కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట! రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్లు కనీసం తుమ్మినా, దగ్గినా అది కరోనా వల్లనేమో అనే ఆలోచనే ముందుగా మన మనసులోకొస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మన దేశంలో కూడా రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైరస్ పట్ల అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుంటున్నారు. వివిధ పోస్టులు, వీడియోలను షేర్ చేస్తూ ‘కరోనాకు భయపడద్దు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం’టూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ లిస్టులో తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియంక చోప్రా, అందాల భామలు బిపాసా బసు, కృతి కర్బంద కూడా చేరిపోయారు. కరోనాపై అవగాహన కల్పించే నేపథ్యంలో తమదైన రీతిలో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి.
నమస్కారమే శ్రేయస్కరం!
కరోనా వైరస్ రాకుండా తీసుకునే జాగ్రత్తల్లో ఒకటి.. ఇతరులతో కరచాలనం చేయకపోవడం. ఎందుకంటే షేక్ హ్యాండ్ వల్ల వైరస్ చేతులు మారి మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదముంది. అందుకే షేక్ హ్యాండ్‌కు బదులుగా ఈ సమయంలో నమస్కారమే సంస్కారం, శ్రేయోదాయకం అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. తాను వివిధ వేదికలపై భారతీయ సంస్కారాన్ని చాటేలా నమస్కారం చేస్తున్న ఫొటోలన్నింటినీ కొలేజ్చేసి ఓ వీడియోగా రూపొందించింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పీసీ.. ‘ఇదంతా నమస్తే గురించి.. ఇది పాత పద్ధతే కావచ్చు.. కానీ ఈ కొద్ది రోజుల్లో ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం మనుషులను పలకరించడానికి ఇదే సరికొత్త పద్ధతి. అందరూ జాగ్రత్తగా ఉండండి..’ అంటూ తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తలు చెప్పిందీ ముద్దుగుమ్మ.
కరోనా నివారణకు ‘ఏడు’ సూత్రాలు!
కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి అంశాలపై వీడియో రూపొందించి అందరిలో అవగాహన పెంచింది డస్కీ బ్యూటీ బిపాసా బసు. ‘కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు, ఇతరులను కాపాడుకోవాలంటే పాటించాల్సిన 7 పద్ధతులివే..’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో భాగంగా ఒక్కో జాగ్రత్తకు తగినట్లుగా ఒక్కో చిత్రాన్ని రూపొందించింది బిప్స్.
* క్రమం తప్పకుండా చేతుల్ని శుభ్రం చేసుకోండి.
* మీ కళ్లు, ముక్కు, నోటిని తాకకండి.
* మీరు దగ్గుతున్నప్పుడు నోటికి టిష్యూని లేదా చేతిని అడ్డుపెట్టుకోండి.
* రద్దీ ప్రాంతాలకు వెళ్లకండి.
* మీకు ఒంట్లో బాగోలేకపోయినా లేదా కాస్త జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్నా ఇంటి దగ్గరే ఉండండి.
* ఒకవేళ మీకు దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అయితే అంతకంటే ముందుగా మీ లక్షణాలను డాక్టర్‌కి ఫోన్ ద్వారా తెలియజేయండి.
* WHO వారందించే తాజా సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
మనమంతా కలిసి పోరాడదాం..!
కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి మనమంతా కలిసి పోరాడాలని చెబుతోంది అందాల తార కృతి కర్బందా. ఈ క్రమంలో తను మాస్క్ ధరించిన ఒక ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మనమంతా ఒక్కటి. కొవిడ్-19ను కట్టడి చేయడానికి మనమంతా కలిసి పోరాడదాం. ఇంటి దగ్గరే ఉండండి.. నీరు బాగా తాగండి.. శుభ్రతని పాటించండి.. ఈ సమయాన్ని మీరు కోల్పోయింది తిరిగి చేజిక్కించుకోవడానికి లేదా దృష్టి సారించాల్సిన అంశాల కోసం వినియోగించండి.. సురక్షితంగా ఉండండి..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది కృతి.
వీరితో పాటు గతంలోనూ విజయ్ దేవరకొండ, స్టార్ కిడ్ సితార, సన్నీ లియోని.. తదితరులు కూడా కరోనా వైరస్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తగు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అది మన దరిచేరదంటూ అందరిలో అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే.