Photos: Instagram
పెళ్లంటే చీరే కట్టుకోవాలి.. ఇది ఒకప్పటి మాట! ఇక ఇప్పటి అమ్మాయిలంతా తమ పెళ్లికి లెహెంగాల జపం చేస్తున్నారు. అంతేనా.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదంటే అది అతిశయోక్తి కాదు. మనలాంటి సామాన్యులే పెళ్లి దుస్తుల కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటే.. ఇక సెలబ్రిటీల మాటేంటి? నిజానికి మన ముద్దుగుమ్మలు తమ పెళ్లికి ధరించిన బ్రైడల్ లెహెంగాల ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అంతేకాదు.. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ భారీ డిజైనర్ లెహెంగాల్ని ఎంచుకుంటున్నారేమో అనిపిస్తుంది వారి వెడ్డింగ్ అటైర్స్ చూస్తుంటే..!
డ్యాషింగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో ఇటీవలే ఏడడుగులు నడిచిన ధనశ్రీ వర్మ కూడా అదే చేసింది. ఎరుపు రంగు డిజైనర్ లెహెంగాలో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ బ్రైడల్ అటైర్ ధరెంతో తెలుసుకుందామని అలా శోధించి.. ఇలా అవాక్కయ్యారు ఫ్యాషన్ ప్రియులు. ఇందుకు కారణం దాని ధర కొన్ని లక్షల్లో ఉండడమే! అంతేనా.. గతంలోనూ మన బాలీవుడ్ భామలు తమ పెళ్లి కోసం కాస్ట్లీ లెహెంగాల్నే ఎంచుకున్నారు. ఇంతకీ వాటి ధరెంతో మనమూ తెలుసుకుందాం రండి..!
సాధారణంగా బయట షాపుల్లో దొరికే లెహెంగాలే వేలు ఖర్చు చేస్తే కానీ మన వార్డ్‌రోబ్‌లో చేరవు. అలాంటిది మన ఫ్యాషన్ సెన్స్ అంతా ఉపయోగించి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న లెహెంగా ధర మనకు అందనంత ఎత్తులో ఉంటుంది. సెలబ్రిటీలైతే లక్షలు ఖర్చు చేసి వాటిని అందుకొని మరీ మెరిసిపోతున్నారు. అలాంటి క్లాసీ కమ్ కాస్ట్లీ లెహెంగాలే ఇవి!
అక్షరాలా ఆరు లక్షలు!
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, తన ప్రియురాలు ధనశ్రీ వర్మతో ఇటీవలే ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే! పెళ్లిలో ఎంతో లవ్లీగా మెరిసిపోయిన ఈ వధూవరులిద్దరినీ చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఎరుపు రంగు బ్రైడల్ లెహెంగాలో తళుక్కుమన్న ధనశ్రీ ఫొటో ఫ్యాషన్ ప్రియుల మదిలో అలాగే నిలిచిపోయిందని చెప్పచ్చు. ఇంతకీ ఈ అటైర్ ధరెంతో చూద్దామని నెట్టింట్లో వెతికిన అమ్మాయిలు దాని ధర తెలుసుకొని అవాక్కైనంత పనిచేశారనుకోండి. మరి, దీని ధరెంతంటే.. అక్షరాలా ఆరు లక్షలట!
ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ రూపొందించిన ఎరుపు రంగు భారీ డిజైనర్ వర్క్ చేసిన రా సిల్క్ లెహెంగాలో మెరిసిపోయింది ధనశ్రీ. దీనికి జతగా మెరూన్ కలర్ త్రీ-బై ఫోర్త్ స్లీవ్స్ వెల్వెట్ బ్లౌజ్, టల్లే దుపట్టాను మ్యాచ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్రెడిషనల్ కమ్ ట్రెండీగా దర్శనమిచ్చింది. ఇక భారీ ఆభరణాలు, పువ్వులతో అలంకరించిన బన్ హెయిర్‌స్టైల్ ఆమెకు పర్ఫెక్ట్ బ్రైడల్ లుక్‌ని తీసుకొచ్చాయి. ఇలా మొత్తానికి కాస్ట్లీ వెడ్డింగ్ లెహెంగాతో అదరగొట్టేసిందీ క్యూటీ.
దీపిక ‘బ్రైడల్’ మెరుపుల్!
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ దీపిక-రణ్వీర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తైంది. అయినప్పటికీ దీప్స్ తన పెళ్లిలో ధరించిన వెడ్డింగ్ లెహెంగా మాత్రం ఇప్పటికీ మగువల మదిలో అలాగే నిలిచిపోయింది. అంతటి సోయగం దాని సొంతం. ఇటలీ వేదికగా కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో రణ్వీర్తో ఏడడుగులు నడిచిన దీప్స్.. తన సింధీ వెడ్డింగ్ కోసం సవ్యసాచి రూపొందించిన ఎరుపు రంగు లెహెంగాను ఎంచుకుంది. ఈ బ్రైడల్ అటైర్లోని అణువణువూ ప్రత్యేకమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చేత్తో హంగులద్దిన ఈ వెడ్డింగ్ లెహెంగాకు జతగా ధరించిన దుపట్టా అన్నింటికంటే హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. దీని బోర్డర్‌పై ‘సదా సౌభాగ్యవతీ భవ’ అని దేవనాగరి లిపిలో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుపట్టాను హెవీగా డిజైన్ చేయడంతో ఆమె అందం మరింతగా ఇనుమడించింది. ఇక భారీ ఆభరణాలు, హెవీ మేకప్‌తో మెరిసిపోయిన దీప్స్.. దేవకన్యలా దర్శనమిచ్చింది. ఇంతకీ ఈ చక్కనమ్మ ధరించిన ఈ లెహెంగా ధరెంతో చెప్పనేలేదు కదూ! రూ. 8.95 లక్షలకు పైమాటేనట!
110 మంది కళాకారులు.. 3720 పని గంటలు..!
రెండేళ్ల క్రితం తన ఇష్టసఖుడు నిక్ జొనాస్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగిడింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఒక్కటైన ఈ జంట.. పెళ్లిలో ఆద్యంతం చూడముచ్చటగా మెరిసిపోయారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో పీసీ ఎరుపు రంగు భారీ లెహెంగాలో దర్శనమిచ్చింది. ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన ఈ బ్రైడల్ అటైర్పై హ్యాండ్కట్ ఆర్గంజా పూల సొగసులు, లేయర్లుగా చేసిన త్రెడ్‌వర్క్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. 110 మంది కళాకారులు, 3720 గంటలు కష్టపడితే కానీ ఈ లెహెంగాకు రూపమొచ్చిందంటే ఈ మాస్టర్‌పీస్‌లో ఎన్ని హంగులు దాగున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దీని ధర రూ.18 లక్షలకు పైగానే ఉంటుందంటూ అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇక ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రెజ్లర్ బబితా ఫోగట్ కూడా అచ్చం ఇలాంటి బ్రైడల్ లెహెంగాలోనే మెరిసిపోయింది.
పువ్వుల్లో దాగున్న అతిశయం!
తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లితో శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు విరుష్క జంట. 2017లో ఇటలీ వేదికగా ఒక్కటైన ఈ బ్యూటిఫుల్ కపుల్.. తమ పెళ్లిలో మిక్స్ అండ్ మ్యాచ్ అవుట్‌ఫిట్స్‌తో మెరిసిపోయారు. ముఖ్యంగా అనుష్క ధరించిన బ్రైడల్ లెహెంగా ఫొటోలు అప్పట్లో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి అద్భుతమైన ఫ్యాషన్ నైపుణ్యం నుంచి జాలువారిన పౌడర్ పింక్ లెహెంగాలో మెరిసిపోయిందీ చక్కనమ్మ. ఇక లెహెంగా స్కర్ట్, బ్లౌజ్, షీర్ దుపట్టా.. ఇలా అన్నీ మ్యాచింగ్ కలర్లోనే ఎంచుకోవడంతో పాటు వాటిపై చేసిన పువ్వుల ఎంబ్రాయిడరీ చూపు తిప్పుకోనివ్వనంత రమ్యంగా ఉందంటే అది అతిశయోక్తి కాదు. ఇలా తన బ్రైడల్ లెహెంగాపై తాను ధరించిన భారీ ఆభరణాలను కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తళుక్కుమందీ బాలీవుడ్ భామ. ఇంతకీ ఈ లెహెంగా ధర ఎంతో చెప్పనే లేదు కదూ!! రూ. 30 లక్షలకు పైమాటేనట! ఇలా ఈ ముద్దుగుమ్మ బ్రైడల్ అటైర్‌ను చూసి స్ఫూర్తి పొందిన ఓ అమ్మాయి.. తన పెళ్లి కోసం అచ్చం ఇలాంటి లెహెంగానే ఎంచుకోవడంతో మరోసారి వార్తల్లోకెక్కిందీ వెడ్డింగ్ అటైర్.
అందరి అంచనాలకు మించి..!
ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ప్రయోగాలు చేస్తూ బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరు తెచ్చుకుంది సొగసుల సోనమ్ కపూర్. సందర్భానికి తగినట్లుగా తనదైన ఫ్యాషన్లతో మెరిసిపోయే ఈ చక్కనమ్మ.. తన పెళ్లికి ఎలాంటి అవుట్‌ఫిట్ ఎంచుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలకు మించిన బ్రైడల్ అవతార్‌లో అదరగొట్టేసిందీ క్యూటీ. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ఏడడుగులు నడిచిన ఈ బాలీవుడ్ బేబ్.. పెళ్లిలో ఎరుపు రంగు భారీ డిజైనర్ లెహెంగాలో దర్శనమిచ్చింది. అనురాధా వకీల్ రూపొందించిన ఈ లెహెంగాపై గోల్డెన్ పువ్వుల డిజైన్, బోర్డర్‌కు పూర్తిగా ఎంబ్రాయిడరీ హంగులద్దారు. ఇక దీనికి మ్యాచింగ్‌గా ధరించిన ఎరుపు రంగు దుపట్టా మరింత హెవీగా డిజైన్ చేశారు. ఇలా తన వెడ్డింగ్ అటైర్‌కు జతగా తన తల్లి సునీతా కపూర్ ఆమె పెళ్లిలో ధరించిన జ్యుయలరీకి ఆధునిక హంగులద్ది తన వివాహంలో భాగం చేసుకుంది సోనమ్. స్టోన్స్, ముత్యాలతో రూపొందించిన ఈ భారీ ఆభరణాలు ఆమె బ్రైడల్ లుక్‌ని సంపూర్ణం చేశాయి. ఇలా మొత్తానికి తన పెళ్లిలో మెరుపులు మెరిపించిన ఈ సొగసరి ఎంచుకున్న బ్రైడల్ లెహెంగాకు భారీగానే ఖర్చుపెట్టిందట. దీని ధర రూ. 70 లక్షలకు పైగానే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
వీరితో పాటు గతంలో కరీనా కపూర్, జెనీలియా, శిల్పాశెట్టి, ఈషా డియోల్, బిపాసా బసు.. వంటి ముద్దుగుమ్మలు కూడా తమ పెళ్లి, రిసెప్షన్.. మొదలైన పెళ్లి వేడుకల్లో భారీ డిజైనర్ లెహెంగాలతో మెరిసిపోయారు. తమ ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా లక్షలు ఖర్చు పెట్టి డిజైన్ చేయించుకొని మరీ లవ్లీ బ్రైడ్‌గా ఓ వెలుగు వెలిగారు. అంతేనా.. వీరి బ్రైడల్ అటైర్స్కు ముగ్ధులైన కొందరు మగువలు తమ పెళ్లిళ్లలో ఈ తరహా అవుట్‌ఫిట్స్‌కి చోటిచ్చారు కూడా! మరి, మీరూ ఈ జాబితాలో ఉన్నారా? అయితే మీ బ్రైడల్ అటైర్స్ గురించి కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి..! నలుగురికీ ఫ్యాషన్ పాఠాలు నేర్పండి!