పెళ్లంటేనే ఎన్నో వేడుకలు, సంబరాలు. మరి, వాటికి తగ్గట్లుగానే నవ వధువులు కూడా అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని కోరుకుంటారు. అంతేనా.. పెళ్లిలో, ఇతర పెళ్లి వేడుకల్లో తాము ధరించే అవుట్‌ఫిట్స్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ఆరాటపడుతుంటారు. కొత్త పెళ్లికూతురు మిహీకా బజాజ్ కూడా అచ్చం అలానే ఆలోచించినట్లుంది. అందుకే తన ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వేడుకలో అందమైన లెహెంగాలో మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. అయితే తాను ధరించిన ఈ అవుట్‌ఫిట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించే చర్చంతా! మరి, ఇంతకీ ఏంటా లెహెంగా కథ? రండి.. మనం కూడా తెలుసుకుందాం..!
సెలబ్రిటీ కపుల్ రానా-మిహీకా బజాజ్‌లు ఏడడుగుల బంధంతో ఒక్కటి కావడానికి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే పెళ్లికి మూడు రోజుల ముందుగానే మిహీక ఇంట్లో ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో జరిగిన హల్దీ ఫంక్షన్లో పసుపు రంగు లెహెంగాలో అదరగొట్టేసిందీ కొత్త పెళ్లికూతురు. ఇక ఆ తర్వాత జరిగిన మెహెందీ వేడుకలోనూ తనదైన స్టైల్లో మెరిసిపోయింది మిహీక.
‘పింక్’ లెహెంగాలో ప్రెట్టీగా!
పసుపు ఫంక్షన్లో ‘పుత్తడి’ బొమ్మలా మెరిసిన మిహీక.. ఆపై నిర్వహించిన మెహెందీ వేడుక కోసం పింక్ లెహెంగాను ఎంచుకుంది. ఈ గులాబీ రంగు లెహెంగాపై వచ్చిన క్రీమ్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అవుట్‌ఫిట్ లుక్‌ని ద్విగుణీకృతం చేసిందని చెప్పచ్చు. ఇలా తన లెహెంగాకు మ్యాచింగ్‌గా ముత్యాల ఆభరణాలను జతచేసిందీ ఫ్యాషన్ బేబ్. మాంగ్ టిక్కా, ముత్యాలతో రూపొందించిన లేయర్డ్ బుట్టా ఇయర్రింగ్స్ ఆమెకు రాయల్ లుక్‌ని అందించాయి. వేవీ హెయిర్‌స్టైల్‌తో ముస్తాబైన మిహీక.. తన పెదాలకు పింక్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుంటుండగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
అమ్మ లెహెంగా చుట్టేసింది!
తన ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అటు ట్రెడిషనల్‌గా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతోన్న మిహీక.. మరో వేడుకలో అందమైన లెహెంగాలో దర్శనమిచ్చింది. అయితే ఈ అవుట్‌ఫిట్ తాను ఇప్పుడు డిజైన్ చేయించుకుంది కాదు.. తన తల్లి ఆమె పెళ్లిలో ధరించింది కావడం విశేషం. అలా అమ్మ పెళ్లినాటి లెహెంగాను ఇప్పుడు తన పెళ్లి వేడుకల్లో చుట్టేసింది మిహీక. రెడ్-గ్రే కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ లెహెంగాకు బాందినీ ప్రింట్ రావడం, స్కర్ట్ బోర్డర్-దుపట్టా అంచులకు మిర్రర్, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేయడంతో ఈ అవుట్‌ఫిట్ హెవీగా కనిపిస్తోంది. ఇలా తన డ్రస్‌కు తగ్గట్లుగా స్టోన్-కట్ జ్యుయలరీ, వదులైన హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్‌తో అదరగొట్టేసిందీ ముద్దుగుమ్మ. ఇక తన కూతురు తన పెళ్లినాటి చీరలో ముస్తాబవడం చూసిన మిహీకా తల్లి బంటీ బజాజ్ తన ఆనందాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. కూతురి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆమె.. ‘నా పెళ్లినాటి అవుట్‌ఫిట్ ధరించి ముస్తాబైన నా బంగారు తల్లిని చూడడానికి రెండు కళ్లూ సరిపోవట్లేదు. నా చిట్టితల్లి అప్పుడే అంతలా ఎదిగిపోయిందంటే నమ్మలేకపోతున్నా..’ అంటూ భావోద్వేగంతో క్యాప్షన్ రాసుకొచ్చారామె. ఇలా తన పెళ్లి వేడుక కోసం అమ్మ చీరను ఎంచుకున్న మిహీక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
రానా-మిహీకల వివాహం ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో జరగనుంది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటి కానుందీ అందాల జంట.