మేగన్ మార్కల్.. హాలీవుడ్ నటిగా కొందరికే సుపరిచితురాలైన ఆమె.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీతో పెళ్లిపీటలెక్కాక ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఇటీవల స్వతంత్రంగా జీవించేందుకు రాచరికపు హోదాను వదులుకోవడంతో పాటు రాణివాసపు కోటను విడిచి మరోసారి వార్తల్లో నిలిచిందీ హాలీవుడ్ అందం. అలా ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన మేగన్.. నిండైన ఆత్మవిశ్వాసానికి కూడా కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది. ఇక అపురూప లావణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఈ అందాల తారను ఫాలో అయ్యే అభిమానులూ ఎక్కువే. అయితే ఈమధ్య సెలబ్రిటీల డోపెల్ గ్యాంగర్స్(మనిషిని పోలిన మనుషులు)ను గాలమేసి పడుతున్న నెటిజన్లు తాజాగా ఈ రాయల్ బ్యూటీ డూప్‌ను కూడా కనుగొన్నారు. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఉండడంతో ఈ బ్యూటీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు.
నన్ను మేగన్ అనుకున్నారు!
ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీస్ ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ, ప్రియాంక చోప్రా, జాక్వెలిన్ వంటి తారలతో పాటు అరియానా గ్రాండే, ప్రిన్స్ హ్యారీ లాంటి ప్రముఖుల డూప్‌లను కనుగొన్న నెట్ ప్రియులు తాజాగా సేమ్ టు సేమ్ మేగన్‌ను పోలిన ఓ మహిళను కూడా కనిపెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచిన ఆమె పేరు అకీషా వర్నాడో ల్యాండ్. అమెరికాలోని మిస్సౌరీకి చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తన కూతురితో కలిసి దిగిన ఈ ఫొటో బాగా వైరలవడంతో పాటు సుమారు 29 వేల లైకులు సొంతం చేసుకుంది. ఇక ఈ ఫొటోను చూసిన నెటిజన్లందరూ ఆమె అచ్చం మేగన్లా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ‘ఓ మై గాడ్.. అచ్చం మేగన్లా ఉందే’, ‘మేగన్ సోదరిలా ఉందే’, అని ప్రశంసిస్తున్నారు. ఇక మేగన్‌తో తనను పోల్చడంపై ఉబ్బితబ్బిబ్బవుతోంది అకీషా. ‘నేను అచ్చం మేగన్లా ఉంటానని చాలామంది చెప్పారు. మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు కూడా నన్ను తనతో పోల్చేవారు. ఒకసారి చర్చికి వెళ్లినప్పుడు నన్ను అందరూ ‘మేగన్’ అనుకొని పొరపాటుపడ్డారు. తను నిజంగానే చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందాల తారతో నన్ను పోల్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్’ అని చెబుతోందీ ముద్దుగుమ్మ.
