సాత్విక ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేస్తోంది. ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా ఏ డ్రస్ అయితే ఏంటి అనుకొని వర్చువల్ మీటింగ్స్‌కి కూడా క్యాజువల్ అవుట్ఫిట్స్లోనే హాజరవుతోంది.
మహితకు డ్రస్ సెన్స్ తక్కువ. వర్చువల్ మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్‌గా ముస్తాబు కావాలనుకుంటుంది.. కానీ తనకు నప్పనిది వేసుకొని ప్రతిసారీ ఇబ్బంది పడుతుంటుంది.
కరోనా కారణంగా ఇలా ప్రస్తుతం చాలామంది ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తోంది. దీంతో పనిపై పెట్టినంత శ్రద్ధ ప్రొఫెషనల్‌గా తయారవడంపై పెట్టట్లేదనే చెప్పాలి. కానీ ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ నీట్‌గా డ్రస్ వేసుకోకపోయినా పనిపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందంటున్నారు ఆర్గనైజేషనల్ నిపుణులు. కాబట్టి మనం ఎలాగైతే ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ప్రొఫెషనల్‌గా తయారవుతామో.. ఇంట్లోనూ అలాగే ప్రొఫెషనల్ లుక్‌లో ముస్తాబవడం మంచిదని సలహా ఇస్తున్నారు. తద్వారా అటు పనిపై శ్రద్ధ పెట్టడంతో పాటు వీడియో కాల్స్‌లోనూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా, పూర్తి కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్లచ్చు. మరి, ఇంటి నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా, కంఫర్టబుల్‌గా రడీ అవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్ ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి..
డెనిమ్ స్టైలే వేరు!
అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో ఏ అవుట్‌ఫిట్ ఉన్నా లేకపోయినా జీన్స్ లేకుండా మాత్రం వారి వార్డ్రోబ్ అసంపూర్ణమే అని చెప్పాలి. ఈ మోడ్రన్ అవుట్‌ఫిట్ అంతలా మన ఫ్యాషన్స్‌లో భాగమైపోయింది మరి! అయితే ఆఫీస్‌కి వెళ్లేటప్పుడే కాదు.. ఇంటి నుంచి పనిచేసే క్రమంలో కూడా జీన్స్‌ని ఎంచుకొని క్లాసీగా మెరిసిపోవచ్చు. అదెలా అంటే.. మీరు ఎంచుకున్న జీన్స్‌కి జతగా టీషర్ట్ కాకుండా.. ఓ చక్కటి షర్ట్‌ని జతచేసి చూడండి!
బాలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ ఉమన్ ట్వింకిల్ ఖన్నా కూడా అదే చేసింది. బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్‌కి లైట్ కలర్ ఫార్మల్ షర్ట్‌ని జతచేసి కూల్ లుక్‌ని సొంతం చేసుకుందీ సూపర్ మామ్. సింపుల్ మేకప్, చక్కటి హెయిర్‌స్టైల్‌తో బాసీ లుక్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబైంది ట్వింకిల్. ఇలా మీరు కూడా మీకిష్టమైన జీన్స్‌కి ఫార్మల్ షర్ట్‌ని జతచేయచ్చు.. వర్చువల్ మీటింగ్స్ సమయంలో దానిపై ఓ బ్లేజర్ లేదా జాకెట్‌ను ధరిస్తే ప్రొఫెషనల్ లుక్ మీది కాక ఇంకెవరిది అవుతుంది!
కంప్లీట్ బాసీ లుక్‌లో!
సాధారణంగా బిజినెస్ మీటింగ్స్ వంటి సందర్భాలలో పూర్తి ప్రొఫెషనల్‌గా ముస్తాబవడానికే మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో జంప్ సూట్స్, ప్యాంట్ సూట్స్.. వంటివి ఎంచుకొని తమ ఫ్యాషన్ సెన్స్‌ని చాటుతూనే.. లేడీ బాస్‌లా మెరిసిపోతున్నారు ఈ తరం అమ్మాయిలు. బాలీవుడ్ టాల్ బ్యూటీ కత్రినా కూడా అలాంటి ప్యాంట్ సూట్‌లోనే అదరగొట్టేస్తోంది.
బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్డ్ ప్యాంట్ సూట్లో తన బాసీ లుక్‌ని ప్రదర్శించిందీ ముద్దుగుమ్మ. ఇక తన డ్రస్‌కు సరిగ్గా నప్పేలా హూప్ ఇయర్ రింగ్స్, పోనీ హెయిర్‌స్టైల్, చక్కటి మేకప్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటోంది క్యాట్. మరి, మీరూ వర్చువల్ మీటింగ్స్‌లో, లేడీ బాస్‌లా మెరిసిపోవాలంటే ఇలాంటి అటైర్‌ను ఎంచుకోవచ్చు. ఇవే కాకుండా స్కర్ట్స్ సూట్స్, బ్లేజర్‌తో కూడిన బాడీకాన్ డ్రస్.. వంటివి కూడా ఈ తరం అమ్మాయిలకు బాసీ లుక్‌ని తెచ్చిపెడతాయని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి వీటిలో మీకు నప్పిన, సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్ని ఎంచుకొని వర్చువల్‌గానూ అదరగొట్టేయచ్చు!
చీరలోనూ సింపుల్‌గానే!
సాధారణంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రెడిషనల్‌గా ముస్తాబు కావడానికే మొగ్గు చూపుతుంటారు మహిళలు. ఈ క్రమంలో చీరలు, లెహెంగాలు, అనార్కలీ.. వంటి కాస్త హెవీగా ఉన్న అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకుంటుంటారు. అయితే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనూ ఒక్కోసారి ఆఫీస్ పనిచేయాల్సి రావచ్చు. అప్పుడు కూడా డిజైనర్ చీరలు, డ్రస్‌లు ధరిస్తే అంత కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి ట్రెడిషనల్‌గా ముస్తాబవ్వాలన్న కోరికను పక్కన పెట్టకుండానే క్లాసీగా, ప్రొఫెషనల్‌గా మెరిసిపోవచ్చు. కావాలంటే ఓసారి విద్యా బాలన్ శారీ లుక్‌ని చూడండి..
తెలుపు రంగు కాటన్ చీరలో ముస్తాబైన ఆమెను చూస్తే ఎంతో కూల్‌గా అనిపిస్తోంది కదూ! కాబట్టి మీరు కూడా ఇలా సింపుల్‌గా ఉండే కాటన్ చీరలు, సింపుల్ అనార్కలీ డ్రస్సులు.. వంటివి ఎంచుకొని అటు ట్రెడిషనల్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు. అలాగే మీ అటైర్ ఎంత సింపుల్‌గా ఉంటుందో యాక్సెసరీస్ కూడా అంతే సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది.
కంఫర్టబుల్‌గా-స్టైలిష్‌గా!
కొంతమంది వదులుగా ఉండే దుస్తులే ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయనుకుంటారు. దాంతో పాటు స్టైలిష్‌గానూ ఉండాలనుకుంటారు. అలాంటి వారు నేహా ధూపియా అవుట్ఫిట్పై ఓ లుక్కేయండి.
కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన మల్టీ కలర్ ఫ్లేర్డ్ ట్రౌజర్స్ ధరించిన ఆమె.. దానికి మ్యాచింగ్‌గా పొడవాటి లినెన్ జాకెట్‌ను జత చేసింది. ఇలా టాప్ టు బాటమ్ వదులైన అవుట్‌ఫిట్‌తో అదరగొట్టేసిందీ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఈ పొడవాటి జాకెట్‌కు మెడ దగ్గర బ్లేజర్ నెక్లైన్ తరహాలో డిజైన్ రావడంతో ఈ డ్రస్ అటు ప్రొఫెషనల్‌గా, ఇటు స్టైలిష్‌గా కనిపిస్తోంది. మీరు కూడా ఇంటి నుంచి పనిచేస్తోన్న క్రమంలో ఇలా వదులుగా ఉండే దుస్తులు ధరించాలనుకుంటే పలాజో ప్యాంట్స్, వదులుగా ఉండే జాకెట్స్.. వంటివి ఎంచుకొని ప్రొఫెషనల్‌గా మెరిసిపోవచ్చు. అయితే అందులోనూ మరీ డార్క్ కలర్స్ కాకుండా.. కంటికి ఇంపుగా ఉండే రంగులు ఎంచుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది..
క్యాజువల్తో క్లాసీగా!
మీటింగ్స్ మినహా రోజూ ఆఫీసుకెళ్లినా, ఇంటి నుంచి పనిచేసినా క్యాజువల్ దుస్తులు వేసుకోవడానికే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ అవుట్‌ఫిట్స్‌లో దాగున్న సౌకర్యమే అందుకు కారణం. అమ్మాయిలందరూ ఎంతో ఇష్టపడే జీన్స్ దగ్గర్నుంచి కుర్తీల దాకా బోలెడన్ని క్యాజువల్ వేర్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాంటి ఓ క్యాజువల్ డ్రస్‌ని ధరించి మన ముందుకొచ్చేసింది బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్.
మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ నీ-లెంత్ డ్రస్ ధరించిన ఆమె.. చాలా సింపుల్‌గా ముస్తాబైంది. వదులైన జుట్టు, సింపుల్ మేకప్‌తో రడీ అయిన సోహా.. ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఇలాంటి అవుట్‌ఫిట్స్ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటాయని తన అటైర్‌తో చెప్పకనే చెప్పింది. అయితే ఇలాంటి డ్రస్‌లో ముస్తాబై వర్క్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు వర్చువల్ మీటింగ్ ఉందన్నా గబగబా వెళ్లి డ్రస్ మార్చుకోనక్కర్లేదు.. దీనిపై ఓ డెనిమ్ జాకెట్ లేదంటే మ్యాచింగ్ బ్లేజర్ ధరించి చూడండి.. అటు స్టైల్‌గానూ, ఇటు క్లాసీగానూ మెరిసిపోవచ్చు..!