అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడం మంచిదేనా?
‘ఆడపిల్ల అంటే ఎప్పటికైనా ఆడ (అత్తారింటి) పిల్లే’ అన్న ఆలోచన ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో నానుతోంది. అమ్మాయి పుడితే పెంచలేనంత బరువైపోతుంది చాలామంది తల్లిదండ్రులకు! అందుకే పసి ప్రాయంలోనే వివాహ బంధంతో మోయలేనంత బరువును వారి కొంగున ముడేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచేస్తున్నారు. అమ్మాయిల పాలిట శాపంగా మారిన ఈ మూఢ నమ్మకాన్ని రూపుమాపాలనే వారి వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్ణయించి చట్టం తెచ్చినా.. దీనికి విరుద్ధంగా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో- మహిళల కనీస వివాహ వయో పరిమితిని ప్రస్తుతమున్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ దీని గురించి ప్రస్తావించారు.
ఇక అప్పట్నుంచి ఈ అంశంపై దేశంలో వాడీ-వేడీ చర్చ జరుగుతోంది. వివాహ వయో పరిమితిని పెంచడం మంచిదని కొందరు, కాదని మరికొందరు.. ఇలా దీనిపై విభిన్న వర్గాల్లో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో- ఆడపిల్లల వివాహ వయసు 21 ఏళ్లకు పెంచడం సబబేనా? స్త్రీ-పురుష సమానత్వం సాధించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందా? దీనివల్ల మహిళలకు ఒనగూరే ప్రయోజనాలేంటి? నష్టాలేమైనా ఎదుర్కోవాల్సి వస్తుందా? వీటిపై మీ అభిప్రాయాలను, సలహాలను వసుంధర.నెట్ వేదికగా పంచుకోండి..!