, ఈ లాక్డౌన్ సమయంలో కాలక్షేపం కోసం మనం చేయగలిగే కొన్ని ఉపయోగకరమైన పనులను ఎమ్మా అభిమానులతో పంచుకుంది. అవేంటంటే..
* ‘మీకు తెలిసిన వ్యక్తుల్లో పిల్లలున్న వాళ్లు ఉంటే.. వాళ్లకు ఫోన్ చేసి తమ పిల్లలకు కథలు, ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పండి.
* ఆన్లైన్ ద్వారా మీ ప్రాంతంలో ఉన్న ఫుడ్ బ్యాంక్‌కు విరాళాలు సేకరించండి.
* ఈ సమయంలో మనం భయాందోళనకు గురవడం సహజం. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇతరులను సాయం అడగడానికి సిగ్గపడకండి. మనమంతా ఒకరికొకరు తోడుగా నిలబడదాం..!’ అంటూ అభిమానులకు సూచనలిచ్చింది ఎమ్మా.
ఎమ్మాతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా క్వారెంటైన్ అనుభవాలు, సలహాలు పంచుకుంటున్నారు.