‘నిర్భయ’ దోషుల ఉరితో ఇకనైనా ఆడపిల్ల భద్రమేనా?
‘ముందు అన్యాయానిదే పైచేయి కావచ్చు.. కానీ చివరికి న్యాయానిదే గెలుపు.. అదే అసలైన తీర్పు..’ గొప్పవాళ్లు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అక్షరసత్యంగా పరిణమించాయి. ఏడేళ్ల కిందట ఓ అమ్మాయికి జరిగిన అన్యాయానికి, ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతోన్న ఓ తల్లి ఆవేదనకు తెరదించుతూ నేడు ‘నిర్భయ’ దోషుల్ని ఉరితీశారు. ఆడపిల్లల వైపు కామంతో చూసే ఏ కంటికీ ఈ భూమిపై బతికే హక్కు లేదని మరోసారి రుజువు చేశారు. ఏదైతేనేం.. కాస్త ముందో వెనకో న్యాయమే గెలిచింది.. ఏడేళ్లుగా ఘోషిస్తోన్న ‘నిర్భయ’ ఆత్మ నేడు శాంతించింది..
ఏడేళ్లుగా న్యాయాన్యాయాలు దోబూచులాడినా ‘నిర్భయ’ కేసులో చివరికి న్యాయమే గెలిచింది. అయితే దోషుల ఉరితో ఇకనైనా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగుతాయా? కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల భయం లేకుండా ఇకనైనా మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరా? మన భద్రతకు సమాజం భరోసా ఇవ్వగలదా? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే రోజే దేశానికి అసలైన స్వాతంత్ర్యం అన్న గాంధీజీ కల నెరవేరుతుందా? మహిళలపై అఘాయిత్యాలను పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా ఎలాంటి కఠిన చర్యలు అవసరం? చట్టాల్లో ఎలాంటి మార్పులు-చేర్పులు చేయాలి? వీటన్నింటిపై మీ మదిలో మెదిలే భావాలకు ‘వసుంధర.నెట్’ వేదికగా అక్షర రూపమివ్వండి.. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలను అందరితో పంచుకోండి.