Photo: Instagram
సాధారణంగా ఎవరైనా వేసుకున్న డ్రస్ మనకు నచ్చిందనుకోండి.. వెంటనే దాని ధరెంతో ఆన్లైన్లో వెతికేస్తుంటాం. ఒకవేళ అది మన బడ్జెట్‌కు అందనంత ఎత్తులో ఉంటే ‘వామ్మో.. అంత రేటా?’ అంటూ నోరెళ్లబెడతాం. ‘నిశ్చయ్’ వివాహంలో మెగా కుటుంబ సభ్యులు ఎంచుకున్న అవుట్‌ఫిట్స్, యాక్సెసరీస్ ధర చూసి నెటిజన్లు అచ్చం ఇలాంటి ఎక్స్‌ప్రెషనే ఇస్తున్నారు. కారణం.. వాటి ధర లక్షల్లో ఉండడమే! మెగా, అల్లు కుటుంబాలకు చెందిన ఆడపడుచులు, కోడళ్లు.. ఈ ఐదు రోజుల పెళ్లిలో చేసిన ఫ్యాషన్ హంగామా అంతా ఇంతా కాదు. ఉదయ్‌పూర్ బయల్దేరడం దగ్గర్నుంచి పోస్ట్-వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ దాకా ప్రముఖ డిజైనర్లు రూపొందించిన స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారీ చక్కనమ్మలు. అవుట్‌ఫిట్స్ దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా, మేకప్ దగ్గర్నుంచి హెయిర్‌స్టైల్ దాకా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ రడీ అయ్యారంటే అది అతిశయోక్తి కాదు. మరి, ఇలా తమవైన ఫ్యాషన్లతో ఈ మెగా ఈవెంట్లో సందడి చేసిన ఆ చక్కనమ్మలెవరు? వారు ఏయే వేడుకల్లో ఎలా మెరిసిపోయారు? ఆ ఫ్యాషన్ల ఖరీదెంత? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
గత పది రోజులుగా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది నిశ్చయ్ వివాహం. నిహారికను పెళ్లి కూతురిని చేయడంతో మొదలైన ఈ వేడుకలు రిసెప్షన్‌తో ముగిశాయి. అయితే ఒక్కో వేడుకలో ఇటు మెగా కుటుంబం, అటు అల్లువారి కుటుంబం చేసిన ఫ్యాషన్ హంగామా ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసిందని చెప్పచ్చు. ఈ క్రమంలో చిరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ; కోడలు ఉపాసన; అల్లు అర్జున్ భార్య స్నేహ.. తదితరులు అదిరిపోయే ఫ్యాషన్లతో హంగామా సృష్టించారు. దాంతో వెంటనే వారు ధరించిన అవుట్‌ఫిట్స్ గురించి ఇంటర్నెట్లో శోధించడం మొదలుపెట్టేశారు నెటిజన్లు. ఇంకేముంది.. వాటి ధర లక్షల్లో ఉండడంతో నోరెళ్లబెట్టడం వీరి వంతైంది!
లాంగ్ ఫ్రాక్‌లో ‘క్యూటీ’!
సందర్భానికి తగినట్లుగా అటు ట్రెడిషనల్‌గా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయే అల్లు అర్జున్ సతీమణి స్నేహ.. నిహారిక పెళ్లిలో తన ఫ్యాషన్ హవాను మరోసారి కొనసాగించింది. మోడ్రన్ డ్రస్సుల దగ్గర్నుంచి చీర దాకా ఆయా సందర్భాలకు తగినట్లుగా సరికొత్త ఫ్యాషన్లను ధరించి అందరి మనసుల్ని కట్టిపడేసిందీ స్టైలిష్ బేబ్. అయితే నిహా పెళ్లి కోసం ఉదయ్ పూర్ బయల్దేరేటప్పుడు స్నేహ ధరించిన అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియుల మనసుల్ని దోచుకుంది. ఈ క్రమంలో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే రూపొందించిన ఊదా రంగు స్లీవ్‌లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఈ అల్లు వారి కోడలు పిల్ల.. తన డ్రస్‌కు జతగా డియోర్ కంపెనీ డిజైన్ చేసిన శాడిల్ స్లింగ్ బ్యాగ్ వేసుకుంది. ప్రస్తుతం ఈ రెండూ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ లాంగ్ ఫ్రాక్ రూ. 12,900లకు పై మాటేనట! అదే ఇక బ్యాగ్ ధర చెబితే చలికాలంలోనూ చెమటలు పట్టాల్సిందేనంటున్నారు నెటిజన్లు. ఇంతకీ దాని ధరెంతో తెలుసా? అక్షరాలా.. రూ. 2,47,620గా చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఖరీదైన, ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ ధరించిన తన వైఫీని చూసిన స్టైలిష్ స్టార్ ‘క్యూటీ’ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
సంగీత్‌లో ‘స్టైల్’ దివా!
పెళ్లి వేడుకలకు పయనమైనప్పుడే ఈ స్టైలిష్ వైఫ్ అంత ఖరీదైన దుస్తులు, యాక్సెసరీస్ ధరించిందంటే ఇక వేడుకల్లో ఇంకెంత లగ్జరీగా మెరిసిపోయిందో అన్న సందేహం వచ్చి ఉంటుంది నెటిజన్లకు. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో స్నేహ ధరించిన దుస్తులేంటి? వాటి ధరెంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు వారు! తీరా ప్రైస్ చూసి ఒకింత షాక్‌కి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. అయితే సంగీత్ ఫంక్షన్లో భాగంగా స్నేహ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఓ ట్రెండీ డ్రస్‌లో దర్శనమిచ్చింది. మల్టీకలర్ ప్రింటెడ్ లాంగ్ స్కర్ట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. దానికి జతగా నలుపు రంగు ఆఫ్-షోల్డర్ క్రాప్‌టాప్‌ను ఎంచుకుంది. ఇక దీనికి డిజైన్ చేసిన రఫుల్ స్లీవ్స్ డ్రస్ లుక్‌ని ద్విగుణీకృతం చేశాయని చెప్పచ్చు. సింపుల్ నెక్‌పీస్, వదులైన హెయిర్‌స్టైల్, చేతిలో చిన్న బ్యాగ్‌తో మెరుపులు మెరిపించిందీ బ్యూటీ. మరి, ఇంతకీ స్నేహ ధరించిన ఈ అవుట్‌ఫిట్ ధరెంతో తెలుసా..? సుమారు రూ. 4,35,000 ఉంటుందట!
ఇక మరో వేడుకలో భాగంగా బూడిద రంగు వెస్ట్రన్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ ధరించి మెరిసిపోయిందీ స్టైలిష్ లేడీ. డ్రస్‌కు తగినట్లుగానే స్టడ్ ఇయర్రింగ్స్, ఫంకీ హెయిర్‌స్టైల్‌తో తన స్టైల్ కోషెంట్ ని అమాంతం పెంచేసింది. ఇక ఈ డ్రస్ ధర ఎంతంటే.. సుమారు 14 వేలకు పైనే ఉంటుందంటున్నారు నెట్ ప్రియులు.
మెగా కోడలి ‘మెగా’ ఫ్యాషన్లు!
ప్రతి సందర్భంలోనూ తనదైన స్టైల్లో మెరిసిపోయే మెగా కోడలు పిల్ల ఉపాసన.. నిహారిక పెళ్లిలో ఆద్యంతం తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఉదయ్‌పూర్‌కు బయల్దేరే క్రమంలో పీచ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఉప్సీ.. ఓ లెదర్ బ్యాగ్‌తో దర్శనమిచ్చింది. Hermes బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ని చూసిన నెటిజన్లు ‘అరే హ్యాండ్‌బ్యాగ్ భలే బాగుందే.. ధరెంతో తెలుసుకుందామ’ని వెతికి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే దాని ధర రూ. 11,73,171 కు పైగానే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.
ఇక సంగీత్, మెహెందీ, పెళ్లి వేడుకల కోసం డిజైనర్లు మనీష్ మల్హోత్రా, తరుణ్ తహ్లియానీ రూపొందించిన అందమైన దుస్తుల్లో మెరిసిపోయిందీ మెగా కోడలు పిల్ల. వీటి ధర కూడా లక్షల్లోనే ఉండచ్చని ఫ్యాషన్ ప్రియులు తెగ మాట్లాడేసుకుంటున్నారు.
ఫ్లోరల్ శారీలో ‘మెగా’ డాటర్!
తన చెల్లెలు నిహారిక పెళ్లిలో తెగ సందడి చేసిన మెగా డాటర్స్ సుస్మిత, శ్రీజలు తమ ఫ్యాషనబుల్ అవుట్ఫిట్స్తోనూ ఆకట్టుకున్నారు. ఇటు ట్రెడిషనల్, అటు వెస్ట్రన్ లుక్స్‌ని ఈ ఐదు రోజుల పెళ్లిలో భాగం చేసిన ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఎంతో స్టైలిష్‌గా మెరిసిపోయారు.
ఇక పోస్ట్ వెడ్డింగ్ పార్టీలో సుస్మిత ధరించిన ఓ చీర గురించే ఇప్పుడు చర్చంతా. ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన హాఫ్-వైట్ ఫ్లోరల్ శారీలో మెరుపులు మెరిపించిందీ మెగా బ్యూటీ. ఈ చీరకు ఎంబ్రాయిడరీ బోర్డర్‌తో వన్నెలద్దడంతో పాటు మెరూన్ కలర్ స్లీవ్‌లెస్ ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి క్యూట్‌గా కనిపించిందీ కాస్ట్యూమ్ డిజైనర్. ఇక చేతికి వాచీ, గాగుల్స్ ధరించి తన లుక్‌ని పూర్తి చేసింది సుస్మిత. ఇంతకీ ఈ ఫ్లోరల్ శారీ ధరెంతో తెలుసా? సుమారు రూ. 85 వేలకు పైగానే ఉంటుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఈ మెగా డాటర్స్ ఇద్దరూ ఈ ఐదు రోజుల పెళ్లిలో ధరించిన మిగతా ఫ్యాషన్ల ధర కూడా భారీగానే ఉంటుందట!
చీరలో అపురూప ‘లావణ్యం’!
నిహారిక ఫ్రెండ్, జిమ్మేట్ అయిన లావణ్య త్రిపాఠి కూడా ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సందడి చేసింది. ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ తనదైన ఫ్యాషన్లతో ఆకట్టుకుందీ టాలీవుడ్ బేబ్. వివిధ వేడుకల్లో చుడీదార్స్, ట్రెండీ డ్రస్సులతో ఆకట్టుకున్న ఈ అపురూప లావణ్యం.. సంగీత్ వేడుకలో రాయల్ బ్లూ శారీలో మెరుపులు మెరిపించింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ చీర మొత్తానికి సీక్విన్ వర్క్‌తో వన్నెలద్దడంతో దీని లుక్ మరింతగా ఇనుమడించిందని చెప్పచ్చు. ఇక దీనికి జతగా డార్క్ బ్లూ కలర్ స్లీవ్‌లెస్ వెల్వెట్ బ్లౌజ్‌ను ఎంచుకున్న లావణ్య.. బన్ హెయిర్‌స్టైల్, మ్యాచింగ్ ఇయర్వేర్తో దర్శనమిచ్చింది. అయితే ఈ చీర సింపుల్‌గానే కనిపించినా దీని ధర మాత్రం భారీగానే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఈ శారీ ఖరీదు రూ.1.35 లక్షలకు పైగానే ఉంటుందట!