పబ్లిక్ ఈవెంట్లు, ప్రత్యేక సందర్భాలంటే చాలు.. మన ముద్దుగుమ్మలు ఎంత అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి, అలాంటిది ఫ్యాషన్ షోలంటే మన తారలు ఇంకెంత సరికొత్తగా ముస్తాబవుతారో, మేటి డిజైనర్లు రూపొందించిన విభిన్న డిజైన్లు ధరించి కొత్త కొత్త ఫ్యాషన్లను ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేస్తారో కదూ!! అలాంటి ఫ్యాషన్ పండగలోనే పలువురు ముద్దుగుమ్మలు కళ్లు జిగేలుమనేలా మెరిసిపోయారు. ఏటా నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో భాగంగా.. ఈసారి కరోనా నేపథ్యంలో వర్చువల్‌గానే వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ముద్దుగుమ్మలు ఆయా డిజైనర్లు రూపొందించిన సరికొత్త ఫ్యాషన్లను ధరించి ఈ ఫ్యాషన్ పరేడ్‌లో భాగమయ్యారు. మరి, ఎవరెవరు ఎలాంటి దుస్తుల్లో తళుక్కుమన్నారో మనమూ తెలుసుకుందాం రండి..
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలావరకు పబ్లిక్ ఈవెంట్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ కూడా వర్చువల్‌గానే జరిగింది. ఇందులో భాగంగా కొందరు ముద్దుగుమ్మలు పలువురు ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన స్టైలిష్ అవుట్‌ఫిట్స్ ధరించి తళుక్కుమన్నారు.
మ్యాక్సీతో మతి పోగొట్టింది!
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ భార్యగానే కాకుండా.. తనదైన ఫ్యాషన్ సెన్్్తో అశేష అభిమానుల్ని సంపాదించుకుంది మీరా రాజ్‌పుత్. ఇప్పటికే పలు ఫ్యాషన్ షోలలో మెరుపులు మెరిపించిన ఈ చక్కనమ్మ.. తాజాగా నిర్వహించిన డిజిటల్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ తన ఫ్యాషన్ హవాను కొనసాగించింది. డిజైనర్ పునీత్ బలానా రూపొందించిన బ్లాక్ ప్రింటెడ్ మ్యాక్సీ డ్రస్‌లో ముస్తాబైందీ మిసెస్ షాహిద్. ఇక దీనికి జతగా తాను ధరించిన మ్యాచింగ్ ప్రింటెడ్ కేప్ తన లుక్‌ని మరింత ఇనుమడింపజేసిందని చెప్పచ్చు. అంతేకాదు.. డ్రస్, కేప్పై అక్కడక్కడా వచ్చిన కాయిన్ వర్క్, రఫుల్ స్లీవ్స్ అటైర్‌కు అదనపు హంగులద్దాయి. మోడ్రన్ ఇయర్ రింగ్స్, వదులైన హెయిర్‌స్టైల్, తక్కువ మేకప్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన మీరా.. మరోసారి తనదైన స్టైల్లో అమ్మాయిల మనసు దోచుకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
లెహెంగాలో కలర్ఫుల్గా..!
పండగలు, శుభకార్యాల సీజన్ మళ్లీ మొదలైంది. దీనికి తగినట్లుగానే ఎప్పటికప్పుడు మగువలు కూడా తమ ఫ్యాషన్ల విషయంలో అప్డేట్ కావడానికే ఆరాటపడుతుంటారు. డిజైనర్లు కూడా అతివల అభిరుచులకు తగినట్లుగా, వారు మెచ్చేలా సరికొత్త ఫ్యాషన్లను మార్కెట్లోకి తీసుకొస్తారు.. ఇదివరకే ఉన్న ఫ్యాషన్లకు సరికొత్త హంగులద్దుతుంటారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా బాలీవుడ్ భామ అతియా శెట్టి ధరించిన లెహెంగా కూడా ఈ కోవలోకే వస్తుంది. ఫ్యాషనర్ ఐషా రావ్ రూపొందించిన ఎరుపు రంగు లెహెంగాలో అదరగొట్టేసిందీ ముద్దుగుమ్మ. భారీ సీక్విన్ వర్క్‌తో డిజైన్ చేసిన ఎరుపు రంగు లెహెంగాకు మ్యాచింగ్ లో-నెక్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌ను జత చేసిందీ అందాల భామ. ఇలా తన అటైర్‌కు మ్యాచింగ్‌గా హెవీ ఇయర్ రింగ్స్, న్యూడ్ మేకప్‌తో తళుక్కుమంది అతియా. ప్రతి ఫ్యాషన్ షోలో తనదైన స్టైల్లో మెరిసిపోయే ఈ బాలీవుడ్ భామ.. ఈసారీ సరికొత్త ఫ్యాషన్‌ను ఎంచుకోవడంలో ఏమాత్రం రాజీ పడలేదు. పైగా తాను ధరించిన ఈ కలర్‌ఫుల్ లెహెంగా రాబోయే పండగలు, పెళ్లిళ్లు.. వంటి ప్రత్యేక సందర్భాలకు ట్రెడిషనల్-మోడ్రన్ హంగులద్దుతుందనడంలో సందేహం లేదు.
దుపట్టాను లెహెంగాకు అటాచ్ చేసి..!
కేన్స్ వంటి ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుకల్లో మోడ్రన్‌గా మెరిసిపోయే బాలీవుడ్ ముద్దుగుమ్మ డయానా పెంటీ.. ఈసారి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ట్రెడిషనల్ కమ్ మోడ్రన్‌గా మెరుపులు మెరిపించింది. ఇందులో భాగంగా ఫ్యాషన్ డిజైనర్ దిశా పాటిల్ రూపొందించిన ఆఫ్-వైట్ లెహెంగాలో ముస్తాబైందీ బాలీవుడ్ భామ. ఇక తన డ్రస్‌పై వచ్చిన డిజైనర్ వర్క్, లోనెక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, బ్లౌజ్‌కి అటాచ్ చేసిన దుపట్టా.. ఇవన్నీ లెహెంగాకు ప్రధాన ఆకర్షణగా చెప్పచ్చు. ఇలా అటు ట్రెడిషనల్‌గా, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోయిన ఈ ‘కాక్టెయిల్’ బ్యూటీ.. వదులైన హెయిర్‌స్టైల్, హెవీ మేకప్‌తో తన లుక్‌ని పూర్తి చేసింది.
మృణాల్ ఫ్యాషన్ ‘రిమ్జిమ్’!
తొలిసారి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటి మృణాల్ థాకూర్ ఇద్దరు డిజైనర్లు రూపొందించిన రెండు వేర్వేరు అవుట్‌ఫిట్స్‌లో తళుక్కుమంది. రిమ్జిమ్ దాదూ లేబుల్ నుంచి ఎంపిక చేసుకున్న మెటాలిక్ సిల్వర్ లెహెంగా ధరించి హొయలు పోయింది మృణాల్. ఈ క్రమంలో స్కర్ట్‌పై వచ్చిన పెటల్ వర్క్, మెటాలిక్ సిల్వర్ ప్లెయిన్ వన్-షోల్డర్ బ్లౌజ్ లెహెంగాను అల్ట్రా మోడ్రన్‌గా మార్చేశాయని చెప్పుకోవచ్చు. ఇక పోనీ హెయిర్‌స్టైల్, పొడవాటి ఇయర్ రింగ్స్, హెవీ మేకప్.. తన లుక్‌కి మరిన్ని వన్నెలద్దాయి.
ఇక మరో అటైర్లో భాగంగా.. ఆకుపచ్చ రంగు థై-హై స్లిట్తో కూడిన లేయర్డ్ స్కర్ట్ ధరించిన ఈ చక్కనమ్మ.. దానికి జతగా మల్టీ కలర్ షర్ట్‌ని జత చేసింది. సింపుల్ మేకప్, సింపుల్ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌కి వన్నెలద్దిన ఈ భామ.. నలుపు రంగు హీల్స్‌తో స్టైలిష్‌గా ముస్తాబైంది. సాక్షా-కిన్నీ కలెక్షన్ నుంచి ఈ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది మృణాల్. ఇలా రెండు విభిన్న దుస్తుల్లో తనదైన స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేసిందీ క్యూట్ బ్యూటీ.
జంటగా మెరిశారు!
మరో బాలీవుడ్ భామ రాధికా మదన్ కూడా లాక్మే ఫ్యాషన్ పరేడ్‌లో వర్చువల్‌గానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఆఫ్-వైట్ కలర్ ప్రింటెడ్, డిజైనర్ లెహెంగా ధరించిందీ చక్కనమ్మ. లెహెంగా అంచులకు గోల్డ్ కలర్ గోటీ ఫినిషింగ్, లో-నెక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షీర్ దుపట్టా.. వంటివన్నీ లెహెంగాకు మరిన్ని వన్నెలద్దాయి. ఇక దీనికి తోడు చెవులకు భారీ ఆభరణాలు, బన్ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన రాధిక మోడ్రన్ బ్రైడ్లా దర్శనమిచ్చింది. ఇలా ఈ ముద్దుగుమ్మ సింగిల్‌గానే కాదు.. బాలీవుడ్ నటుడు అపర్శక్తి ఖురానాతో కలిసి జంటగా ఈ వర్చువల్ ఈవెంట్లో పాల్గొంది. తెలుపు రంగు కుర్తా-ప్యాంట్ ధరించిన ఖురానా.. దానికి రాధిక ధరించిన లెహెంగా ప్రింట్‌ను పోలి ఉన్న తెలుపు రంగు వెయిస్ట్ కోట్‌ను జతచేసి మ్యాచింగ్-మ్యాచింగ్ అనిపించాడు. ప్రత్యేక సందర్భాల్లో జంటగా మెరవాలనుకున్న కపుల్స్‌కి ఇలా ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోందీ జంట.