Photo: Instagram
పెళ్లంటే ఒక్క రోజు జరిగే వేడుక కాదు.. ఐదు రోజుల పండగ.. జన్మజన్మలకు గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం..! అందుకే తమ పెళ్లిలో ప్రతి సందర్భాన్నీ ఫ్యాషనబుల్‌గా మార్చుకోవాలని ఆరాటపడుతుంటారు నవ వధువులు. తాజాగా మిస్ నుంచి మిసెస్‌గా ప్రమోషన్ పొందిన మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కూడా అదే చేసింది. పెళ్లి కూతురిని చేయడం దగ్గర్నుంచి అప్పగింతల దాకా ప్రతి వేడుకలోనూ ప్రత్యేకంగా మెరిసిపోయింది.. ఆయా వేడుకలకు తగినట్లుగా దుస్తుల్ని ఎంచుకొని కాబోయే వధువులందరికీ సరికొత్త బ్రైడల్ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోంది. అంతేనా.. వధువుకు తగ్గట్లుగా వరుడు చైతన్య కూడా తన ప్రిన్సెన్‌ను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ మెరిసిపోయాడు. మరి, ఈ క్యూట్ కపుల్ వెడ్డింగ్ ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!
సెలబ్రిటీల పెళ్లంటే చాలు.. అమ్మాయిల కళ్లన్నీ వారు ధరించే దుస్తుల పైనే ఉంటాయి. ఏయే వేడుకలకు ఎలాంటి దుస్తులు ఎంచుకున్నారు? ఆ దుస్తుల్లో వారు ఎలా రడీ అయ్యారు? అనే విషయాల గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు. ఇలా గత పది రోజుల నుంచి నిహారిక పెళ్లి వేడుకలు, ఆమె ధరించిన దుస్తులు ఇంటర్నెట్‌ని ఓ ఊపు ఊపేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
పెళ్లిలో ‘పుత్తడి’ బొమ్మలా!
ఒకప్పుడు పెళ్లిలో క్రీమ్-మెరూన్, పసుపు-మెరూన్, ఎరుపు-ఆకుపచ్చ.. వంటి కలర్ కాంబినేషన్స్‌ని బాగా ఎంచుకునే వారు వధువులు. కానీ ఈ తరం నవ వధువుల ఫ్యాషన్ ట్రెండ్ మారుతోంది. ఈ క్రమంలో గోల్డెన్ జరీతో రూపొందించిన పట్టు చీరల్ని ధరించడానికే పెళ్లి కూతుళ్లు మక్కువ చూపుతున్నారు. నిహారిక కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన తన పెళ్లిలో గోల్డెన్ కాంజీవరం చీరలో పుత్తడి బొమ్మలా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. ఇక తన చీరకు ఆనియన్ కలర్ భారీ డిజైనర్ వర్క్ చేసిన బ్లౌజ్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ అదరగొట్టేసింది. మాతాపట్టి, స్టేట్మెంట్ నెక్లెస్, భారీ ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన ఈ మెగా డాటర్.. ఆనియన్ కలర్ షీర్ దుపట్టాను తలపై ధరించింది. ఇలా మొత్తంగా తన బ్రైడల్ లుక్‌తో పదహారణాల తెలుగమ్మాయిని మరిపించిందీ క్యూట్ బ్యూటీ. ఇక వరుడు చైతన్య బ్రౌన్-గోల్డెన్ షేర్వాణీలో రాకుమారుడిలా కనిపించాడు.
ఇక పెళ్లికి కొన్ని గంటల ముందు మరో బ్రైడల్ లుక్‌లో దర్శనమిచ్చింది నిహా. ఈ క్రమంలో ఎరుపు రంగు పట్టుచీర ధరించిన ఈ మెగా బ్యూటీ.. దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేలా ఆకుపచ్చ రంగు హెవీ డిజైనర్ బ్లౌజ్‌ను మ్యాచ్ చేసింది. సంప్రదాయబద్ధంగా ఉండే ఆభరణాలు, చెవులకు ఝుంకాలు ఆమె లుక్‌ని ద్విగుణీకృతం చేశాయని చెప్పచ్చు. మల్లెపూలు అలంకరించిన జడ, గోల్డెన్ మేకప్‌తో మెరుపులు మెరిపించిందీ మెగా బ్యూటీ.
థీమ్‌కు తగ్గట్లుగా ‘పసుపు’ వన్నెలద్ది..!
పెళ్లి రోజు ఉదయం వధూవరులకు మంగళ స్నానం చేయించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో పసుపు నీళ్లతో జలకాలాడే కొత్త జంటలు.. ఆ థీమ్‌కి తగినట్లుగా పసుపు రంగు దుస్తులు ఎంచుకుంటుంటారు. నిహారిక-చైతన్య జంట కూడా మంగళస్నానం వేడుకలో పసుపు రంగు వన్నెలద్దుతూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలో నిహా పసుపు రంగు చీరకు తెలుపు రంగు బ్లౌజ్‌ను జత చేసింది. ఇక తన ట్రెడిషనల్ అటైర్‌ను ట్రెండీగా మార్చేందుకు సిల్వర్ జ్యుయలరీని ధరించిందీ చక్కనమ్మ. ఈ వేడుకలో చైతన్య కూడా నిహా ఫ్యాషన్స్‌కు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ పసుపు రంగు దుస్తుల్లో ముస్తాబయ్యాడు.
మెహెందీకి ‘మల్టీకలర్’ మెరుపుల్!
పెళ్లిలో పూర్తి ట్రెడిషనల్‌గా మెరిసిపోయిన ఈ లవ్లీ బ్రైడ్.. మెహెందీ వేడుకల్లో అటు ట్రెడిషనల్‌గా, ఇటు ట్రెండీగా మెరుపులు మెరిపించింది. ఈ క్రమంలో తన మెహెందీ ఫంక్షన్ కోసం ఓ అందమైన లెహెంగాను ఎంచుకుందీ మెగా ప్రిన్సెస్. డిజైనర్ ఐషా రావ్ రూపొందించిన ఈ పింక్ కలర్ లెహెంగాపై మల్టీకలర్‌తో చేసిన ఎంబ్రాయిడరీ అదుర్స్ అని చెప్పచ్చు. ఇలా తన లెహెంగా స్కర్ట్‌పై ఇదే తరహా బుట్టా స్లీవ్స్ బ్లౌజ్‌ను జతచేసిన నిహా.. నెట్ దుపట్టాతో తన మెహెందీ లుక్‌ని పూర్తి చేసింది. ఇక తన డ్రస్‌కు నప్పేలా మోడ్రన్ జ్యుయలరీతో వన్నెలద్దిన ఈ క్యూట్ గర్ల్ బ్రైడల్ లుక్ రాజకుమారికి ఏమాత్రం తీసిపోదంటే అది అతిశయోక్తి కాదు. ఈ మెగా ప్రిన్సెస్‌ను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ప్రిన్స్ చైతన్య కూడా తెలుపు రంగు కుర్తా-పైజామాకు జతగా మస్టర్డ్ కలర్ జాకెట్ ధరించాడు. దీనిపై ఉన్న మల్టీకలర్ ఎంబ్రాయిడరీ నిహా లెహెంగాకు పూర్తి మ్యాచింగ్‌గా రూపొందించడం విశేషం.
‘సంగీత్’లో స్టైలిష్ లుక్!
తన ప్రి-వెడ్డింగ్ పెళ్లి వేడుకల్లో ఎంతో జోష్‌ఫుల్‌గా కనిపించిన నిహా.. ఈ క్రమంలో తాను ఎంచుకున్న ఫ్యాషన్స్‌తోనూ ఈ తరం బ్రైడ్స్కి సరికొత్త పాఠాలు నేర్పుతోంది. ఇందులో భాగంగానే సంగీత్ వేడుకలో కంప్లీట్ వెస్ట్రన్ లుక్‌లో దర్శనమిచ్చిందీ మెగా వారసురాలు. ప్రముఖ డిజైనర్ ద్వయం శంతను-నిఖిల్ రూపొందించిన ప్రుసియన్ బ్లూ కట్ గౌన్‌లో తళుక్కుమంది. ఇక దీనికి ముందు భాగంలో రఫుల్స్ తరహాలో రూపొందించిన వి-నెక్, షోల్డర్స్ డ్రస్ మొత్తాన్ని ట్రెండీగా మార్చేశాయని చెప్పచ్చు. ఇలా తన లుక్‌కి స్మోకీ మేకప్‌తో వన్నెలద్దిన ఈ లవ్లీ బ్రైడ్.. స్టైలిష్ చోకర్ నెక్లెస్-మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, వదులైన హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపించింది. ఇక వరుడు చైతన్య తన రాకుమారికి కంప్లీట్ అపోజిట్‌గా హాఫ్-వైట్ కలర్ షేర్వాణీలో మెరిసిపోయాడు.
అమ్మ చీరలో ‘పెళ్లి కూతురు’!
పెళ్లిలో ఆద్యంతం తనదైన ఫ్యాషన్స్‌తో అందరినీ కట్టిపడేసిన నిహా.. అంతకుముందు పెళ్లి కూతురు ఫంక్షన్లో మాత్రం ఒక్కసారిగా అందరి చూపునూ తన వైపు తిప్పుకుంది. ఇందుకు కారణం ఆ వేడుకలో తన తల్లి నిశ్చితార్థపు చీర ధరించడమే! భారీ గోల్డెన్ జరీ బోర్డర్ ఉన్న రాయల్ బ్లూ కలర్ పట్టు చీర ధరించిన నిహా.. దానికి మ్యాచింగ్‌గా సింపుల్ డిజైన్ ఉన్న సేమ్ కలర్ బ్లౌజ్‌ను జత చేసింది. ముత్యాల ఆభరణాలు, వడ్డాణం, మ్యాచింగ్ గాజులు, చక్కటి హెయిర్‌స్టైల్‌తో మెరుపులు మెరిపించిన ఈ మెగా డాటర్.. ఈ చీర వయసు 32 ఏళ్లు అంటూ ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయింది.
ఇక ఇదే వేడుకలో మరో చీరలో ముస్తాబై సందడి చేసిందీ క్యూటీ. వంగ పండు హెవీ బోర్డర్‌తో కూడిన ఆకుపచ్చ రంగు పట్టు చీర-మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ ధరించిన ఈ బ్యూటిఫుల్ బ్రైడ్.. మోడ్రన్ జ్యుయలరీతో తన లుక్‌ని పూర్తి చేసింది. నడుముకి వడ్డాణం, పాపిడ బిళ్ల, సింపుల్ మేకప్, క్యూట్ స్మైల్‌తో అందరినీ కట్టిపడేసిందీ మెగా డాటర్.
ఇలా పెళ్లి వేడుకల్లోనే కాదు.. పెళ్లి తర్వాత కూడా ఈ లవ్లీ కపుల్ తమ ఫ్యాషన్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు.. అంతేనా.. కాబోయే కొత్త జంటలకు వెడ్డింగ్ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతున్నారు.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ‘నిశ్చయ్’!