వీటిని ఎలా ఆపుదాం??

ఓవైపు దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న కొద్దీ.. మరోవైపు ఆడవారి రక్షణ అడుగంటిపోతోంది. ఇందుకు తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్, వరంగల్‌లలో జరిగిన వరుస సంఘటనలే సాక్ష్యం. పంక్చర్ అయిన స్కూటీని బాగు చేయిస్తామని నమ్మబలికి ఓ పశువైద్యురాలిపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన కామపిశాచులు కొందరైతే.. పుట్టినరోజు నాడే స్నేహితురాలిని హత్యాచారం చేసి కాటికి పంపి స్నేహమనే బంధానికే మాయని మచ్చ తెచ్చిన మానవ మృగం మరొకరు.

మానవత్వమే సిగ్గుపడి తలదించుకునేలా చేసిన ఈ దుర్ఘటనలతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ భారతదేశమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను తలచుకొని భయంతో వణికిపోయారు. ఒక్కరోజే కాదు.. ప్రతిరోజూ ఏదో మూలన ఆడవారిపై జరుగుతోన్న ఇలాంటి అరాచకాల్లో వెలుగు చూసేవి కొన్నైతే.. చీకటి మాటునే కనుమరుగైపోయేవి మరెన్నో!

మరి, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయలేమా? పసి మొగ్గల దగ్గర్నుంచి మలి వయసులో ఉన్న ఆడవారి దాకా ఇలా బలి కాకూడదంటే, వారి రక్షణ గాల్లో దీపంలా మారకూడదంటే మనమంతా ఏం చేయాలి? తల్లిదండ్రులుగా పిల్లలకు చిన్నతనం నుంచే ఎలాంటి విషయాలను నేర్పించాలి? ఆడ-మగ తేడా చూపకుండా పిల్లల్ని పెంచితే ఇలాంటి అఘాయిత్యాలు ఆగుతాయా? ఏమాత్రం రక్షణ లేని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు అమ్మాయి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ మదిలో కలిగిన భావాలకు ‘వసుంధర.నెట్’ వేదికగా అక్షర రూపమివ్వండి.. ఇలా మీరు చెప్పే మంచి విషయాలు ఎందరో అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడడంతో పాటు వారికి రక్షణ కవచాన్ని ఏర్పరచినవారవుతారు.