సినిమా స్ర్కీనింగ్స్ ఓవైపు.. రెడ్ కార్పెట్‌ను హీటెక్కించే ముద్దుగుమ్మల హొయలు మరోవైపు.. వెరసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఏటా ఫ్రాన్స్ వేదికగా పదకొండు రోజుల పాటు ఈ జరిగే ఈ సినిమా పండగకు విశేష ప్రాధాన్యముంది. అందుకే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని, తమదైన ఫ్యాషనబుల్ స్టైల్‌తో ఎర్రతివాచీపై తళుక్కున మెరవాలని ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన అందగత్తెలంతా ఆశతో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మేలో జరగబోయే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై మొదటిసారిగా క్యాట్ వాక్ చేసే అవకాశం దక్కించుకుంది బుల్లితెర బ్యూటీ శివాంగీ జోషి. స్టార్‌ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్‌తో బోలెడంత స్టార్డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.

నాడు హీనా..నేడు శివాంగి..!
సినీ కార్నివాల్‌గా చెప్పుకునే ఈ చలన చిత్రోత్సవంలో ఐశ్వర్యరాయ్, దీపిక, ప్రియాంక, సోనమ్, కంగనా, మల్లికా శెరావత్, హ్యూమా ఖురేషి తదితర బాలీవుడ్ భామలు ఇప్పటికే తమదైన ఫ్యాషన్లతో మెరుపులు మెరిపించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన బుల్లితెర భామల పాత్ర చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో జరగనున్న 73వ ఎడిషన్ కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకుంది శివాంగి. గతేడాది మరో బుల్లితెర బ్యూటీ ‘హీనా ఖాన్’ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో క్యాట్‌వాక్ చేసిన సంగతి తెలిసిందే.

ఆమె అడుగుజాడల్లోనే..!
’యే రిష్తా క్యా కెహ్లాతా హై’..ప్రస్తుతం స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టెలివిజన్ చరిత్రలోనే ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పటికే మూడువేలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ను చూసే అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఇక సీరియల్‌తో పాటు అందులో యాక్ట్ చేసిన నటీనటులు కూడా విశేష ప్రజాదరణ పొందారు. నటీనటుల అసలు పేర్లను మర్చిపోయి.. సీరియల్లోని క్యారక్టర్ పేర్లతో వారిని పిలుస్తుండడమే దీనికి నిదర్శనం. ఈ సీరియల్లో ‘నైరా’ క్యారెక్టర్‌తో విశేషాభిమానులను సంపాదించుకుంది శివాంగి. ఇక హీనా ఖాన్ కూడా ఈ సీరియల్ ద్వారానే విశేష గుర్తింపు సంపాదించింది. ఆమె ఈ సీరియల్లో నైరా తల్లి పాత్ర ‘అక్షర సింఘానియా’గా అలరించింది. ఇలా ఆన్‌స్క్రీన్‌లో హీనా కూతురిగా ఆమె అడుగుజాడల్లో నడిచిన శివాంగి...కేన్స్‌లో కూడా ఆమెనే అనుసరించడం విశేషం.!

త్వరలో సిల్వర్ స్ర్కీన్‌పై..!
2013లో జీ టీవీలో ప్రసారమైన ‘ ఖేల్ తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ’ సీరియల్‌తో స్మాల్ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చింది శివాంగి. ఆ తర్వాత ‘బిన్తేహా’, ‘బేగుసారై’ సీరియల్స్‌తో విశేష గుర్తింపు సాధించుకుంది. ఇక ‘యే రిష్తా క్యా కెహలాతా హై’తో పాపులర్ టీవీ యాక్ర్టెస్గా మారిపోయిందీ అందాల తార. ఇలా స్మాల్ స్ర్కీన్‌పై తనదైన అందం, అభినయంతో అందరినీ మెప్పిస్తోన్న శివాంగి.. త్వరలోనే సిల్వర్ స్ర్కీన్‌పై కూడా మెరిసేందుకు సిద్ధమవుతోంది. ‘Our Own Sky’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆమెతో పాటు ఆదిత్య ఖురానా, ఆసిఫా హక్ కూడా నటించనున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురూ ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడవనుండడం విశేషం.
‘ నేను చాలా ఏళ్ల నుంచి కేన్స్ చలన చిత్రోత్సవాన్ని చూస్తున్నాను. ఎంతో మంది ముద్దుగుమ్మలు, నటీమణులు, దిగ్గజాలు ఈ రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఇలాంటి అవకాశం నాకు లభించడం నా అదృష్టం. నాకెంతో ఆనందంగా ఉంది’ అని కేన్స్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చిందీ ట్యాలెంటెడ్ టీవీ యాక్ర్టెస్.

ఫ్యాషన్ ఐకాన్!
*1995లో పుణేలో పుట్టిన శివాంగి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో స్కూలింగ్ పూర్తి చేసింది.
*2013లో జీ టీవీలో ప్రసారమైన ‘ఖేల్ తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ’ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె..ఆ తర్వాత ‘బిన్తేహా’, ‘బేగుసారై’, ‘యే హై ఆషిఖీ,’ ‘ప్యార్ తూనే క్యా కియా’ సీరియళ్లతో మంచి గుర్తింపు సాధించుకుంది.
* సందర్భానుసారం తనదైన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించే శివాంగీ బుల్లితెరపై ‘ఫ్యాషన్ ఐకాన్’గా పేరు సంపాదించుకుంది.

*తన అందం, అభినయంతో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ అందాల తార..గతేడాది ‘మోస్ట్ సెక్సీయెస్ట్ ఏషియన్ వుమన్’ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం విశేషం.
*సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శివాంగి..తన లేటెస్ట్ ఫొటోలు, టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూ నిత్యం అభిమానులకు చేరువగా ఉంటుంది.
* ‘కేన్స్ లాంటి గ్లోబల్ ఈవెంట్లో క్యాట్ వాక్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి నా లుక్ ఎలా ఉండాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేలో జరిగే ఈ ఫెస్టివల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎలాంటి భయం లేదు’ అని చెబుతోందీ స్మాల్ స్ర్కీన్ సుందరి.