నేహా ధూపియా.. బాలీవుడ్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. తల్లయిన తర్వాత కూడా ఇటు బుజ్జాయి ఆలనా పాలనా చూస్తూనే.. సినిమాలు, సెలబ్రిటీ టాక్షోలకు సమయాన్ని కేటాయిస్తూ నేటి తరం మహిళలందరికీ స్ఫూర్తినిస్తోందీ సెలబ్రిటీ మామ్. గతేడాది మేలో తన మిత్రుడు అంగద్బేడీని వివాహం చేసుకున్న ఆమె నవంబర్లో ‘మెహ్ర్’ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక #Freedomtofeed పేరుతో బ్రెస్ట్ఫీడింగ్పై ఆమె నిర్వహించిన క్యాంపెయిన్ అందరినీ ఆలోచింపచేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తమ గారాల పట్టి మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రస్తుతం అమృత్సర్లో పర్యటిస్తున్నారు నేహా దంపతులు. అక్కడి స్వర్ణదేవాలయంతో పాటు సమీపంలోని పర్యటక ప్రదేశాలను సందర్శిస్తూ సేదతీరుతున్నారు.

స్వర్ణదేవాలయంలో పూజలు!
ఈ క్రమంలో స్వర్ణదేవాలయంతో పాటు అంగద్ బేడీ తండ్రి, ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీకి చెందిన పురాతన హవేలీని సందర్శించిన ఈ సెలబ్రిటీ కపుల్ తమ విహారయాత్ర విశేషాలను సోషల్మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ముందుగా సంప్రదాయ దుస్తులు ధరించి స్వర్ణదేవాలయంలో పూజలు చేశారీ లవ్లీకపుల్. ఈ ఫొటోలను తన ఇన్స్టా వేదికగా షేర్ చేసిన నేహా తన కూతురికి గురుదేవుని ఆశీస్సులు కావాలని ప్రార్థించింది. ఈ క్రమంలో పసుపు రంగు సల్వార్- కమీజ్లో నేహా, క్యాజువల్ షర్ట్, జీన్స్ ప్యాంటులో అంగద్ చూడముచ్చటగా కనిపించగా, తెలుపు రంగు సల్వార్ కుర్తాలో మెహ్ర్ మెరిసిపోయింది. అదేవిధంగా అంగద్ బేడీ కూడా తన గారాల పట్టితో దిగిన ఫొటోలను ఇన్స్టా ద్వారా షేర్ చేశాడు. గురుదేవుని దీవెనలు ఎల్లప్పుడూ మెహ్ర్పై ఉండాలని ఆకాంక్షిస్తూ క్యాప్షన్ జత చేశాడు.

లవ్యూ ఆల్!
మెహ్ర్ తాత, మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీకి చెందిన పురాతన హవేలీతో పాటు సమీపంలోని పలు పర్యటక ప్రదేశాల అందాలను వీక్షించారు నేహా- అంగద్ దంపతులు. ఈ క్రమంలో తన జన్మస్థలంలో విహరిస్తున్న కుమారుడు, కోడలు, మనమరాలి ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు బిషన్ సింగ్ బేడీ. ‘ నా మనమరాలు మెహ్ర్ ప్రస్తుతం నా జన్మస్థలంలో ఉంది. నా పురాతన హవేలీని దర్శించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఆ గురుదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. లవ్యూ ఆల్..’ అని తన ఆనందానికి అక్షరరూపమిచ్చాడీ మాజీ క్రికెటర్.

ఇక సినిమాల విషయానికొస్తే అంగద్ బేడీ ప్రస్తుతం ‘ ద కార్గిల్ గర్ల్’లో జాన్వీకపూర్ సోదరుడిగా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా నేహా ధూపియా ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో ‘ నో ఫిల్టర్ నేహా’ అనే టాక్ షోను విజయవంతంగా నిర్వహిస్తోంది.
Photos: https://www.instagram.com/p/B5FnBbEHqi8/