అమ్మతనంలో ప్రతి క్షణం అపురూపమే.. ఆనందమే! అందుకే గర్భం ధరించినప్పట్నుంచే కాబోయే తల్లుల ధ్యాసంతా కడుపులోని బిడ్డ పైనే ఉంటుంది. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. ప్రతి విషయంలోనూ తమ బుజ్జాయికి సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎంచుకుంటుంటారు. మనలో చాలామంది కూడా గర్భం ధరించిన సమయంలో వదులుగా, కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అయితే అలాంటి వాటికి తమదైన స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు త్వరలో అమ్మతనంలోకి అడుగిడుతోన్న కొందరు అందాల తారలు. మరి, అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా కనిపించేలా మన ముద్దుగుమ్మలు ధరించిన ఆ సరికొత్త మెటర్నిటీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..
గర్భం ధరించిన మహిళల్లో చాలామంది కోరుకునేది సౌకర్యవంతంగా ఉండే దుస్తులు.. దీనికి తోడు రోజురోజుకీ పెరుగుతోన్న తమ చిట్టి పొట్టను కవర్ చేసుకోవడానికి వదులైన దుస్తులైతే బాగుంటాయని అనుకునే వారు మనలో చాలామందే! ఇలాంటి కంఫర్టబుల్ దుస్తులకే తమదైన ఫ్యాషనబుల్ వన్నెలద్ది సరికొత్త మెటర్నిటీ స్టైల్స్‌ని మనందరికీ పరిచయం చేస్తున్నారు త్వరలోనే తల్లి కాబోతోన్న కొందరు అందాల తారలు.
‘జాకెట్’తో హంగులద్దండి!
కొంతమందికి గర్భం ధరించిన సమయంలోనూ మరీ వదులుగా దుస్తులు వేసుకోవడం నచ్చకపోవచ్చు. ఈ క్రమంలోనే మరీ బిగుతుగా, మరీ వదులుగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా తమ ఫ్యాషన్స్‌ని ఎంచుకుంటుంటారు. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కూడా అలాంటి అవుట్‌ఫిట్‌లోనే అదరగొట్టేసింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నానని ఇటీవలే ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్నుంచి ప్రతి అకేషన్‌లోనూ విభిన్న ఫ్యాషన్స్‌తో మెరుపులు మెరిపిస్తోంది.
ఈ క్రమంలోనే స్టోన్ గ్రే మెటాలిక్ కలర్ ప్యాంట్, షర్ట్ ధరించిన ఈ అందాల అమ్మ.. దానిపై మ్యాచింగ్ కలర్ ప్రింటెడ్ క్రోషే జాకెట్ ధరించింది. ఇలా తన అటైర్ మొత్తానికి జాకెట్‌తో సరికొత్త వన్నెలద్దిందీ బాలీవుడ్ బ్యూటీ. తాను ధరించిన ఈ డ్రస్ అటు మరీ బిగుతుగా, ఇటు మరీ వదులుగా లేకుండా చూడడానికీ కంఫర్టబుల్‌గానే ఉందని చెప్పచ్చు. తన మెటర్నిటీ అవుట్‌ఫిట్‌కి ట్రెండీ జ్యుయలరీ, బన్ హెయిర్‌స్టైల్, తక్కువ మేకప్, స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ అదనపు హంగులు తీసుకొచ్చాయి. అంతేకాదు.. మాస్క్ ధరించి అందరికీ కరోనా జాగ్రత్తలు కూడా చెబుతోందీ చక్కనమ్మ. ఇలా మీరు కూడా ఏ దుస్తులు ధరించినా, చీర కట్టుకున్నా.. దానికి మ్యాచింగ్ జాకెట్ ఒకటి జత చేశారంటే అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు.. ఏమంటారు?!
‘డంగరీ’తో క్యూట్‌నెస్ డబుల్!
చిన్నతనంలో మనం కూడా డంగరీ డ్రస్ వేసుకొని ఫొటోలకు తెగ పోజులిచ్చుంటాం. అయినా ఇలాంటి వెస్ట్రన్ డ్రస్‌ని.. అదీ గర్భిణిగా ఉన్న సమయంలో వేసుకుంటే అసౌకర్యంగా ఉంటుందేమో.. అనేది చాలామంది భావన. కానీ ఈ తరహా డ్రస్సులతో ప్రెగ్నెన్సీ క్యూట్‌నెస్‌ను మరింతగా పెంచుకోవచ్చని తన అటైర్‌తో నిరూపిస్తోంది అందాల అనుష్కా శర్మ. బ్లాక్అండ్ వైట్ పోల్కా డాట్ డ్రస్ ధరించి తన ప్రెగ్నెన్సీని ఎంతో స్టైలిష్‌గా రివీల్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. అప్పట్నుంచి విభిన్న తరహా దుస్తులతో మరింత అందంగా మెరిసిపోతోంది.
ఈ క్రమంలోనే వైట్ టీషర్ట్ ధరించిన అనుష్క.. దాని పైనుంచి పీచ్ కలర్ డంగరీ డ్రస్‌ను కవర్ చేసింది. పైగా ఇది కాస్త వదులుగా ఉండడంతో.. చూడగానే లవ్లీగా కనిపిస్తూనే, ఎంతో కంఫర్టబుల్‌గా ఉన్నట్లనిపిస్తుంది. ఇక దీనికి ఇరువైపులా పాకెట్స్, కాళ్లకు స్నీకర్స్, తక్కువ మేకప్.. ఇలా మొత్తానికి సింపుల్ లుక్‌లోనే ఎంతో స్టైలిష్ మెటర్నిటీ డ్రస్‌లో మెరిసిపోయిందీ లవ్లీ బేబ్. మీరు కూడా అనుష్క స్ఫూర్తితో డంగరీ డ్రస్ ఎంచుకోవాలనుకుంటే శరీరానికి పట్టినట్లుగా కాకుండా కాస్త వదులుగా ఉన్నది ఎంచుకోండి. ఇక ఈ క్రమంలో జీన్స్‌లు, బిగుతుగా ఉండే ప్యాంట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
‘ఫ్రిల్స్’ ఉంటే కంఫర్ట్ ఉన్నట్లే!
ట్రెడిషనల్ చీరల దగ్గర్నుంచి ట్రెండీ టాప్స్ దాకా.. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిదాంట్లో ఫ్రిల్స్ హవా కొనసాగుతోంది. అటు స్టైలిష్ లుక్‌ని ఇటు కంఫర్ట్‌ని ఏకకాలంలో అందించే ఈ తరహా ఫ్యాషన్‌ని గర్భం ధరించిన సమయంలోనూ ట్రై చేయచ్చని తన లుక్‌తో నిరూపిస్తోంది అందాల తార అనితా హస్సానందాని. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్నుంచి తాను ధరించే విభిన్న ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ కాబోయే అమ్మలకు ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోంది.
ఆనియన్ పింక్ ట్రిపుల్ లేయర్డ్ లాంగ్ డ్రస్ ధరించిన అనిత.. తన డ్రస్‌తోనే మెటర్నిటీ గ్లోని అమాంతం పెంచేసింది. ఈ డ్రస్‌కు హైనెక్, ఎదభాగం దగ్గర్నుంచి కింది వరకు వదులుగా రావడం, ప్రతి లేయర్ దగ్గరా కుట్టిన ఫ్రిల్స్, బెల్ స్లీవ్స్.. ఇవన్నీ అదనపు హంగులని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్రిల్స్ వల్ల వదులుగా కనిపిస్తూ చూడ్డానికి ఎంత కంఫర్టబుల్‌గా కనిపిస్తుందో.. ధరించినా అంతకంటే సౌకర్యవంతంగా ఉంటుందని విభిన్న పోజులిస్తూ చెప్పకనే చెబుతోందీ సుందరి. ఇక లూజ్ హెయిర్, మేకప్ ఫ్రీ లుక్.. ఆమెను మరింత సింపుల్ అండ్ స్వీట్‌గా, స్టైలిష్‌గా మార్చేశాయి. మీరు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో బాగా వదులుగా ఉండే దుస్తులే సౌకర్యవంతంగా ఉంటాయని అనుకుంటే ఇలా ఫ్రిల్స్ స్టైల్‌తో రూపొందించిన లాంగ్ డ్రస్సులు, లాంగ్ ఫ్రాక్స్, అనార్కలీస్, కుర్తీస్.. వంటివి ఎంచుకొని మెటర్నిటీ స్టైల్‌తో మెరిసిపోవచ్చు.
‘చీరే’ కట్టుకోవాలనుకుంటే..!
గర్భం ధరించిన సమయంలో ఈ రోజుల్లో చాలామంది ఆడవారు డ్రస్సులు, చుడీదార్స్.. వంటివాటికే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రస్తుతం దసరా, దీపావళి సందర్భంగా ట్రెడిషనల్‌గా కనిపించడానికి చీరలు కట్టుకోవాలని ఆరాపడే వారూ లేకపోలేదు. అలాంటి వారు బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృతా రావ్ అటైర్పై ఓ లుక్కేయాల్సిందే! ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. ‘నవరాత్రి.. తొమ్మిది నెలలు’ అన్న క్యాప్షన్‌తో తాను చీర కట్టుకొని తీయించుకున్న ఓ షార్ట్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అయితే గర్భం ధరించిన సమయంలో చీరే కట్టుకోవాలనుకున్న వారు మరీ హెవీ శారీ కాకుండా తక్కువ బరువుండే (లైట్ వెయిట్) చీరను ఎంచుకోవాలని తన అటైర్‌తో నిరూపిస్తోందీ చక్కనమ్మ. తద్వారా అటు ట్రెడిషనల్‌గా మెరిసిపోతూనే.. ఇటు సంప్రదాయబద్ధంగానూ కనిపించచ్చని చెప్పకనే చెబుతోందీ బ్యూటీ. గులాబీ రంగు లైట్ వెయిట్ చీర కట్టుకున్న అమృత.. దానికి మ్యాచింగ్‌గా గోల్డెన్ జరీ ప్రింటెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌ను జతచేసింది. మెడలో సింపుల్ నెక్‌పీస్, తక్కువ మేకప్‌తో ఎంతో అందంగా కనిపించిందీ చక్కనమ్మ. మరి, మీరూ ఈ పండగల సీజన్లో చీరే కట్టుకోవాలనుకుంటే ఇలా బరువు తక్కువగా ఉండే చీరల్ని ఎంచుకోండి.. అలాగే ఆభరణాలు కూడా చాలా తక్కువగా పెట్టుకుంటే చిరాగ్గా ఉండకుండా జాగ్రత్తపడచ్చు.
కాఫ్తాన్తో కళగా..!
గర్భం ధరించిన మహిళలు ఈ మధ్య ఎంచుకుంటోన్న ఫ్యాషన్స్‌లో కాఫ్తాన్ కూడా ఒకటి. అటు వదులుగా ఉంటూనే, ఇటు స్టైలిష్ లుక్‌ని అందించే ఈ తరహా దుస్తులను త్వరలోనే అమ్మతనంలోకి అడుగుపెట్టబోతోన్న కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఎంచుకొని మెరిసిపోతున్నారు. అలాంటి అందమైన కాఫ్తాన్ అటైర్లో అదరగొట్టేసింది అమ్మ కాబోతున్న అనితా హస్సానందాని.
గులాబీ వర్ణంలో ఉన్న కాఫ్తాన్ టాప్ ధరించిన ఆమె.. ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. ఇక దానిపై నెమలి ఆకారంలో వచ్చిన బాంధనీ ప్రింట్ డ్రస్‌కు పండగ కళ తీసుకొచ్చిందని చెప్పచ్చు. ఇక దీనికి తోడు డ్రస్ నెక్ చుట్టూ, అక్కడక్కడా సీక్విన్ వర్క్‌తో డిజైన్ చేయడం, స్లీవ్స్ చివర్లలో వచ్చిన చిన్న టాజిల్స్.. ఇవన్నీ కాఫ్తాన్కు సరికొత్త కళను అద్దాయి. పైగా ఇది వదులుగా ఉంటుంది కాబట్టి గర్భస్థ సమయంలో ఎలాంటి అసౌకర్యం కూడా కలగదు. కాఫ్తాన్లోనూ టాప్స్, కుర్తీస్, గౌన్స్.. ఇలా ప్రస్తుతం విభిన్న రకాలుగా లభిస్తున్నాయి. వీటిలో మీకు ఏది నప్పుతుందో, సౌకర్యవంతంగా ఉంటుందో.. చూసుకొని ఎంచుకుంటే స్టైలిష్ మెటర్నిటీ లుక్ మీ సొంతమవుతుందనడంలో సందేహం లేదు.