Photo: Instagram
పెళ్లంటే చాలు.. అమ్మాయిల మనసు అందంగా ముస్తాబవడం వైపే పరిగెడుతుంటుంది. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్ వేడుకల దగ్గర్నుంచి పెళ్లి తంతు ముగిసే దాకా.. ప్రతి వేడుకలోనూ అటు సంప్రదాయబద్ధంగా, ఇటు అందరికంటే ప్రత్యేకంగా రడీ అయి మెరిసిపోతుంటారు వధువులు. ఇక ఈ తరం అమ్మాయిలైతే తమ పెళ్లి వేడుకల్లో అలనాడు అమ్మ ధరించిన పెళ్లి దుస్తులు, నగలకూ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా అదే చేసింది. ‘పెళ్లి కూతురు’ ఫంక్షన్లో తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీర ధరించి యువరాణిలా దర్శనమిచ్చింది. రాయల్ బ్లూ పట్టు చీరలో రాయల్‌గా మెరిసిపోయింది నిహా. అందుకే తన చిట్టితల్లిని చూసి నాగబాబు కూడా ‘ఏంజెల్లా ఉంది’ అంటూ మురిసిపోయారు. నిహానే కాదు.. గతంలోనూ కొంతమంది ముద్దుగుమ్మలు తమ పెళ్లి వేడుకల్లో తమ తల్లుల చీరలు, నగలు ధరించి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. మరి, వారెవరో, వారు ధరించిన ఆ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి..
అమ్మ చీర కట్టుకోవాలని అమ్మాయిలు, తన చిట్టితల్లి తన చీరలో ఎలా ఉంటుందో చూడాలని తల్లులు ఆరాటపడడం సహజం. అందుకే ఈ తరం అమ్మాయిల్లో చాలామంది తమ పెళ్లిలో ఏదో ఒక వేడుకలో తన తల్లి పెళ్లి నాటి దుస్తుల్ని ధరిస్తూ మెరిసిపోతున్నారు. తల్లుల్ని మురిపిస్తున్నారు. తామూ ఇందుకు అతీతం కాదని నిరూపించారు చాలామంది ముద్దుగుమ్మలు.
ఈ చీర వయసు 32 ఏళ్లు!
మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఇదే చేసింది. డిసెంబర్ 9న వెంకట చైతన్యను వివాహమాడబోతున్న ఈ చక్కనమ్మ.. ప్రస్తుతం తన ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి కూతురు ఫంక్షన్లో భాగంగా తన తల్లి పద్మజ పెళ్లి నాటి చీరను ధరించి మెరిసిపోయింది. భారీ గోల్డెన్ జరీ బోర్డర్ ఉన్న రాయల్ బ్లూ కలర్ పట్టు చీర ధరించిన నిహా.. దానికి మ్యాచింగ్‌గా సింపుల్ డిజైన్ ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్‌ను జత చేసింది. ఇక ముత్యాల ఆభరణాలు, వడ్డాణం, మ్యాచింగ్ గాజులు, చక్కటి హెయిర్‌స్టైల్, హెవీ మేకప్‌తో మెరుపులు మెరిపించిందీ మెగా డాటర్.
ఇలా ట్రెడిషనల్‌గా ముస్తాబైన తన ఫొటోను, అలనాడు ఇదే చీరలో రడీ అయిన తన తల్లి ఫొటోతో కొలేజ్ చేసి ఇన్‌స్టాలో పంచుకుంది నిహా. దీనికి ‘32 ఏళ్ల క్రితం మా అమ్మ తన నిశ్చితార్థంలో ధరించిన చీర ఇది..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్పుడెప్పుడో తమ నిశ్చితార్థంలో తన భార్య కట్టిన చీరలో ఇప్పుడు ఇలా పెళ్లి కూతురిలా ముస్తాబైన కూతురిని చూసిన నటుడు నాగబాబు ‘మా ఆవిడ అందంగా ఉంది.. నా చిట్టితల్లి ఏంజెల్లా ఉంది..’ అంటూ మురిసిపోయారు.
అమ్మ లెహెంగా చుట్టేసింది!
తన ఇష్టసఖుడు, వెండితెర భల్లాల దేవుడు రానాను ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకుంది ఈవెంట్ ప్లానర్/మేనేజర్ మిహీకా బజాజ్. తన పెళ్లి వేడుకల్లో ట్రెడిషనల్‌గా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయిన ఈ పుత్తడి బొమ్మ.. తన తల్లి పెళ్లినాటి లెహెంగానూ తన వివాహ వేడుకల్లో భాగం చేసుకుంది. ఈ క్రమంలో రెడ్-గ్రే కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ లెహెంగాకు బాందినీ ప్రింట్ రావడం, స్కర్ట్ బోర్డర్-దుపట్టా అంచులకు మిర్రర్, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేయడంతో ఈ అవుట్‌ఫిట్ హెవీగా కనిపిస్తోంది. ఇలా తన డ్రస్‌కు తగ్గట్లుగా స్టోన్-కట్ జ్యుయలరీ, వదులైన హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో అదరగొట్టేసిందీ ముద్దుగుమ్మ.
ఇక తన కూతురు తన పెళ్లి నాటి అవుట్‌ఫిట్‌లో ముస్తాబవడం చూసిన మిహీకా తల్లి బంటీ బజాజ్ తన ఆనందాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. కూతురి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆమె.. ‘నా పెళ్లి నాటి అవుట్‌ఫిట్ ధరించి ముస్తాబైన నా బంగారు తల్లిని చూడడానికి రెండు కళ్లూ సరిపోవట్లేదు. నా చిట్టితల్లి అప్పుడే ఇంత ఎదిగిపోయిందంటే నమ్మలేకపోతున్నా..’ అంటూ భావోద్వేగంతో క్యాప్షన్ రాసుకొచ్చారామె.
చీరను దుపట్టాగా మార్చేసింది!
2018లో ‘గ్రాండ్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది ఈషా అంబానీ - ఆనంద్ పిరమల్ వివాహం. ఈ అంబానీ వారి ఆడపడుచు వివాహంలో ప్రతి సందర్భం ప్రత్యేకమే అని చెప్పుకోవాలి. ఇక ఆమె పెళ్లిలో ధరించిన లెహెంగా అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అందుకు కారణం తన బ్రైడల్ డ్రస్‌లో తన తల్లి పెళ్లి నాటి చీరను జత చేయడమే! అబుజానీ-సందీప్ ఖోస్లా డిజైనర్ ద్వయం రూపొందించిన గోల్డెన్ లెహెంగా ధరించింది ఈషా. ఇక దీనిపై చేత్తో రూపొందించిన మొఘల్ జాలీ వర్క్, ఫ్లోరల్ ప్యానల్స్, జర్దోసీ-నక్షి వర్క్.. ఈ అటైర్‌ను భారీగా మార్చేశాయి. ఇక దీనిపై మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన ఎరుపు రంగు బాందనీ దుపట్టా తన తల్లి నీతా అంబానీ ఆమె పెళ్లిలో ధరించిన చీర కావడం విశేషం. 35 ఏళ్ల క్రితం నాటి ఈ చీర లెహెంగాకు పూర్తి కాంట్రాస్ట్ లుక్‌ని తీసుకొచ్చి ఆమెను మరింత ట్రెడిషనల్‌గా, ఆకర్షణీయంగా మార్చేసిందని చెప్పచ్చు. ఇలా తన తల్లి పెళ్లి చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోయిందీ అంబానీ వారి ఆడపడుచు.
ఆభరణాల్లోనూ అమ్మ ముద్ర!
అమ్మ పెళ్లి నాటి దుస్తులు ధరించడమే కాదు.. నాడు ఆమె ధరించిన ఆభరణాలను సైతం నేడు తమ పెళ్లిలో భాగం చేసుకున్న ముద్దుగుమ్మలూ లేకపోలేదు. బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ కూడా అదే కోవలోకొస్తుంది. గోల్డెన్ ఎంబ్రాయిడరీతో భారీగా డిజైన్ చేసిన ఎరుపు రంగు బ్రైడల్ లెహెంగాలో మెరిసిన ఈ సొగసరి.. ఆభరణాల విషయంలో మాత్రం అమ్మనే స్ఫూర్తిగా తీసుకుంది. అలనాడు తన తల్లి సునీతా కపూర్ పెళ్లిలో ధరించిన జ్యుయలరీకి ఆధునిక హంగులద్ది తన వివాహంలో భాగం చేసుకుంది సోనమ్. ఈ క్రమంలో స్టోన్స్, ముత్యాలతో రూపొందించిన వింటేజ్ హెడ్ పీస్, భారీ నెక్లెస్, హారం.. వంటివన్నీ ఆమెను మహారాణిలా కనిపించేలా చేశాయనడం అతిశయోక్తి కాదు. ఇలా తన తల్లి నగలతో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. నేటి తరం అమ్మాయిలకు బ్రైడల్ జ్యుయలరీ పాఠాలు నేర్పిందని చెప్పచ్చు.
అత్తగారి గరారాలో కోడలి మెరుపులు!
నవాబుల పెళ్లంటే ఎలా ఉంటుంది? పెళ్లిలో అణువణువూ రాజసం ఉట్టిపడేలా ఉంటుంది.. కదూ! ఇక పెళ్లికూతురు ధరించే అవుట్‌ఫిట్స్ కూడా అంతే రాయల్‌గా ఉంటాయి కూడా! కరీనా కపూర్ బ్రైడల్ లుక్ ఇందుకు ఏమాత్రం తీసిపోదు. కారణం.. తన పెళ్లిలో తన అత్తగారి వెడ్డింగ్ అవుట్‌ఫిట్‌ని ధరించడమే! 1962 లో కరీనా అత్తయ్య, అలనాటి అందాల నటి షర్మిళా ఠాగూర్ ధరించిన భారీ గరారాను తన పెళ్లి కోసం ఎంచుకుంది బెబో. ఈ క్రమంలో ప్రముఖ డిజైనర్ రీతూ కుమార్ ఈ అటైర్‌కు ఆధునిక హంగులద్దారు. రస్ట్, సీవీడ్ రంగుల్లో రూపొందించిన ఈ లెహెంగాపై అణువణువూ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వన్నెలద్దారు. ఇక దీనికి జతగా తాను ధరించిన భారీ ఆభరణాలు సైతం అటైర్‌ను మరింత హైలైట్ చేశాయని చెప్పచ్చు. ఇలా అత్తగారి అవుట్‌ఫిట్‌లో రాజకుమారిగా మెరిసిపోయిందీ పటౌడీ కోడలు పిల్ల.
లేస్తో వెయిల్కు వన్నెలద్దారు!
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్.. లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనుక్షణం ప్రేమను పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతుంటారు. సరిగ్గా రెండేళ్ల క్రితం వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ క్యూట్ కపుల్.. హిందూ, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. అయితే దేశీ వివాహంలో భాగంగా ఎరుపు రంగు భారీ లెహెంగాలో ముస్తాబైన ఈ దేశీగర్ల్.. క్రిస్టియన్ వెడ్డింగ్‌కు తెలుపు రంగు బ్రైడల్ గౌన్ ధరించింది. ఈ గౌన్ అప్పట్లో ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేసిందని చెప్పచ్చు. ఇందుకు దీనికి అనుసంధానించిన 75 అడుగుల పొడవాటి వెయిల్ ఒక కారణమైతే.. పీసీ అత్తగారి బ్రైడల్ గౌన్ లేస్‌ను ఈ గౌన్ తయారీలో ఉపయోగించడం మరో కారణం. రాల్ఫ్ లారెన్ ఫ్యాషన్ కంపెనీ రూపొందించిన ఈ అద్భుతమైన గౌన్‌పై కొన్ని ప్రత్యేకమైన పదాలను, వాక్యాలను ఎంబ్రాయిడరీగా రూపొందించడంతో ఇది మరింత హైలైట్ అయింది.
చూశారుగా.. ఈ ముద్దుగుమ్మలంతా తమ తల్లుల/అత్తయ్యల అవుట్‌ఫిట్స్‌ని, నగలను తమ బ్రైడల్ లుక్‌లో భాగం చేసుకొని ఎలా మెరిసిపోయారో! మరి, వీరిలాగే మీరూ మీ పెళ్లి వేడుకల్లో మీ అమ్మగారి అవుట్‌ఫిట్‌ను భాగం చేసేయండి.. అటు ట్రెడిషనల్‌గా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోండి..!