పండగొచ్చిందంటే చాలు.. సందడంతా మహిళలదే. నేటి తరం ఫ్యాషన్లను ఫాలో అవుతూనే సంప్రదాయబద్ధంగా మెరిసిపోవడంలో ఎప్పుడూ వారు ముందే ఉంటారు. అలాంటిది అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా నవరాత్రుల్లో మహిళల తళుకులు, సొగసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మవారిని రోజుకో అలంకారంలో, రోజుకో రంగు చీరతో అలంకరించి మరీ కొలవడం ఈ పండగ ప్రత్యేకత. ఈ క్రమంలోనే మనలో చాలామంది ఆయా రంగుల్లో ఉండే దుస్తుల్నే ధరించి తొమ్మిది రోజులు పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులోనూ అటు సంప్రదాయబద్ధంగా ఉంటూనే, ఇటు నేటి తరం ఫ్యాషన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న అవుట్ఫిట్స్నే ఎంచుకుంటున్నారంతా! మరి, ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అటు రంగుకు ప్రాధాన్యమిస్తూనే.. ఇటు సంప్రదాయబద్ధంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్ ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...
దసరా సందర్భంగా ఆ దుర్గమ్మను రోజుకో అలంకారంలో ముస్తాబు చేసి పూజించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకో రంగు పట్టు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దానికి తగినట్లుగానే ఆయా రంగుల్లో ఉండే చీరలు, ఇతర అవుట్‌ఫిట్స్‌ని ధరించి తమ ఇంటికి పండగ శోభను రెట్టింపు చేయాలనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ ‘కలర్’ఫుల్ అవుట్‌ఫిట్స్!
‘ఎరుపు’ - బాందనీ కలగలిస్తే..!
మన భారతీయ మహిళలు ఎరుపు రంగును శుభసూచకంగా భావిస్తారు. అందుకే పెళ్లి, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ రంగులో ఉన్న సంప్రదాయబద్ధమైన అవుట్‌ఫిట్స్‌ని ధరించడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక అమ్మవారిని కొలిచే దసరా నవరాత్రుల్లో అయితే ఈ రంగుకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మరి, మీరు కూడా ఈ దసరా ఉత్సవాల్లో ఎరుపు రంగు అవుట్‌ఫిట్ ధరించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే శ్రీముఖి ఫ్యాషనబుల్ వేర్‌పై ఓ లుక్కేయండి.
టాప్ టు బాటమ్ ఎరుపు రంగుతో రూపొందించిన ఫ్లోర్లెంత్ అనార్కలీలో అదరగొట్టేసిందీ బిగ్‌బాస్ బ్యూటీ. ఎదభాగంలో ప్లెయిన్‌గా, సిల్వర్ కలర్ జరీ బోర్డర్‌తో రూపొందించిన ఈ డ్రస్‌కు మ్యాచింగ్ కలర్ షీర్డ్ దుపట్టా ధరించి లవ్లీగా కనిపించిందీ ముద్దుగుమ్మ. ఇక ఈ డ్రస్‌కి నడుం నుంచి కింది భాగంలో వచ్చిన బాందనీ ప్రింట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాండియా ఆడే క్రమంలో చాలామంది బాందనీ ప్రింటెడ్ అవుట్‌ఫిట్స్‌ని ధరించి ముస్తాబవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారికి ఈ తరహా అవుట్‌ఫిట్ చక్కగా సూటవుతుంది. ఇక తన డ్రస్‌కి మ్యాచింగ్‌గా చెవులకు భారీ జుంకాలు, ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని హైలైట్ చేసింది శ్రీ. ఇలా అటు ఎరుపు రంగు, ఇటు బాందనీ ప్రింటెడ్ తరహాలో గాగ్రాలు, చీరలు, ప్లెయిన్ డ్రస్పైకి మ్యాచింగ్ వేసుకొనే దుపట్టాలు లేదంటే కాంట్రాస్ట్ కలర్ దుపట్టా/బ్లౌజ్.. వంటివి ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా అటు ట్రెడిషనల్‌గా, ఇటు దసరా స్టైల్లో అదరగొట్టేయచ్చు.
‘వైట్’ ఆర్గంజాలో వెన్నెలమ్మలా..!
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని కొలిచేందుకు తెలుపు రంగు అవుట్‌ఫిట్స్‌లో కూడా ముస్తాబవుతుంటారు అతివలు. అయితే అందులోనూ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలనుకుంటున్నారా? అందుకు ఆర్గంజా స్టైల్‌ని మించింది మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు. పైగా ప్రస్తుతం ఈ తరహా ఫ్యాషన్ హవా కొనసాగుతోంది. చీరల దగ్గర్నుంచి లెహెంగాలు, అనార్కలీ, లాంగ్ ఫ్రాక్.. ఇలా ఒకటా, రెండా దాదాపు చాలా ఫ్యాషన్లకు ఆర్గంజా హంగుల్ని అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అలాంటి ఆర్గంజా స్టైల్లో అందంగా ముస్తాబైంది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.
తెలుపు రంగు ఆర్గంజా చీరపై పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చీరకే సరికొత్త వన్నెలద్దిందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి జతగా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిందీ అందాల రాశి. సింపుల్ మేకప్, సింపుల్ జ్యుయలరీతో ముస్తాబైన శిల్ప.. బన్ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తి చేసింది. పూర్తి ప్లెయిన్‌గా ఉండే తెలుపు రంగు చీరలు నచ్చని వారు ఇలా ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసినవి ఎంచుకోవచ్చు. ఇక బ్లౌజ్ విషయానికొస్తే స్లీవ్‌లెస్ నచ్చని వారు బెల్స్లీవ్స్, రఫుల్ స్లీవ్స్, బుట్టా చేతులు.. ఇలా మీకు నప్పిన స్లీవ్స్ డిజైన్స్‌ని ఎంచుకోవచ్చు. చీర-బ్లౌజ్ మ్యాచింగ్ వద్దనుకుంటే కాంట్రాస్ట్ కలర్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి.. ఏమంటారు?!
‘రాయల్ బ్లూ’లో రాకుమారిలా!
మనం ధరించే కొన్ని రంగులు మనల్ని ఫ్యాషనబుల్‌గా మారిస్తే.. మరికొన్ని రంగులు మన హుందాతనాన్ని పెంచుతాయి. అలాంటి రంగే రాయల్ బ్లూ. అమ్మవారిని ఆరాధించే క్రమంలో చాలామంది అతివలు ఈ రంగును ఎంపిక చేసుకుంటుంటారు. అలాంటి రాయల్ కలర్ అవుట్‌ఫిట్‌లో రాకుమారిలా మెరిసిపోయింది బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరి.
రాయల్ బ్లూ కలర్ గాగ్రా ధరించిన ఆమె.. దానికి మ్యాచింగ్‌గా ఉండే షార్ట్ కుర్తీని, షీర్డ్ దుపట్టాను ఎంచుకుంది. గాగ్రా ప్లెయిన్‌గా ఉన్నా.. కుర్తీపై వచ్చిన త్రెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ వర్క్, అక్కడక్కడా జరీ గీతలున్న దుపట్టా అవుట్‌ఫిట్‌ని మరింత అందంగా మార్చేశాయని చెప్పచ్చు. ఇలా అటు రాయల్‌గా, ఇటు సంప్రదాయబద్ధంగా ముస్తాబైందీ ముద్దుగుమ్మ. మీరు కూడా ఈ దసరా నవరాత్రుల కోసం ఇలాంటి రంగు అవుట్‌ఫిట్‌ని ఎంచుకోవాలనుకుంటే.. మ్యాచింగ్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ కూడా మీ లుక్‌ని మరింత ఇనుమడింపజేస్తాయి. ఎంబ్రాయిడరీ చీరల దగ్గర్నుంచి గరారా, అనార్కలీల దాకా.. ఈ రంగుతో రూపొందించిన ప్రతి అవుట్‌ఫిట్ అతివల మనసు దోచుకుంటుందనడం అతిశయోక్తి కాదు.
‘గ్రీన్’లో సింపుల్‌గా.. స్టైలిష్‌గా!
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అతివలు మెచ్చే మరో రంగు ఆకుపచ్చ. అయితే నఖశిఖపర్యంతం ఆకుపచ్చ రంగు ధరించడమంటే చాలామంది ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనుకోవడం సహజం. అలాంటి వారు సమంత అవుట్ఫిట్పై ఓ లుక్కేయండి!
ఆకుపచ్చ రంగులోనే రెండు షేడ్స్‌ని ఎంచుకొని మెరిసిపోయింది సామ్. లెమన్ గ్రీన్ కలర్ టాప్కు జతగా డార్క్ గ్రీన్ ప్యాంట్, మ్యాచింగ్ కలర్ దుపట్టాను జతచేసింది. ముఖ్యంగా టాప్ ప్లెయిన్‌గా ఉన్నప్పటికీ.. ప్యాంట్‌కు కింది భాగంలో ఎంబ్రాయిడరీ బోర్డర్, దుపట్టాకు జరీ బోర్డర్ అదిరిపోయే లుక్‌ని అందించాయని చెప్పచ్చు. ఇక దుపట్టాను కూడా అందరిలా కాకుండా వెనక నుంచి ముందుకు జాకెట్లా ధరించి తనదైన స్టైల్లో మెరిసిందీ టాలీవుడ్ బ్యూటీ. భారీ ఇయర్రింగ్స్, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన ఈ భామ.. అటు ట్రెడిషనల్‌గా, ఇటు స్టైలిష్‌గా కనిపించింది. మీరు కూడా ఆకుపచ్చ రంగు అవుట్‌ఫిట్స్ ఎంచుకునేటప్పుడు టాప్ టు బాటమ్ మ్యచింగ్ కలర్స్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ లేదంటే గ్రీన్‌లోనే విభిన్న షేడ్స్‌ని ఎంచుకుంటే కలర్ఫుల్గా కనిపించేయచ్చు.. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి!
ఒంటిపై ‘పసుపు’ పూల వనం!
ప్రస్తుత రోజుల్లో ఫ్లోరల్ ఫ్యాషన్‌కు అతివలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పచ్చు. చీరల దగ్గర్నుంచి కుర్తీల దాకా ప్రతిదీ ఫ్లోరల్ ప్రింట్స్‌తో రూపొంది మగువల మనసు దోచుకుంటోంది. అందుకే కనీసం అలాంటి ఒక్క అవుట్‌ఫిట్ అయినా తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకునేందుకు ఆరాటపడుతున్నారు అమ్మాయిలు. దీనికి తోడు ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కూడా పసుపు రంగు చీరతో అలంకరించడం మనకు తెలిసిందే! ఈ క్రమంలో మీరు కూడా పసుపు రంగు అవుట్‌ఫిట్‌లో అటు ట్రెడిషనల్‌గా, ఇటు ట్రెండీగా మెరిసిపోవాలనుకుంటే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే లెహెంగాపై ఓ లుక్కేయండి.
ఫ్లోరల్ ప్రింట్స్‌తో రూపుదిద్దుకున్న పసుపు రంగు స్కర్ట్, స్లీవ్ లెస్ బ్లౌజ్‌కు మ్యాచింగ్‌గా ఉన్న దుపట్టాను జాకెట్లా కుట్టించుకొని ధరించింది పూజ. ఇలా తన లుక్‌కి నప్పేలా సిల్వర్ జ్యుయలరీ, వదులైన హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో ముస్తాబైందీ బుట్టబొమ్మ. ఇలాంటి పసుపు రంగుల్లోనూ ప్రస్తుతం బోలెడన్ని షేడ్స్ అందుబాటులో ఉన్నాయి. పైగా టాప్ టు బాటమ్ మ్యాచింగ్ వద్దనుకుంటే మీ స్కర్ట్ పూల రంగుల్లో నుంచి బాగా హైలైట్ అయిన రంగును ఎంచుకొని ఆ రంగు ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు.. దుపట్టాను కేప్లా, జాకెట్లా.. ఇలా విభిన్న రకాలుగా ధరించచ్చు. తద్వారా అటు సౌకర్యవంతంగా, ఇటు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ పండగ శోభను మీ ఇంట్లో నింపుకోవచ్చు.
‘పర్పుల్’ సొగసులు!
కొన్ని రంగుల్ని మనం రోజూ ధరించడానికి ఇష్టపడితే.. మరికొన్ని కలర్స్‌ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరించేందుకు మొగ్గు చూపుతాం. పర్పుల్ కూడా రెండో కోవలోకి వస్తుంది. చూడ్డానికి హుందాగా, క్లాసీగా కనిపించే ఈ కలర్ అంటే దుర్గమ్మకూ చాలా ఇష్టం. అందుకే దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా పర్పుల్ రంగు చీరతో ఆ అమ్మను అలంకరించి కొలవడం ఆనవాయితీ. ఈసారి అలాంటి కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోవాలనుకునే వారికి యాంకర్ శ్యామల ఓ చక్కనైన డ్రస్‌ని పరిచయం చేస్తోంది.
పర్పుల్ కలర్ ఫుల్ స్లీవ్స్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఆమె.. ఎంతో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది. ఇక డ్రస్ మొత్తం సీక్విన్ వర్క్‌తో రూపొందడం ప్రత్యేక ఆకర్షణ. స్టైలిష్ నెక్‌పీస్, చక్కనైన హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో ముస్తాబైన ఈ సూపర్బ్ యాంకర్.. పండగ శోభంతా తనలోనే ఉందేమో అనేట్లుగా రడీ అయింది. ఈ పండక్కి అమ్మవారిని కొలిచే క్రమంలో మీరు కూడా పర్పుల్ కలర్ చీరలు, అనార్కలీలు, లెహెంగాలు, షరారా.. ఇలా వీటిలో మీకు నప్పిన, నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. క్లాసీగా కనిపించేయచ్చు.
కరోనా ప్రభావంతో ఈసారి దసరా నవరాత్రులు నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో ఎవరింట్లో వారే అమ్మవారిని పూజించడం మేలు. అలాగే ఒకవేళ షాపింగ్‌కి వెళ్లినా కనీస జాగ్రత్తలు పాటించడం మరవకండి! ఇంకా చెప్పాలంటే ఈ రంగుల్లో రూపొందించిన అవుట్‌ఫిట్స్ ఇదివరకే మీ వార్డ్‌రోబ్‌లో ఉన్నట్లయితే వాటితోనే సరిపెట్టుకోవడం మరీ మంచిది..!