చలికాలమొచ్చిందంటే వార్డ్‌రోబ్‌లో దాచుకున్న స్వెట్టర్లు, శాలువాలు బయటికి తీస్తాం. ఇక ఈ విషయంలో కాస్త ఫ్యాషనబుల్‌గా ఆలోచించే వారైతే ఎప్పటికప్పుడు ఆదరణలో ఉన్న వింటర్ వేర్‌ను కొనడానికీ వెనకాడరు. ఈ క్రమంలో స్వెట్టర్లే కాదు.. వింటర్ జాకెట్స్‌ని ధరించే అమ్మాయిలు నానాటికీ పెరిగిపోతున్నారు. అటు చలి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇటు మనల్ని స్టైలిష్‌గా కనిపించేలా చేయడంలో ఇవి ముందుంటాయి. ఇలా అతివల అభిరుచులకు తగినట్లుగానే విభిన్న ఫ్యాషనబుల్ వింటర్ జాకెట్స్‌ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ దగ్గర్నుంచి ట్రెండీ అవుట్‌ఫిట్స్ దాకా దేనిపైనైనా వీటిని మ్యాచ్ చేసి స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు. మరి, ప్రస్తుతం మగువల మనసు దోచుకుంటోన్న అలాంటి కొన్ని వింటర్ జాకెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
‘లెదర్’తో లవ్లీ లుక్!
సాధారణంగా లెదర్ అనగానే మనకు బ్యాగులు, పర్సులే గుర్తొస్తాయి. కానీ ఇదే ఫ్యాబ్రిక్‌తో స్టైలిష్ జాకెట్స్‌ని సైతం రూపొందిస్తున్నారు డిజైనర్లు. కాస్త మందంగా, చిక్కగా ఉండే ఈ తరహా జాకెట్లు చలిగాలులు శరీరానికి తాకకుండా రక్షణ కల్పిస్తాయి. అంతేనా.. అదే సమయంలో స్టైలిష్ లుక్‌ని సైతం మనకు అందిస్తాయి. అందుకే ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు చలికాలంలో లెదర్ జాకెట్స్‌ని ఎంచుకుంటున్నారు.
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అదే చేసింది. నలుపు రంగు ఫార్మల్ డ్రస్‌పై అదే రంగు షార్ట్ లెదర్ జాకెట్‌తో మెరుపులు మెరిపించింది. ఇక దీని బోర్డర్స్కి బటన్స్ అంత పెద్ద పెద్ద రంధ్రాల్లా రావడంతో మరింత మోడ్రన్‌గా కనిపించిందని చెప్పచ్చు. ఇలాంటి లెదర్ జాకెట్‌ని ఫార్మల్ వేర్‌కు మ్యాచ్ చేస్తే అదరగొట్టేయచ్చు. అంతేకాదు.. రాత్రి పూట జరిగే పార్టీలు, బిజినెస్ ఈవెంట్లకు ఈ తరహా జాకెట్లను ఎంచుకుంటే అటు చలి నుంచి రక్షణతో పాటు స్టైలిష్ లుక్‌ని సైతం సొంతం చేసుకోవచ్చు.
పఫర్ జాకెట్ - ఫర్ హుడీ!
ఎంత మందంగా ఉండే జాకెట్ ధరిస్తే చలి నుంచి అంతలా రక్షణ ఉంటుందనుకుంటాం. ఈ క్రమంలో పఫర్ జాకెట్స్‌ని ఎంచుకునేవారు మనలో చాలామందే ఉంటారు. అయితే వీటికి అనుసంధానించి రూపొందించిన హుడీల విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. ఈ క్రమంలో ఫర్‌తో రూపొందించిన హుడీలున్న జాకెట్స్‌ని ఎంచుకొని మెరిసిపోతున్నారు.
బాలీవుడ్ టాల్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా అలాంటి జాకెట్‌లోనే అదరగొట్టేసింది. క్రీమ్ కలర్ ఫర్ హుడీతో కూడిన ఆర్మీ ప్రింట్ పఫర్ జాకెట్‌ని ధరించింది క్యాట్. ఆరెంజ్ కలర్ అవుట్‌ఫిట్‌కి ఈ జాకెట్‌ని జత చేసి ట్రెండీగా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. కేవలం హుడీనే కాదు.. ఫర్‌తో రూపొందించిన జాకెట్స్ సైతం ప్రస్తుతం మార్కెట్లో మగువల మనసు దోచుకుంటున్నాయి. ఇవి చలి నుంచి రక్షణ కల్పించడమే కాదు.. శరీరానికి సుతిమెత్తగా తాకుతూ ఎంతో కంఫర్టబుల్‌గానూ ఉంటాయి. ఎలాంటి డ్రస్పైకైనా, ఏ సందర్భంలోనైనా వీటిని ధరించి మెరిసిపోవచ్చు.
టాప్ టు బాటమ్ ‘వెల్వెట్’ మయం!
చలికాలంలో జాకెట్స్ మాత్రమే ధరిస్తే సగం శరీరానికే చలి నుంచి రక్షణ ఉంటుంది కదా అనుకునే వారు వెల్వెట్‌తో రూపొందించిన ఈ కోట్ సూట్‌ని ఎంచుకోవచ్చు.
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలాంటి అవుట్‌ఫిట్‌లోనే మెరిసిపోయింది. కాఫీ కలర్ వెల్వెట్ ప్యాంట్, దానికి అదే రంగు కోట్ని జత చేసిన తమ్మూ.. ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. మెడలో ట్రెండీ నెక్‌పీస్, హెవీ మేకప్, బన్ హెయిర్‌స్టైల్‌తో ముస్తాబైన ఈ చిన్నది.. బాసీ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇలాంటి వెల్వెట్ కోట్ సూట్స్ విభిన్న కలర్స్‌లో లభిస్తున్నాయి. రాత్రిపూట జరిగే బిజినెస్ పార్టీలు, ఆఫీస్ మీటింగ్స్‌లో ఇటు లేడీ బాస్‌లా కనిపిస్తూనే అటు చలి నుంచి రక్షణ పొందాలంటే వెల్వెట్ కోట్ సూట్ చక్కటి ఎంపిక అని సూచిస్తున్నారు ఫ్యాషనర్లు.
రగ్గు కాదు.. జాకెట్!
చలి నుంచి తమను తాము రక్షించుకునే క్రమంలో మందంగా ఉండే జాకెట్స్‌ని ఎంచుకునే వారు కొందరైతే.. పలుచగా ఉండే జాకెట్స్‌ని ఇష్టపడే వారు మరికొందరుంటారు. అలాంటి వారు అక్రిలిక్ జాకెట్‌ని తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవచ్చు. సాధారణంగా రగ్గులు తయారుచేసే ఓవెన్ అక్రిలిక్ మెటీరియల్‌తో వీటిని రూపొందిస్తారు.
ఇటు వెచ్చదనాన్ని పంచుతూనే.. అటు శరీరంపై తేలిగ్గా, కంఫర్టబుల్‌గా ఒదిగిపోయే ఈ తరహా జాకెట్‌లోనే తళుక్కుమంది శ్రద్ధా కపూర్. ఎరుపు రంగు చెక్స్ ప్యాటర్న్‌తో రూపొందించిన ఈ జాకెట్‌పై అక్కడక్కడా ఫ్లోరల్ డిజైన్ రావడంతో దీని లుక్ మరింతగా ఇనుమడించిందని చెప్పచ్చు. జీన్స్-టీషర్ట్స్, బాడీకాన్ డ్రస్సులు, షార్ట్స్.. వంటి మోడ్రన్ అవుట్‌ఫిట్స్ పైకి వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అటు స్టైలిష్‌గా, ఇటు సౌకర్యవంతంగా మెరిసిపోవచ్చు.
చీరకు జాకెట్ సొగసులు!
చక్కగా చీర కట్టుకున్నాం.. దానిపై నుంచి స్వెట్టరో, జాకెటో వేసుకున్నామనుకోండి.. మొత్తం లుక్కే మారిపోతుంది. అలా కాకుండా చీరకట్టులో మెరిసిపోతూనే.. చలి నుంచి రక్షణ పొందాలంటే చీరకు మ్యాచయ్యే లాంగ్ కోట్/జాకెట్‌ను మీ శారీకి మ్యాచ్ చేస్తే సరి. కావాలంటే విద్యాబాలన్ అవుట్ఫిట్పై ఓ లుక్కేయండి.
పౌడర్ కలర్ చీరపై అదే రంగు లాంగ్ జాకెట్‌ను జత చేసిందీ బాలీవుడ్ భామ. ఇలా చీర పైనా మ్యాచింగ్ జాకెట్‌ని జత చేస్తూ అటు చలి నుంచి రక్షణ పొందుతూనే, ఇటు స్టైల్ కోషెంట్‌ని కూడా పెంచుకోవచ్చని నిరూపించింది. ఇక తన అవుట్‌ఫిట్‌కి జతగా బ్లాక్ గాగుల్స్, బన్ హెయిర్‌స్టైల్‌తో అదరగొట్టేసింది విద్య. మరి, మీరూ అలా ఈవెనింగ్ పార్టీస్‌లో చలి నుంచి రక్షణ పొందుతూనే స్టైలిష్‌గా సందడి చేయాలనుకుంటున్నారా? అయితే విద్యను ఫాలో అయిపోండి..!
‘డెనిమ్’ కాస్త పొడవైంది!
డెనిమ్ జాకెట్స్.. ఇవి దాదాపు అమ్మాయిందరి వార్డ్‌రోబ్‌లో ఉండేవే! అయితే చాలా వరకు డెనిమ్ జాకెట్స్.. పొట్టిగా, స్లీవ్స్ చిన్నగా ఉన్నవే లభిస్తుంటాయి. మరి, ఈ చలికాలంలో అలాంటివి మాకు కంఫర్టబుల్‌గా ఉండవు అనుకున్న వాళ్లు కాస్త పొడవాటి డెనిమ్ జాకెట్స్‌ని మీ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవచ్చు. ఇందులోనూ అక్కడక్కడా రంగు వెలిసిపోయినట్లుగా ఉండే ఫంకీ డెనిమ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
నోరా ఫతేహీ జాకెట్ కూడా అలాంటిదే! తెలుపు రంగు షార్ట్ డ్రస్ పైకి కాస్త పొడవాటి డెనిమ్ జాకెట్‌ని జత చేసి అదరగొట్టేసిందీ బాలీవుడ్ బ్యూటీ. ఇక వదులైన హెయిర్‌స్టైల్, హూప్ ఇయర్‌రింగ్స్‌తో మరింత స్టైలిష్‌గా ముస్తాబైన ఈ బ్యూటీ.. ఈ చలికాలంలో డెనిమ్ జాకెట్స్ ఏ దుస్తులపైకైనా ఇట్టే నప్పేస్తాయని చెప్పకనే చెబుతోంది.
చూశారుగా.. చలి నుంచి రక్షణ కల్పించేందుకు ఎన్ని రకాల జాకెట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో! మరి, మీరూ వీటిని ఎంచుకొని అటు స్టైలిష్‌గా, ఇటు వెచ్చవెచ్చగా చలికాలాన్ని ఆస్వాదించండి..!