మామూలుగానే అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. ఇక పండగలు, ప్రత్యేక సందర్భాలంటే మరింత ప్రత్యేకంగా ముస్తాబవ్వాలనుకుంటారు. మరి, పెళ్లిళ్లలో అయితే చెప్పే పనే లేదు... తమకు మరెవరూ సాటిరారన్నట్లుగా తయారవ్వాలనుకుంటారు. అది వారి పెళ్లైనా లేదంటే బంధువులు, స్నేహితురాలి పెళ్లికి హాజరవ్వాలనుకున్నా.. తమ పెళ్లేనేమో అన్నంత హడావిడి చేస్తుంటారు. ఇందుకోసం దుస్తుల దగ్గర్నుంచి ఆభరణాల దాకా.. మేకప్ దగ్గర్నుంచి సిగ సింగారించుకోవడం దాకా ఏ ఒక్క దాని విషయంలోనూ రాజీపడరు. అందుకు తగినట్లుగానే డిజైనర్లు కూడా కొత్త కొత్త ఫ్యాషన్స్‌ని, యాక్సెసరీస్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలైతే వారి ఫ్యాషన్స్‌కు నప్పిన హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడమే కాదు.. వాటికీ వివిధ రకాల హెయిర్ యాక్సెసరీస్‌తో వన్నెలద్దుతున్నారు. మరి, సిగ సొగసును ఇనుమడింపచేసే అలాంటి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ గురించి ఈ పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా తెలుసుకుందాం..!
తమ పెళ్లైనా, ఇతరుల పెళ్లికి వెళ్లాలన్నా ఆయా పెళ్లి వేడుకలకు తగినట్లుగా డ్రస్సింగ్ చేసుకోవడంతో పాటు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి విభిన్న రకాల హెయిర్‌స్టైల్స్ కూడా ప్రయత్నిస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇక దీనికి తోడు సిగను సింగారించుకోవడానికి పూలు, స్టైలిష్ యాక్సెసరీస్, ఆభరణాలను సైతం ఉపయోగిస్తున్నారు.
బన్‌కి పూల సొగసులు!
పెళ్లి వేడుకకు హాజరవ్వాలంటే చాలు.. చాలామంది ఎంచుకునే అవుట్‌ఫిట్ చీర. అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు అందాన్ని ఇనుమడింపజేసే పట్టు చీరలో ముస్తాబవడానికి ఆసక్తి చూపుతుంటారు అమ్మాయిలు. అయితే ఇలాంటి చీరకట్టుకు మ్యాచింగ్‌గా జడగంటలు కట్టుకోవడం ఒకప్పటి ఫ్యాషన్. కానీ ఇప్పుడు చాలామంది బన్ హెయిర్స్టైల్స్కే ప్రాధాన్యమిస్తున్నారు. అంతేనా.. ఆ బన్ చుట్టూ పూలతో హంగులద్దుతున్నారు కూడా!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అయింది. పీచ్-పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్‌తో కూడిన పట్టుచీరలో ముస్తాబైన రాశి.. దానికి మ్యాచింగ్‌గా బన్ హెయిర్‌స్టైల్ వేసుకుంది. ఇక తన సిగ చుట్టూ తెలుపు రంగు గులాబీలతో అలంకరించుకొని మరింత అందంగా మెరిసిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే తన అటైర్ కంటే హెయిర్‌స్టైలే హైలైట్ అయిందని చెప్పచ్చు. ఇక సింపుల్ మేకప్, హెవీ ఆభరణాలతో తన లుక్‌ని పూర్తి చేసిన రాశి.. కుందనపు బొమ్మలా దర్శనమిచ్చింది. ఇలా మీరు కూడా ధరించిన చీరకు మ్యాచింగ్‌గా అంటే ఎరుపు రంగు చీర అయితే ఎర్ర గులాబీలు, తెలుపు రంగు ధరిస్తే మల్లెతో అల్లిన గజ్రా.. వంటివి ధరించి మెరిసిపోవచ్చు.
పోనీకి పర్ఫెక్ట్ మ్యాచ్!
హల్దీ, మెహెందీ.. వంటి వేడుకలకు పెళ్లి కూతురు ఫ్లోరల్ జ్యుయలరీ ధరించడం మనకు తెలిసిందే. అయితే ఆమెతో పాటు కొంతమంది ఇతర కుటుంబ సభ్యులు కూడా పూలతో చేసిన ఆభరణాలను ధరించాలనుకుంటారు. అలాంటి వారు పెళ్లి కూతురిలా చేతులు, కాళ్లకు కాకుండా.. తమ హెయిర్‌స్టైల్‌కు ఫ్లోరల్ యాక్సెసరీస్‌తో వన్నెలద్దితే అదరగొట్టేయచ్చు. కావాలంటే అందాల బొమ్మ కాజల్ లుక్‌ని ఓసారి చూసేయండి.
లేత రంగుల్లో డిజైన్ చేసిన భారీ లెహెంగాలో ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ.. సింపుల్‌గా ఉండేలా పోనీ హెయిర్‌స్టైల్ వేసుకుంది. ఇక దాని చుట్టూ ఫ్లోరల్ హెయిర్ యాక్సెసరీతో అలంకరించుకుంది. ఇలా అటైర్ హెవీగా ఉన్నప్పుడు హెయిర్‌స్టైల్, దానికి అలంకరించుకునే యాక్సెసరీస్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత సూపర్బ్‌గా మెరిసిపోవచ్చని చెప్పకనే చెప్పిందీ టాలీవుడ్ అందం. ప్రస్తుతం ఇలా పూలతోనే కాదు.. ముత్యాలు, స్టోన్స్.. వంటి వాటితో తయారుచేసిన పోనీ యాక్సెసరీస్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. మీ డ్రస్‌కి మ్యాచింగ్‌గా ఉండేలా ఎంచుకుంటే అంత పెద్ద వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు.
మాతా పట్టీతో సిగ సింగారం!
కొంతమందికి మరీ అంత భారీగా ముస్తాబవడం నచ్చకపోవచ్చు. అది డ్రస్ అయినా, యాక్సెసరీ అయినా.. సింపుల్‌గా ఉండే వాటితోనే లవ్లీగా మెరిసిపోవాలనుకుంటారు. సిగను సింగారించుకునే విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తుంటారు. అలాంటి వారికి గీతా బస్రా ధరించిన మాతా పట్టి చక్కగా సూటవుతుంది. నిమ్మ పండు కలర్ లెహెంగాకు పింక్ క్రాప్‌టాప్, మ్యాచింగ్ దుపట్టాను జతచేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఎంతో ట్రెడిషనల్‌గా మెరిసిపోయింది. ఇక ఆమె ధరించిన చెయిన్ తరహా మాతా పట్టి తన లుక్‌ని మరింతగా హైలైట్ చేసిందని చెప్పుకోవచ్చు. బన్ హెయిర్‌స్టైల్ వేసుకున్న గీత ధరించిన ఈ త్రిబుల్ లేయర్ హెయిర్ యాక్సెసరీ.. ముందు భాగంలో తన జుట్టు మొత్తాన్నీ కవర్ చేస్తూ హైలైట్‌గా నిలిచింది. సింపుల్ మేకప్, చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్‌తో తన అందానికి మెరుగులు దిద్దిన ఈ ముద్దుగుమ్మ.. చేతుల నిండా గోరింటాకుతో దర్శనమిచ్చింది. ఇలా మీరు కూడా మీ బంధువులు, స్నేహితుల పెళ్లిలో మాతా పట్టి ధరించాలనుకుంటే మరీ హెవీగా ఉండేది కాకుండా.. ఇలా సింపుల్ డిజైన్స్‌తో కూడిన సింగిల్ లేయర్, మల్టీ లేయర్ తరహావి ఎంచుకుంటే సూపర్బ్‌గా మెరిసిపోవచ్చు.
‘మ్యాచింగ్’గా కవర్ చేసేయండి!
కొంతమంది తమ అటైర్‌కు పూర్తి కాంట్రాస్ట్‌గా హెయిర్ యాక్సెసరీస్‌ని ఎంచుకుంటే.. మరికొందరు పూర్తిగా మ్యాచ్ చేస్తూ మెరిసిపోతుంటారు. అంటే తాము ధరించిన దుస్తుల్లాగే తమ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉండాలనుకుంటారు. బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కూడా అదే చేసింది.
గులాబీ రంగు పూల ప్రింట్‌తో కూడిన తెలుపు రంగు లెహెంగాను ఎంచుకున్న ఈ సొగసరి.. బన్ హెయిర్‌స్టైల్‌లో ముస్తాబైంది. ఇక తన బన్ని కూడా తన అటైర్‌కు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ సేమ్ క్లాత్‌తో రూపొందించిన బన్ కవర్ని చుట్టేసుకుంది. ఇలా టాప్ టు బాటమ్ ఒకే తరహా అటైర్, యాక్సెసరీస్‌తో దర్శనమిచ్చింది సోనమ్. మీరు కూడా మీ దుస్తులకు మ్యాచింగ్ హెయిర్ యాక్సెసరీస్‌ని ఎంచుకోవాలనుకుంటే.. అలాంటి క్లాత్‌తోనే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, క్లాత్ ఆర్ట్ హెయిర్ హూప్ హెయిర్ యాక్సెసరీస్.. వంటివి డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు.. లేదంటే మార్కెట్లోనూ కొనుక్కోవచ్చు. మీదైన ప్రత్యేకతతో నలుగురి దృష్టినీ ఆకర్షించచ్చు.
డ్రస్ పైనా ధరించచ్చు!
పెళ్లి వేడుకలకు హాజరయ్యే క్రమంలో కొందరు చుడీదార్స్, అనార్కలీ సూట్స్.. వంటివి కూడా ధరిస్తుంటారు. అయితే వీటికి మ్యాచింగ్‌గా హెయిర్ యాక్సెసరీస్ ధరిస్తే బాగోదేమో అనుకుంటారు. కానీ ఇలాంటి దుస్తులకు నప్పేలా ట్రెండీ హెయిర్ యాక్సెసరీస్ కూడా ప్రస్తుతం మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయి. టాలీవుడ్ బేబ్ కాజల్ కూడా అలాంటి హెయిర్ క్లిప్స్నే ధరించి మెరిసిపోయింది.
ఎరుపు రంగు ఫ్లోరల్ అనార్కలీ ధరించిన ఈ అందాల తార.. వదులైన వేవీ హెయిర్‌స్టైల్‌తో వన్నెలద్దింది. ఇక తన జుట్టుకు పైభాగంలో సన్నటి పూల కొమ్మలా రూపొందించిన క్రౌన్ తరహా హెయిర్ యాక్సెసరీస్ ధరించింది. అదే తరహాలో డిజైన్ చేసిన చిన్న చిన్న హెయిర్ క్లిప్స్‌ని తన జుట్టు వంపులు తిరిగిన చోట అలంకరించుకొని అదరగొట్టేసింది. ఇలా మోడ్రన్ దుస్తులు ధరించినా అందుకు తగ్గ హెయిర్ యాక్సెసరీస్‌తో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చని నిరూపించిందీ చక్కనమ్మ. ఇవే కాదు.. రంగురంగుల స్టోన్స్, బీడ్స్, పెర్ల్స్.. వంటి మెటీరియల్స్‌తో రూపొందించిన హెయిర్ క్లిప్స్, క్రౌన్ తరహా హెయిర్ యాక్సెసరీస్ మార్కెట్లో మగువల మనసు దోచుకుంటున్నాయి.
కేవలం దుస్తులతోనే కాదు.. అందుకు తగినట్లుగా మన సిగను సింగారించుకోవడానికి ప్రస్తుతం ఎన్ని రకాల ఆప్షన్లు, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయో తెలిసిందిగా! అయితే వీటిని కొనే ముందు మీకు నప్పుతాయో లేదో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం, లేదంటే మీ జుట్టుకు ఏది నప్పుతుందో నిపుణులను అడిగి తెలుసుకోవడం వల్ల మీ అందాన్ని, ఆహార్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.