ప్రతి విషయంలోనూ అందరికంటే భిన్నంగా, తమకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు మగువలు. ఇక ఫ్యాషన్ దగ్గరికొచ్చే సరికి మాత్రం ఎందులోనూ రాజీ పడరు. ధరించే డ్రస్సుల దగ్గర్నుంచి వాటికి మ్యాచింగ్‌గా పెట్టుకునే యాక్సెసరీస్ వరకూ.. ప్రతిదీ స్టైలిష్‌గానే ఉండాలనుకుంటారు. ఆఖరికి ఈ కరోనా సమయంలోనూ కొంతమంది పెట్టుకునే మాస్కులు, ఫేస్‌షీల్డ్స్ విషయంలోనూ ఫ్యాషనబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటున్నారు. ఇలా ఫ్యాషన్ ప్రియుల అభిరుచులకు తగినట్లుగానే ప్రస్తుతం విభిన్న రకాలైన ఫేస్షీల్డ్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు డిజైనర్లు. అటు సౌకర్యవంతంగా ఉంటూనే, ఇటు స్టైలిష్ లుక్‌ని అందించే ఈ ఫేస్‌షీల్డ్స్ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో రాన్రానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. మరి, ఈ కరోనా వేళ అటు వైరస్ నుంచి కాపాడుకోవడానికి, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడానికి, మరోవైపు నలుగురిలోనూ మన ప్రత్యేకతను చాటుకోవడానికి మార్కెట్లో సందడి చేస్తోన్న కొన్ని స్టైలిష్ ఫేస్‌షీల్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఫ్లిప్-అప్ ఫేస్ ప్రొటెక్టర్
కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రస్తుతం చాలామంది ఫేస్షీల్డ్స్ని ఎంచుకుంటోన్న సంగతి తెలిసిందే. నుదురు దగ్గర్నుంచి మెడ దాకా ట్రాన్స్పరెంట్ షీల్డ్‌తో కప్పేలా ఉండే వీటిని ధరించడం వల్ల వైరస్ దాడి చేయకుండా జాగ్రత్తపడచ్చు.. అయితే ఏదైనా తినాలన్నా, నీళ్లు తాగాలన్నా ఫేస్షీల్డ్ని తీయాల్సి వస్తోంది. మరి, షీల్డ్ పెట్టుకొనే తినడం, తాగడం.. వంటివి చేయాలంటే అందుకు ‘ఫ్లిప్-అప్ ఫేస్ ప్రొటెక్టర్’ చక్కటి ఎంపిక.

ఫొటోలో చూపించినట్లుగా అచ్చం హెల్మెట్‌ని పోలి ఉంటుందీ ఫేస్‌షీల్డ్. హెడ్‌గేర్ సహాయంతో దీన్ని తలకు అమర్చుకొని.. ముందు భాగంలో ఉన్న ట్రాన్స్పరెంట్ షీట్/గ్లాస్‌ను పైకి, కిందికి కదిలించచ్చు.. తద్వారా ఫేస్ ప్రొటెక్టర్ ధరించే తినడం, తాగడం చేయచ్చు. ఇక పని పూర్తయ్యాక తిరిగి ట్రాన్స్పరెంట్ షీట్‌ని కిందికి అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అనుసంధానమై ఉన్న హెడ్‌గేర్ విభిన్న ప్రింట్స్, డిజైన్స్‌తో రూపొంది ఈ ఫేస్ ప్రొటెక్టర్‌ని మరింత స్టైలిష్‌గా మార్చేసింది. ఇలాంటి ఫేస్‌షీల్డ్స్ డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 539 నుంచి రూ. 2,495 వరకు ఉంటుంది.
గాగుల్స్ ఫేస్ షీల్డ్
కొంతమంది స్టైలిష్‌గా కనిపించాలని గాగుల్స్ ధరిస్తుంటారు. అలాగని అవి ధరించి.. ఫేస్‌షీల్డ్ కూడా పెట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనుకుంటుంటారు. అలాంటి వారి కోసం రూపొందించిందే ఈ ‘గాగుల్స్ ఫేస్ షీల్డ్’.

ఫొటోలో చూపించినట్లుగా గాగుల్స్‌తో అనుసంధానమై ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ ట్రాన్స్పరెంట్ షీల్డ్. అయితే లోపలి వైపు ఉండే గాగుల్స్కి లెన్స్లేమీ ఉండవు.. కేవలం ఫ్రేమ్స్ ఉండి.. వాటికి ఇరువైపులా షీల్డ్ అనుసంధానించుకునేందుకు క్లిప్స్ ఉంటాయి. వీటి సహాయంతో ట్రాన్స్పరెంట్ షీల్డ్‌ని గాగుల్స్కి అటాచ్ చేసుకొని కళ్లద్దాల్లా పెట్టేసుకుంటే సరి! చూడ్డానికి స్టైలిష్‌గా కనిపిస్తూనే.. ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ ఫేస్‌షీల్డ్ గాగుల్స్ కూడా విభిన్న డిజైన్లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటి డిజైన్ నాణ్యతను బట్టి గాగుల్స్ ఫేస్ షీల్డ్ ధర రూ. 599 నుంచి రూ. 870 వరకు ఉంటుంది.
మాస్క్ కమ్ షీల్డ్
చాలామందిని గమనిస్తే ముక్కు, నోరు కవరయ్యేలా మాస్క్.. పై నుంచి ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అయితే అటు మాస్క్, ఇటు ఫేస్‌షీల్డ్ కలగలిపి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ ఫొటోలో కనిపిస్తోన్న ‘మాస్క్ కమ్ షీల్డ్’పై ఓ లుక్కేయండి.

ముక్కు, నోరు కవరయ్యేలా సాధారణ మాస్క్‌లా ఉండి.. కళ్లు, నుదురు దగ్గర ట్రాన్స్ఫరెంట్గా ఉంటుందీ షీల్డ్. ఈ రెండూ కూడా అనుసంధానమై ఉంటాయి.. దీన్ని అచ్చం మాస్క్లాగే ధరించచ్చు కూడా! ఈ షీల్డ్‌కి ఇరువైపులా ఉండే ఎలాస్టిక్‌ను చెవుల వెనక్కి అమర్చుకుంటే ముఖానికి పూర్తి రక్షణ కల్పించచ్చు. ఈ స్టైలిష్ ఫేస్‌షీల్డ్ నాణ్యతను బట్టి ధర రూ. 186 నుంచి రూ. 419 వరకు ఉంటుంది.
క్యాప్ ఫేస్‌షీల్డ్
మహిళల యాక్సెసరీస్‌లో క్యాప్ కూడా ప్రధానమైందే. అందులోనూ ఈ వర్షాకాలంలో రెయిన్ క్యాప్ ధరించడం చాలామంది అమ్మాయిలకు అలవాటు. మరి, అటు క్యాప్, ఇటు ఫేస్‌షీల్డ్.. రెండూ ధరించాలంటే ఇబ్బందే! అదే రెండూ కలిపి ధరిస్తే ఎలా ఉంటుంది.. అనుకుంటున్నారా? ఇదిగో ఈ ఫొటోలో మాదిరిగా ఉంటుంది.

తలంతా కవరయ్యేలా ఉండే ఈ క్యాప్‌కి ఇరువైపులా బటన్స్ ఉంటాయి. అలాగే దీనికి మ్యాచింగ్‌గా వచ్చిన ట్రాన్స్పరెంట్ షీల్డ్‌ని కూడా ఇరువైపులా ఉన్న బటన్స్ సహాయంతో క్యాప్‌కు అమర్చుకోవచ్చు.. అవసరం లేదనుకుంటే షీల్డ్‌ని తొలగించచ్చు.. పైగా షీల్డ్ అంచులు క్యాప్‌కు మ్యాచయ్యే రంగుతో గోటీ వర్క్‌లా రూపొందడం ఈ ఫేస్‌షీల్డ్ అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక ఈ తరహా ఫేస్షీల్డ్స్లోనూ విభిన్న ప్రింట్స్‌తో రూపొందించిన క్యాప్స్, బటన్స్‌కి బదులుగా జిప్స్ అమర్చుకునేలా.. ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో లభ్యమవుతున్నాయి. వీటి డిజైన్, ఆకృతిని బట్టి ధర రూ. 599 నుంచి రూ. 771 వరకు ఉంటుంది.
హెడ్ బ్యాండ్ స్ట్రాప్ ఫేస్ షీల్డ్
సాధారణంగా ఫేస్‌షీల్డ్ అంటే ముఖం ముందు భాగం కవరయ్యేలా ఉంటుంది.. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఆ కోవకు చెందినవే. అయితే ముఖంతో పాటు చెవులు కూడా కవరయ్యేలా రూపొందించిన ఫేస్‌షీల్డ్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఫొటోలో చూపించినట్లుగా హెడ్ బ్యాండ్ స్ట్రాప్లా ఉండి.. దానికి చుట్టూరా ట్రాన్స్పరెంట్ షీల్డ్ ఉంటుంది. దీన్ని అచ్చం మనం హెడ్ బ్యాండ్ ధరించినట్లుగా పెట్టుకుంటే సరిపోతుంది. ముఖం ముందు భాగం, చెవులు, చెవుల వెనక భాగంలో కూడా ఇది కవరవుతుంది. పైగా దీన్ని పెట్టుకోవడం, తొలగించడం కూడా చాలా సులువు. ఇలా అటు కంఫర్టబుల్‌గా, ఇటు స్టైలిష్‌గా ఉండే ఈ హెడ్‌బ్యాండ్ స్ట్రాప్ ఫేస్ షీల్డ్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 213 నుంచి రూ. 599 వరకు ఉంటుంది.
వీటితో పాటు పిల్లల కోసం వివిధ కార్టూన్ల క్యారక్టర్లతో, ఫ్లోరల్ డిజైన్స్‌తో రూపొందించిన హెడ్ బ్యాండ్స్, దానికి అమర్చిన ట్రాన్స్పరెంట్ ఫేస్‌షీల్డ్స్ వారిని మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా మార్చేస్తున్నాయని చెప్పచ్చు.
గమనిక: మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీటిని ధరించడం, స్టైలిష్‌గా మెరిసిపోవడమే కాదు.. వాడిన ప్రతిసారీ శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫేస్ షీల్డ్ కింది భాగం నుంచి ముఖాన్ని ముట్టుకోవడం కూడా చేయద్దు. అప్పుడే వైరస్ బారిన పడకుండా పూర్తి సురక్షితంగా ఉండగలుగుతాం.
Photos: Amazon.in