ఎలాంటి సందర్భంలోనైనా దానికి తగినట్లుగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకోవడం అతివల నైజం. ఈ క్రమంలోనే ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్లకు తమ క్రియేటివిటీని జతచేసి లవ్లీ లుక్‌ని సొంతం చేసుకుంటుంటారు. మరి, అలాంటి అకేషన్ రానే వచ్చింది. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు మహిళలు ట్రై-కలర్ ఫ్యాషన్‌తో తమలోని దేశభక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కొందరు అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌లో ఉన్న తిరంగా ఫ్యాషన్లను బయటికి తీస్తున్నారు. మరికొందరు ట్రై-కలర్స్‌లోనే సరికొత్త ఫ్యాషనబుల్ దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. ఏదేమైనా.. ఈసారి ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకునే స్వాతంత్ర్య వేడుకల కోసం ఎంతో సింపుల్‌గా, అదీ నేటి తరం ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...
శారీ ఎవర్గ్రీన్ - లుకింగ్ సింపుల్!
చీరకట్టు మన సంప్రదాయానికి పెద్ద పీట వేస్తుంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చీరకట్టుకోవడానికే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. అది కూడా తిరంగా కలర్స్‌లో రూపుదిద్దుకున్న చీరనే ఎంచుకుంటుంటారు. అయితే అది అప్పటి థీమ్‌కి తగినట్లుగా ఉండచ్చు.. కానీ అదే చీరను మళ్లీ ఏదైనా ఇతర అకేషన్‌కి కట్టుకోవాలనిపించినా కట్టుకోలేం. కాబట్టి ఈసారి అలాంటి ట్రైకలర్స్లోనే రూపొందించిన ఓ సింపుల్ శారీని ఎంచుకోండి. అదెలా ఉంటే బాగుంటుందో పూర్తి అవగాహన రావాలంటే.. ఓసారి మందిరా బేడీ చీరకట్టుపై ఓ లుక్కేయండి.
వైట్ కలర్ శారీపై గ్రీన్ కలర్ ప్రింట్, అంచులకు ఆరెంజ్ గోటీ - మధ్యలో సిల్వర్ కలర్ షైనింగ్ లేస్ బోర్డర్‌తో రూపుదిద్దుకున్న ఈ చీర.. ముచ్చటగా మూడు రంగుల్లో చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇలా తన చీరకు ఆరెంజ్ కలర్ ప్లెయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జతచేసి సింప్లీ సూపర్బ్ అనిపించిందీ బాలీవుడ్ భామ. చేతికి గడియారం, షార్ట్ హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన మందిర.. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి చీర ఎంచుకునే అమ్మాయిలకు తన లుక్‌తోనే ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోందీ బ్యూటిఫుల్ మామ్. ఇలాంటి చీరను ఈ సందర్భంలోనే కాకుండా.. ఇతర అకేషన్లకూ నిర్మొహమాటంగా కట్టేసుకోవచ్చు.. ఇక ఇలాంటి సింపుల్ చీరలోనే కాస్త హెవీగా కనిపించాలంటే.. డిజైనర్ బ్లౌజ్, ఆభరణాలు అందుకు చక్కగా ఉపయోగపడతాయి. మరి, ఆలస్యమెందుకు.. ఇలాంటి ఎవర్గ్రీన్ ట్రై-కలర్ శారీని ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంచుకొని మెరిసిపోండి.
ఒకే కలర్లో కావాలనుకుంటే..!
ప్రస్తుతం కాంట్రాస్ట్ కలర్ ఫ్యాషన్ ఎంత ట్రెండింగ్‌లో ఉందో.. అదేవిధంగా టాప్ టు బాటమ్ మ్యాచింగ్ కలర్ అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవడానికి కూడా చాలామంది అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. మీరూ అంతేనా..? అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా రంగుల్లో మీకు నప్పిన ఓ రంగును ఎంచుకోండి. కావాలంటే మన సామ్ ధరించిన గ్రీన్ కలర్ కుర్తా సెట్ చూడండి.. ఎంత బావుందో! టాప్, బాటమ్, దుపట్టా.. ఇలా అన్నీ ఒకే కలర్లో రూపొందించినవి ఎంచుకొని హుందాగా మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఇక కుర్తా, దుపట్టాపై వచ్చిన గోల్డ్‌న్ జరీ గీతలు డ్రస్ అందాన్ని ద్విగుణీకృతం చేశాయని చెప్పచ్చు. ఇలా తన అవుట్‌ఫిట్‌కి నప్పేలా చాంద్‌బాలీ ఇయర్రింగ్స్, పోనీ హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించుకుంది సామ్. మరి, మీరూ ఆకుపచ్చ అనే కాకుండా ఆరెంజ్, తెలుపు.. వంటి రంగుల్లో ఉన్న విభిన్న అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకొని సందడి చేయచ్చు.
జాకెట్ జత చేసేయండి!
సంప్రదాయబద్ధమైన చీర దగ్గర్నుంచి, ట్రెండీగా కనిపించే జీన్స్-టీషర్ట్ వరకు ప్రతి దానికీ జాకెట్‌ని జతచేస్తూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు నేటి తరం అమ్మాయిలు. ఈ ఇండిపెండెన్స్ డేకి కూడా ఇదే తరహా ఫ్యాషన్‌ని మీరు అనుసరించచ్చు. అయితే మీరు ఎంచుకునే అవుట్‌ఫిట్ టాప్ టు బాటమ్ ఒకే కలర్లో ఉండేలా.. దానిపై ఫ్లోరల్ లేదంటే ఇతర ప్రింటెడ్ తరహా జాకెట్‌ని ధరిస్తే ఇక మీ లుక్‌కి తిరుగే ఉండదు. ఇదే విషయాన్ని తన అవుట్‌ఫిట్‌తో నిరూపిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఆరెంజ్ కలర్ ట్రౌజర్ - మ్యాచింగ్ క్రాప్‌టాప్ వేసుకున్న పూజ.. అదే రంగు బెల్టును తన నడుముకు జతచేసింది. ఇక దానిపై ఫ్లోరల్ ప్రింటెడ్ నీ-లెంత్ జాకెట్‌ని జతచేసి.. అటు ఫ్యాషనబుల్‌గా, ఇటు బాసీ లుక్‌లో దర్శనమిచ్చిందీ బ్యూటీ. మరి, మీరూ ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ కార్యాలయాల్లో నిర్వహించే వేడుకలకు వర్చువల్‌గా హాజరుకావాలనుకుంటే.. ఇలా మీ అవుట్ఫిట్పై లాంగ్/షార్ట్ జాకెట్‌ను జత చేసేయండి.. ప్రొఫెషనల్‌గా ఆకట్టుకోండి!
తెలుపైనా.. కాస్త వైవిధ్యంగా!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాలామంది అతివలు తెలుపు రంగు దుస్తుల్లో ముస్తాబవడానికి ఆసక్తి చూపుతుంటారు. మీరూ ఆ కోవలోకే వస్తారా? అయితే ఈసారి ప్లెయిన్ వైట్ కాకుండా.. దానిపై ఫ్లోరల్ ప్రింట్ ఉన్నవి ఎంచుకోండి.. తద్వారా అటు దేశభక్తిని చాటచ్చు.. ఇటు లేటెస్ట్ ఫ్యాషన్నీ ఫాలో అయినట్లుగా ఉంటుంది. రాశీఖన్నా కూడా అదే స్టైల్ డ్రస్‌లో తళుక్కుమంది. కంప్లీట్ వైట్ కలర్ కోల్డ్ షోల్డర్ మ్యాక్సీ ధరించిన ఆమె.. తన డ్రస్‌పై ప్రింట్ చేసిన పింక్ కలర్ గులాబీ పువ్వులు డ్రస్‌కు అదిరిపోయే లుక్‌ని అందించాయి. ఇక డ్రస్‌కు మ్యాచింగ్ హీల్స్, వేవీ హెయిర్, సింపుల్ ఇయర్రింగ్స్, లైట్ మేకప్‌తో ఓ వెలుగు వెలిగింది రాశి. ఇలా తెలుపు రంగులోనే విభిన్న ప్రింట్స్‌తో రూపొందించిన ఫ్యాషన్లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటిలో మీకు నప్పిన, నచ్చిన అవుట్‌ఫిట్‌ని ఎంచుకుంటే ఈసారి మీ కుటుంబ సభ్యులందరిలోకెల్లా మీదే హైలైట్ లుక్ అవుతుందనడంలో సందేహం లేదు.
తిరంగా కలర్స్‌తో ఇలా తళుకులీనండి!
ట్రై కలర్స్ అనగానే చాలామంది అమ్మాయిలు చుడీదార్స్ ఎంచుకుంటుంటారు. అది కూడా టాప్ టు బాటమ్ ప్లెయిన్‌గా ఉండే వాటికే మొగ్గుచూపుతుంటారు. అయితే ఈసారి ప్లెయిన్‌గా ఉన్నవి కాకుండా మూడు రంగులు విభిన్న ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించినవి ఎంచుకొని ట్రై చేయండి. సారా అలీ ఖాన్ కూడా ఇదే ఫ్యాషన్ సూత్రం ఫాలో అయింది. గ్రీన్ కలర్ లెగ్గింగ్ ధరించిన ఆమె.. దానిపై తెలుపు రంగు లేస్ ఫ్యాబ్రిక్ కుర్తా వేసుకుంది. ఈ రెండింటికీ కాంట్రాస్ట్‌గా ఆరెంజ్ కలర్ బనారసీ దుపట్టాను జతచేసి వహ్వా అనిపించిందీ పటౌడీ ప్రిన్సెస్. ఇలా తన అటైర్‌కు పూర్తి అపోజిట్‌గా ఉండేలా బ్లూ కలర్ ఇయర్రింగ్స్, బ్యాంగిల్స్‌తో అదరగొట్టింది సారా. చిన్న జెండాను చేతిలో పట్టుకొని వందనం చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఇలా టాప్ టు బాటమ్ మూడు వేర్వేరు రంగుల్లో ఉన్నా.. ప్లెయిన్‌వి కాకుండా విభిన్న ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించిన దుస్తులు ట్రెడిషనల్ లుక్‌ని, మనలోని దేశభక్తిని చాటుతాయని తన లుక్‌తో నిరూపించిందీ బాలీవుడ్ అందం.
మాస్క్ మర్చిపోవద్దు!
అవుట్‌ఫిట్ అనగానే దానికి మ్యాచింగ్‌గా ఆభరణాలు, గాజులు, ఫుట్‌వేర్.. వంటి యాక్సెసరీస్ అన్నీ ఎంచుకోవడం కామనే. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా తమ డ్రస్‌కు మ్యాచింగ్‌గా తిరంగా యాక్సెసరీస్‌ను ఇష్టపడుతుంటారు అతివలు. వీటిలోనూ బోలెడన్ని డిజైన్లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఈసారి ఈ యాక్సెసరీస్ లిస్టులో మాస్క్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో మాస్క్ ధరించడం మాత్రం మర్చిపోవద్దు. ఈసారి వేడుకలను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం ఉత్తమం. కొంతమంది అపార్ట్మెంట్లు, కాలనీల్లో జెండా ఎగరేసి సంబరాలు చేసుకుంటారు. అయితే ఆ వేడుకలకు అపార్ట్మెంట్/కాలనీ వాసులందరూ హాజరు కావడం కాకుండా.. ఒక్కో ఇంటి నుంచి ఒక్కొక్కరు వెళ్లడం ఉత్తమం. ఈ క్రమంలో మీ ఇంటి నుంచి మీరొక్కరే హాజరు కావాల్సి వస్తే.. చక్కటి అవుట్‌ఫిట్‌కు జతగా మ్యాచింగ్ మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మ్యాచింగ్ మాస్క్ అంటే గుర్తొచ్చింది.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకంగా ఈ సారి మూడు జెండా రంగుల్లో రూపొందించిన సరికొత్త మాస్కులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటిని ఎంచుకొని మీ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ చేస్తే సెంటరాఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు! కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి!
చూశారుగా.. తిరంగా ఫ్యాషన్స్‌లో ప్రస్తుత ట్రెండ్‌ని అనుసరిస్తూ.. అటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతూ, ఇటు దేశభక్తిని చాటుకోవడమెలాగో! కాబట్టి వీటిని ఎంచుకునేటప్పుడు కూడా ఈ అవుట్‌ఫిట్స్/ఫ్యాషన్స్ మీకు నప్పుతున్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే సౌకర్యంగా, స్టైలిష్‌గా కనిపించేయచ్చు.. ఏమంటారు?!