మీ వారు మీకు ఇంటి పనుల్లో ఎలా సహాయపడుతున్నారు?
‘అబ్బబ్బబ్బా.. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆఫీస్కెళ్లేదాకా వంటింటితోనే సావాసం చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి అన్నీ శానిటైజ్ చేయలేక ఛస్తున్నాను..! ఈయనొకరు.. ఆఫీస్కెళ్లడానికి సరిగ్గా అరగంట ముందు లేచి రడీ అవుతారు. బట్టల దగ్గర్నుంచి బాక్స్ దాకా అన్నీ నేనే అందివ్వాలి.. కాస్త ముందే లేచి నాకు ఆ పనిలోనో, ఈ పనిలోనో సాయపడచ్చుగా..!’ అంటూ తన భర్త మీద కస్సుబుస్సులాడుతోంది హిమజ.
‘ఈ కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో! అసలే ఇంటి పనులతో తీరిక దొరకట్లేదంటే.. బయట నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శుభ్రం చేయలేక నా తల ప్రాణం తోకకొస్తోంది. ఇక మా ఆయనకు తన వస్తువులు తాను శానిటైజ్ చేసుకోవడం కూడా బద్ధకమే.. అలాంటప్పుడు నాకు వంటింట్లో సహాయపడతారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అమ్మో.. అప్పుడే తొమ్మిదవుతోంది.. త్వరగా పని పూర్తి చేసుకొని పదింటికల్లా లాగిన్ అవ్వాలి!’ అంటూ ఇంటి నుంచే పని చేస్తోన్న మహిజ తన గోడును వెళ్లబోసుకుంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అనుభవాలు మనకూ సహజమే కదా! వృత్తిఉద్యోగాలు చేసే వారైనా, గృహిణులైనా ఈ అధిక పని భారాన్ని మోయలేకపోతున్నారు. తమ భర్తలు ఇంటి పనుల్లో కొంత వరకు సహాయపడినా అదే తమకు పదివేలనుకుంటున్నారు.
మరి, ఈ కరోనా వల్ల మీపై అధికంగా పడిన ఇంటిపనంతా కష్టమో, నిష్టూరమో మీరొక్కరే చేసుకుంటున్నారా? లేదంటే మీ వారు మీకు సహాయపడుతూ పనిభారాన్ని కొంతైనా తగ్గిస్తున్నారా? అలా అయితే మీ భాగస్వామి ఎలాంటి పనుల్లో భాగం పంచుకుంటున్నారు? మీ వారు ఇంకా ఎలాంటి పనుల్లో పాలుపంచుకుంటే బాగుంటుందనుకుంటున్నారు? ఇలా భార్యాభర్తలిద్దరూ ఇంటి పనుల్ని పంచుకుంటూ కలుపుగోలుగా ముందుకు సాగడం వల్ల దాంపత్య బంధంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? మీ అనుభవాలను, అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి.. ఆలుమగల అన్యోన్యతకు ప్రత్యక్ష ఉదాహరణగా, మరికొంతమంది దంపతులకు ఆదర్శంగా నిలవండి! ఎంతైనా, ఏదైనా కలిసి పంచుకుంటేనే కదా.. ఆలుమగల అనుబంధానికి అందం, ఆనందం!