@teamvasundhara
ఈ ఏడాది అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు!
అరమరికల్లేని ఆలుమగల సంసారంలో మరిన్ని సంతోషాలు నిండాలంటే ముద్దులొలికే సిసింద్రీలతోనే సాధ్యం. అందుకే పెళ్లయిన ప్రతిజంట తమ ప్రేమకు ప్రతిరూపాలైన చిన్నారులకు ఎప్పుడెప్పుడు ఆహ్వానం పలుకుదామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా కొందరు ప్రముఖులు తమ ప్రాణంగా భావించే బుజ్జాయిలకు సాదరంగా స్వాగతం పలికారు. మరో మూడు రోజుల్లో 2019 ముగిసిపోతున్న తరుణంలో ఈ ఏడాది అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొంది తమ పసికూనల ఆలనాపాలనలో మునిగితేలుతున్న కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.
అర్పితా ఖాన్ ఇంట యువరాణి!
కొత్త సంవత్సరానికి మూడు రోజుల ముందే సల్మాన్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. డిసెంబర్ 27న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సల్మాన్ పుట్టిన రోజే అర్పిత మళ్లీ అమ్మగా ప్రమోషన్ పొందడం విశేషం. 2014 నవంబర్ 18న నటుడు ఆయుష్‌తో ‘నిఖా’ చేసుకున్న ఆమెకు ఇప్పటికే ‘ఆహిల్’ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. తాజాగా మరో బుజ్జాయికి జన్మనిచ్చి తల్లిగా మరో మెట్టు పైకెక్కిందామె. తన చిన్నారికి అయత్ శర్మ అని పేరు పెట్టుకున్న అర్పిత ఇన్‌స్టా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ‘ మా ఇంటి యువరాణి వచ్చేసింది. అయత్ శర్మ డిసెంబర్ 27న జన్మించింది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు ’ అని రాసుకొచ్చింది.
|
అమ్మయిన స్వప్నాదత్ !
‘ఎవడే సుబ్రమణ్యం,’ ‘మహానటి’ సినిమాలతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది స్వప్నా దత్. తండ్రి అశ్వనీదత్ పెద్ద కూతురిగా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న ఈ ఫిల్మ్‌మేకర్ ఈ ఏడాది అక్టోబర్‌లో అందమైన పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన కొద్దిరోజులకు క్యూట్ లుక్స్‌తో ఉన్న కూతురి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది స్వప్న. ‘ నా చిట్టి తల్లి నామకరణం కోసం చాలామంది పేర్లు చెప్పారు. వాటన్నింటిలో ఇంత కన్నా గొప్ప పేరు ఎంపిక చేయలేకపోయాను. నా కూతురి పేరు నవ్య వైజయంతి దత్’ అని తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసిందీ ట్యాలెంటెడ్ ప్రొడ్యూసర్.
|
అమీ ఇంట ఆండ్రియాస్!
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ ఈ ఏడాదే అమ్మగా ప్రమోషన్ పొందింది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయిటోవాతో ప్రేమలో పడిన ఈ బ్రిటిష్ బ్యూటీ వివాహం కాకుండానే గర్భం ధరించింది. అనంతరం మేలో ప్రేమికుడితో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుంది. ప్రసవానికి ముందు బేబీషవర్ వేడుకలు, మెటర్నిటీ ఫొటోషూట్లలో మెరిసిపోయిన ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ 23న ‘ఆండ్రియాస్’ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఆ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘ మా ఏంజెల్..వెల్కమ్ టు ది వరల్డ్ ఆండ్రియాస్’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చిందీ అందాల తార.
|
అద్దె గర్భంతో అమ్మయిన ఏక్తా..!
దర్శకనిర్మాతగా వెండితెరపైనే కాదు..బుల్లితెరపై కూడా సత్తా చాటుతూ ‘టీవీ మొఘల్’గా పేరు సంపాదించుకుంది ఏక్తాకపూర్. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రిగా దూసుకుపోతున్న ఆమె ఈ ఏడాది జనవరి 27న సరోగసీ(అద్దె గర్భం) ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అమ్మయిన నాలుగురోజుల తర్వాత ..‘ దేవుని దయతో నా లైఫ్‌లో చాలా విజయాలు చూశాను. అయితే ఓ మహిళకు పరిపూర్ణత ఎప్పుడంటే...అది అమ్మయిన తర్వాతే. ప్రస్తుతం నేను అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నాతో పాటు నా కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయమిది’ అని ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టిందీ ట్యాలెంటెడ్ వుమన్. సింగిల్ పేరెంట్‌గానే అమ్మగా మారిన ఏక్తా తన కుమారుడికి ‘రావీ కపూర్’ అని పేరు పెట్టుకుంది.
|
జూనియర్ రాంపాల్ వచ్చేశాడు!
ఇటీవలే మొదటి భార్య జెస్సికాతో అధికారికంగా విడుకులు తీసుకున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్. కానీ అంతకుముందు నుంచే దక్షిణాఫ్రికా మోడల్, ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ విమెన్‌లో ఒకరిగా పేరుగాంచిన గ్యాబ్రియెల్లాతో డేటింగ్ చేశాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ ఓ పాపాయికి జన్మనివ్వబోతుందని చెబుతూనే.. గ్యాబ్రియెల్లాతో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అనుకున్నట్లే గ్యాబ్రియెల్లా ఈ జులైలో ఓ బాబుకు జన్మనిచ్చింది. దీంతో మరోసారి తండ్రయిన అర్జున్... ఈ విషయాన్ని జులై 28న ఇన్‌స్టాలో పంచుకుంటూ మురిసిపోవడమే కాదు..తన చిన్నారికి అరిక్ రాంపాల్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం తన గర్ల్ ఫ్రెండ్, జూనియర్ రాంపాల్‌తో కలిసి హ్యాపీగా ఉన్నాడీ రొమాంటిక్ హీరో.
|
రెండోసారి అమ్మయిన సమీరా!
‘నరసింహుడు’, ‘అశోక్’, ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సమీరా రెడ్డి. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల్లోనూ మంచి విజయాలు అందుకుందీ ముద్దుగుమ్మ. 2014లో వ్యాపార వేత్త అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ 2015లో ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందిందీ అందాల తార. ఈ ఏడాది జులై 12న తన ఇంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిన వెంటనే తనను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘ఈరోజు ఉదయమే మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది. మై బేబీ గర్ల్! మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని కూతురి చేతిని పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది సమీరా.
|
ఈషా ఇంట మరో మహాలక్ష్మి!
‘ధూమ్ మచాలే..ధూమ్ మచాలే‘ అంటూ దుమ్ములేపే ఈ పాటలో తన డ్యాన్స్‌తో అదరగొట్టింది ఈషా డియోల్. బాలీవుడ్‌కు సంబంధించి నాజూకైన హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 2012లో ప్రముఖ వ్యాపారవేత్త భరత్ తఖ్తానీని పెళ్లాడింది. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 2017 అక్టోబర్‌లో రాధ్య అనే పాపాయికి జన్మనిచ్చింది ఈషా. ఈ ఏడాది ఆరంభంలోనే మరోసారి తల్లి కాబోతున్నానని ముందుగానే ప్రకటించిన ఆమె.. జూన్ 10న మరో పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తనదైన స్టైల్లో ఇన్‌స్టాలో పంచుకుందీ బ్యూటిఫుల్ మామ్. ఉయ్యాలలో ముద్దులొలుకుతున్న చిన్నారి, బొమ్మలు, పాలపీక, బహుమతులు..వంటి వాటితో ఓ అందమైన కార్టూన్ రూపొందించింది. దానిపై ‘బేబీ గర్ల్..పేరు-మిరాయా తక్తానీ.. 2019 జూన్ 10న పుట్టింది. ప్రేమతో అక్క-రాధ్య, పేరెంట్స్-ఈషా, భరత్ తక్తానీ’ ఇలా పాపాయికి సంబంధించిన విషయాలన్నీ రాసి ఉన్న ఆ కార్టూన్ ఫొటోను పోస్ట్ చేసి చివరకు ‘ మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాపై కురిపించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.
|
పండంటి పాపాయికి స్వాగతం చెప్పిన సుర్వీన్ !
‘హేట్ స్టోరీ ’, ‘పార్చ్డ్’ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ, పంజాబీ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది నటి సుర్వీన్ చావ్లా. 2015లో వ్యాపారవేత్త అక్షయ్ థాకర్తో ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఏప్రిల్ 15న ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తన గారాలపట్టికి ‘ఇవా’ అని పేరు పెట్టుకుందీ అందాల జంట. ప్రసవం జరిగిన నాలుగు రోజుల తర్వాత తన చిన్నారి పాదాల్ని ఫొటోలో బంధించి దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సుర్వీన్. ‘ బుజ్జి బుజ్జి షూస్ వేసుకోవడానికి మాకో బుజ్జి పాపాయి వచ్చేసింది. మా చిన్న కుటుంబంలోకి వచ్చిన బుజ్జి పాపాయికి వెల్కమ్’ అని తన చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేసిందీ అందాల తార.
|
ఈ జంటలు కూడా !
* కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మూడోసారి తండ్రయ్యాడు. కరిష్మాకు దూరమయ్యాక 2017లో ప్రముఖ బిజినెస్ వుమన్ ప్రియా సచ్దేవ్ను పెళ్లాడారు సంజయ్. ఈ క్రమంలో ఈ ఏడాది ‘అజారియస్ కపూర్’కు జన్మనిచ్చారీ లవ్లీకపుల్.
* ‘రేస్3’ సినిమాతో మెప్పించిన నటుడు ఫ్రెడ్డీ దారువాలా-క్రిస్టియల్ వరియావా దంపతులు కూడా ఈ ఏడాది అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. వరియావా ఈ ఏడాది ఫిబ్రవరి 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
* ‘జబ్ వియ్ మెట్’ సినిమాలో కరీనా సోదరిగా నటించిన సౌమ్యా టాండన్ దంపతులు ఈ ఏడాదే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ప్రస్తుతం బుల్లితెర హోస్ట్‌గా రాణిస్తోన్న ఆమె ఓ మగబిడ్డను ప్రసవించింది.
* బుల్లితెరపై సందడి చేస్తున్న జై భానుశాలి-మాహి విజ్ దంపతులకు ఈ ఏడాది ‘తార’ అనే పండంటి పాపాయి జన్మనిచ్చింది. వీరు అంతకంటే ముందు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు.
* బ్రిటిష్ రాయల్ కపుల్ ప్రిన్స్ హ్యారీ- మేగన్ మార్కల్ కూడా ఈ ఏడాదే పేరెంట్స్‌గా మరో మెట్టెక్కారు. ఈ ఏడాది మే 6న జన్మించిన వీరి మగ బిడ్డకు ‘ఆర్చి హ్యారీసన్ మౌంట్ బాటెన్ విండ్సర్’ అని పేరు పెట్టుకుందీ అందాల జంట.
|
|