పెళ్లి నిశ్చయమైందంటే చాలు.. ఇక అమ్మాయిల మనసంతా తాము ఎలాంటి బ్రైడల్ లుక్స్ ఎంపిక చేసుకోవాలా? అన్న అంశం చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రతి వేడుకలోనూ అందరికంటే భిన్నంగా, కుందనపు బొమ్మలా మెరిసిపోవాలన్న వారి ఆరాటం అంతా ఇంతా కాదు. మరి, మనలాంటి సామాన్యులమే ఇలా ఆలోచిస్తే.. సెలబ్రిటీలు ఇంకెంత హై-ఫైగా ఆలోచిస్తారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా నవ వధువు కాజల్ అగర్వాల్ బ్రైడల్ అటైర్స్కు సంబంధించిన ఫొటోలే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎవరిని కదిపినా ‘చందమామ బ్రైడల్ లుక్స్ అదుర్స్!!’ అనే అంటున్నారు. తన మది దోచిన గౌతమ్ కిచ్లుతో ఇటీవలే ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్ వరకూ తనదైన స్టైల్లో మెరిసిపోయింది. అటు భారతీయ సంప్రదాయానికి ఇటు తనదైన ఫ్యాషన్ సెన్స్‌ని జతచేస్తూ ప్రతి వేడుకలో తాను ధరించిన దుస్తులు ఈ తరం అమ్మాయిలకు బ్రైడల్ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతున్నాయనడంలో సందేహం లేదు.
తన అందం, అభినయంతో దక్షిణాది సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవలే మిసెస్‌గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే! తన ఇష్టసఖుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడిచిన ఈ చక్కనమ్మ.. తన పెళ్లికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ తనదైన స్టైల్లో మెరిసిపోయింది. నిశ్చితార్థం దగ్గర్నుంచి ప్రి-వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి-రిసెప్షన్ వరకు.. ఇలా ఎక్కడ చూసినా తన వెడ్డింగ్ అటైర్స్ గురించే చర్చ జరుగుతోంది.. సోషల్ మీడియాలోనూ తన బ్రైడల్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తాను పెళ్లిలో ధరించిన భారీ డిజైనర్ లెహెంగా అమ్మాయిల చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తి కాదు..!
View this post on Instagram
❤️
A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on
20 మంది నెల రోజులు శ్రమించి..!
కాజల్ తన పెళ్లి కోసం ఎంచుకున్న భారీ లెహెంగా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన ఈ ఎరుపు రంగు హెవీ డిజైనర్ లెహెంగాపై జర్దోసీ ఎంబ్రాయిడర్డ్ ఫ్లోరల్ ప్యాటర్న్ వర్క్ అటైర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. ఈ బ్రైడల్ అటైర్ని 20 మంది కళాకారులు సుమారు నెల రోజుల పాటు శ్రమించి రూపొందించారు. ఇలా తన లెహెంగాకు మ్యాచింగ్ బ్లౌజ్, బేబీ పింక్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన దుపట్టాను జతచేసిన కాజల్.. కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక తన అటైర్‌ను మరింత హైలైట్ చేసేలా సునీతా షెకావత్ రూపొందించిన ఆకుపచ్చ రాళ్లు పొదిగిన ఆభరణాలు ధరించింది. ఆమె తలకు పెట్టుకున్న మాతాపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన పెళ్లి కోసం ఇంత అందమైన లెహెంగాను డిజైన్ చేసిన అనామికాకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపిందీ ముద్దుగుమ్మ. ఇలా తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజున అందంగా ముస్తాబై అందరినీ కట్టిపడేసిందీ చందమామ.
రిసెప్షన్లో ‘బంగారు’ బొమ్మలా..!
పెళ్లిలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా, శుభసూచికంగా ఎరుపు రంగు భారీ లెహెంగాను ఎంచుకున్న కాజల్.. రిసెప్షన్/వెడ్డింగ్ పార్టీలో ‘గోల్డెన్’ అవుట్‌ఫిట్‌లో కాస్త వెస్ట్రన్ టచ్ ఇచ్చింది. మెరుపులు మెరిపించే టూ-పీస్ బంగారు వర్ణపు డ్రస్‌లో, మెడలో చిన్న నెక్లెస్, నుదుటన సింధూరం, వదులైన హెయిర్‌స్టైల్, చేతిలో వైన్ గ్లాస్‌తో కంప్లీట్ పార్టీ లుక్‌లో దర్శనమిచ్చిందీ అందాల తార. ఇక బ్లాక్ సూట్ ధరించిన కిచ్లూ కాజల్ చేతిలో చేయి వేసి, ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు.. ప్రస్తుతం ఈ లవ్లీ కపుల్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
నిశ్చితార్థానికి ‘షీర్’ శారీ!
మూడు రోజుల క్రితం మూడుముళ్ల బంధంలోకి అడుగిడిన కాజల్.. తాజాగా తన నిశ్చితార్థపు ఫొటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. జూన్‌లో తన ఎంగేజ్మెంట్ జరిగిందని, అందుకోసం ఈ శారీని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని చెబుతూనే.. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపిందీ ముద్దుగుమ్మ. ఇలా తన ఎంగేజ్మెంట్ కోసం పసుపు రంగు షీర్ శారీని ఎంచుకుంది కాజల్. దీనిపై డిజైన్ చేసిన అదే రంగు ఫ్లోరల్ మోటివ్స్, ముత్యాలు పొదిగిన బోర్డర్, స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆమెకు సూపర్బ్ లుక్‌ని అందించాయి. ఇక తన అటైర్‌కు జతగా ధరించిన పర్ల్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్, సింపుల్ మేకప్, వదులైన హెయిర్‌స్టైల్ సింప్లీ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి.
థీమ్‌కు తగ్గట్లుగా ‘మ్యాచ్’ చేస్తూ!
ఇక పెళ్లికి ముందు జరిగిన హల్దీ, మెహెందీ వేడుకల్లో థీమ్‌కు తగినట్లుగా ముస్తాబై తన ఫ్యాషన్ సెన్స్‌ని మరోసారి అందరికీ తెలియజేసిందీ కుందనపు బొమ్మ. ఈ క్రమంలో పసుపు వేడుకలో థీమ్‌కు తగినట్లుగానే పసుపు రంగు స్లీవ్‌లెస్ కుర్తా, దానికి అపోజిట్‌గా లైట్ పింక్ షేడ్ ప్యాంట్ ధరించిందీ బంగారు బొమ్మ. ఇక దీనిపై పువ్వులు, చిన్న చిన్న పక్షుల ప్రింట్ ఆకట్టుకుంది. ఇలా తన డ్రస్‌కు జతగా ఫ్లోరల్ జ్యుయలరీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చిందీ టాలీవుడ్ భామ.
ఇక మెహెందీ కోసం అనితా డోంగ్రే డిజైన్ చేసిన పేస్టల్ గ్రీన్ స్లీవ్‌లెస్ ఫ్లోరల్ కుర్తా ఎంచుకున్న కాజల్.. దానికి మ్యాచింగ్‌గా అదే కలర్ షరారాను, దుపట్టాను జతచేసింది. సింపుల్ మేకప్, చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్, ఫ్రెంచ్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన ఈ క్యూట్ బ్యూటీ.. మెహెందీతో నింపేసిన చేతుల్ని చూపుతూ ఫొటోలకు పోజిచ్చింది.
జీలకర్ర-బెల్లం పరమార్థమదే!
కాజల్-గౌతమ్ పెళ్లిలో తెలుగింటి సంప్రదాయపు కళ ఉట్టిపడింది. ఈ జంట తమ వివాహంలో జీలకర్ర-బెల్లం తంతును భాగం చేసుకున్నారు. ఈ సందర్భంగా వధూవరులిద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ దిగిన ఓ అందమైన ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిందీ అందాల చందమామ. దీంతో పాటు ‘పంజాబీ వచ్చి కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే ఇందులో మేము తెలుగు వివాహ సంప్రదాయమైన జీలకర్ర-బెల్లం కూడా కలిపాం. ఎందుకంటే గౌతమ్‌కు, నాకు దక్షిణాదితో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు వివాహాల్లో జీలకర్ర-బెల్లంకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ తంతుతోనే వధూవరులు ఒక్కటవుతారు. జీలకర్ర-బెల్లాన్ని కలిపి ముద్దలా చేసి, తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేద మంత్రాల నడుమ వధూవరులు ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. సుఖదుఃఖాల్లో ఎప్పుడూ కలిసి ఉంటారని చెప్పే పవిత్ర వేడుక ఇది’ అంటూ జీలకర్ర-బెల్లం విశిష్టతను క్యాప్షన్‌గా రాసుకొచ్చింది కాజల్.
ఇక తన ఇష్టసఖుడు గౌతమ్ చేతిని ముద్దాడుతున్న మరో ఫొటోను పంచుకుంటూ.. ‘ఇలా మిస్ కాజల్‌ను మిసెస్ కాజల్ అయ్యాను. నా విశ్వాసపాత్రుడు, చెలికాడు, స్నేహితుడు, నా అంతరాత్మతో నా వివాహం జరిగింది. ఇవన్నీ నీలో దొరకడం చాలా సంతోషంగా ఉంది డియర్!’ అంటూ తన మనసులోని ఆనందాన్ని అక్షరీకరించిందీ అందాల భామ.
|
Photos: Instagram