గతంతో పోలిస్తే మహిళలకు స్వేచ్ఛ పెరిగింది. వివక్ష అనే తెరను బద్దలు కొట్టి విమానాలు, రాకెట్లలో అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ‘అన్నింటా ఆమె’ అంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు’ .. ఇలా ఎన్నో మాటలు వింటున్నాం. అయితే అదంతా నాణేనికి ఒకవైపే. అతివల కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా..వారిపై వివక్ష, వేధింపులు , హింస మాత్రం ఆగడం లేదు. దీనికి తాజా నిదర్శనమే హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్యోదంతం. భవిష్యత్‌పై బంగారు ఆశలు పెట్టుకున్న ఓ వెటర్నరీ డాక్టర్‌ను మనిషి ముసుగులో ఉన్న నాలుగు మృగాలు అత్యంత పాశవికంగా హతమార్చాయి. ‘మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది’ అన్న మాటను మరోసారి నిజం చేసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ దురాగతాన్ని ముక్తకంఠంతో ఖండించారు. నిందితులకు మరణ దండన విధించాల్సిందేనని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ అనౌష్కా శంకర్ ఈ దారుణ ఘటనపై తాజాగా స్పందించారు.

ఆ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది!
దేశ రాజధాని దిల్లీతో పాటు దేశాన్ని కుదిపేసిన ఘటన ‘నిర్భయ’. సరిగ్గా ఏడేళ్ల క్రితం జరిగిన ఈ అమానవీయ దారుణాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోరు. భారతదేశంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెబుతోంది అనౌష్క. ‘సితారా మ్యాస్ర్టో’ గా పేరు పొందిన పండిట్ రవిశంకర్ కూతురైన ఆమె ‘నిర్భయ’, ‘దిశ’ హత్యోదంతాలపై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
‘సరిగ్గా ఏడేళ్ల క్రితం దిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన ప్రపంచంతో పాటు నన్ను కూడా చాలా కదిలించింది. 2004లో సంభవించిన సునామీ కారణంగా గ్లోబుపై భూమి అక్షం ఒక వైపునకు ఎలా వంగిపోయి..రూపురేఖలు మారిపోయాయో సేమ్ టు సేమ్ ఆ అమానవీయ ఘటన నాలో మానసికంగా చాలా మార్పులను తీసుకొచ్చింది. ఆ దుండగుల చేతిలో నిర్భయ ఒక్కరే కాదు..నేను కూడా బలైపోయానన్న బాధ కలిగించింది.
ఇలాంటి ఆకృత్యాలు ఆగేలా మహిళల్లో చైతన్యం తెచ్చేలా ఉద్యమం చేసేందుకు అదే సరైన సమయం అనిపించింది. అందుకే నా వంతు బాధ్యతగా నేను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఓ వీడియో రూపంలో పంచుకున్నా ’ అని తన ఆవేదనకు అక్షరరూపమిచ్చింది అనౌష్క.

చట్టాలొచ్చినా మార్పు లేదే!
‘నిర్భయ’ ఘటనలో అసువులు బాసిన బాధితురాలి పేరుతోనే 2013లో ‘నిర్భయ’ చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. చట్టంలో భాగంగా మహిళల భద్రత కోసం రూ.వెయ్యి కోట్ల నిధులను కూడా కేటాయించింది. అది ప్రస్తుతం రూ.3600 కోట్లకు చేరుకుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పలు పథకాలు అమలుచేస్తున్నాయి. అయినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు..సరి కదా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఈ విషయంపైనే సూటిగా ప్రశ్నించింది అనౌష్క.
‘ఆడపిల్లల రక్షణ కోసం కొత్త చట్టాలు, కొత్త కోర్టులు ఏర్పాటవుతున్నాయి. కానీ వీటి వల్ల ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పుడు నిర్భయ దుండగుల చేతిలో దారుణంగా బలైపోయింది. ఇప్పుడు దిశ కూడా అలాగే దూరమైంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా మహిళలకు సరైన రక్షణ ఉండడం లేదు. నిర్భయ ఘటన తర్వాత..దిశ దారుణానికి ముందు కూడా ఇలాంటి దురాగతాలు చాలానే జరిగాయి. ఒక్కోసారి ఈ దురాగతాలపై బిగ్గరగా నా ఆవేదనని వ్యక్తం చేయాలనిపిస్తోంది. మరోసారి ఎలా స్పందించాలో అర్థం కాక మూగదానిగా ఉండిపోతున్నా. ఎందుకంటే మనం ఎంత గొంతు చించుకున్నా నిమిషానికో ఆడ కూతురు అఘాయిత్యానికి గురవుతోంది’ అని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ ట్యాలెంటెడ్ సింగర్.
‘మహిళలు కూడా సాటి మనుషులే’ అని చెప్పండి!
‘దిశ’ ఘటన నేపథ్యంలో మేల్కొన్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకోవాలని చెబుతున్నాయి. కానీ సమాజంలోని తిరుగుతున్న మానవ మృగాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. ఈ విషయంపై స్పందించిన అనౌష్క ‘ ఇలాంటి దురాగతాలకు మహిళల డ్రస్సింగ్ స్టైల్ కారణమని పలువురు చెబుతున్నారు. రాత్రి పూట ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీని బదులు అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో అబ్బాయిలకు కూడా నేర్పించండి. మమ్మల్ని తాకొద్దని..మా అనుమతి లేకుండా మా జీవితాల్లోకి రావొద్దని మగాళ్లకు చెప్పండి’ అని రాసుకొచ్చింది అనౌష్క.

నేనూ వేధింపులకు గురయ్యాను..
ప్రముఖ సితార విద్వాంసుడిగా పరిచయం అక్కర్లేని పేరు ‘ పండిట్ రవిశంకర్’. ఆయన కూతురు అనౌష్కా శంకర్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి ప్రముఖ గాయనిగా, సితార విద్యాంసురాలిగా పేరు తెచ్చుకుంది. అయితే చాలామందిలాగే తాను కూడా చిన్న వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ సింగర్ ‘ నా చిన్నతనంలో నా సంరక్షణ కోసం నా తల్లిదండ్రులు ఓ వ్యక్తిని నియమించారు. అతను మా అమ్మానాన్నలకు నమ్మకమైన వ్యక్తి. ఆ నమ్మకంతోనే నన్ను అతడికి అప్పగించారు. కానీ చాలామంది మగాళ్లలానే అతను కూడా తన దుర్బుద్ధిని చూపాడు. నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ లైంగికంగా వేధించేవాడు. ఇలా చాలా ఏళ్లపాటు నేను లైంగిక హింసకు గురయ్యాను. ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని వయసు నాది. నేను పెరిగి పెద్దయ్యాక కూడా ఈ అనుభవాలు నన్ను వెంటాడాయి. ఈ కారణంగా రాత్రి వేళల్లో ఒంటరిగా నడవడానికి కూడా భయపడేదాన్ని. ఎవరైనా టైం ఎంత అని అడిగినా సమాధానం చెప్పేదాన్ని కాదు’ అని చెప్పుకొచ్చిందీ సితార స్పెషలిస్ట్.