షూటింగ్స్ అయినా, సినిమా ప్రమోషన్స్ అయినా ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడం మన ముద్దుగుమ్మలకు అలవాటే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్, ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో అందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌నే ఆశ్రయించారు. ఈ క్రమంలో కొందరు ఓటీటీ వేదికగా విడుదలవుతోన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంటే.. మరికొందరు తమ చిత్ర ప్రమోషన్లను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార విద్యా బాలన్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది. ఈ నెల 31న ఓటీటీలో విడుదల కాబోతున్న తన సినిమా ‘శకుంతలా దేవి’ డిజిటల్ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉందీ బాలీవుడ్ బ్యూటీ. అంతేనా.. ప్రమోషన్ ఆన్లైన్లోనే అయినా తన డ్రస్సింగ్ సెన్స్‌తో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం విద్య.. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తుల్ని ధరిస్తూ భారతీయ వస్త్ర కళల్ని ప్రపంచానికి చాటుతోంది.
‘వోకల్ ఫర్ లోకల్’.. భారతీయ వస్త్ర కళల్ని ప్రపంచానికి చాటే ముఖ్యోద్దేశంతో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌కు తన మద్దతు పలుకుతోంది విద్య. ఈ క్రమంలోనే దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విభిన్న దుస్తుల్ని ధరిస్తూ ఆన్లైన్ వేదికగా తన సినిమా ‘శకుంతలా దేవి’ ప్రమోషన్లను నిర్వహిస్తోందీ అందాల తార. సాధారణంగానే ఏవైనా సినిమా ఫంక్షన్లు, ప్రముఖుల పెళ్లిళ్లలో చీరకట్టులో కుందనపు బొమ్మలా ముస్తాబయ్యే విద్య.. ఇప్పుడు ఈ-ప్రమోషన్లలోనూ ట్రెడిషనల్ కమ్ ఫ్యాషనబుల్‌గా రడీ అవుతూ అందరి చూపూ తనవైపు తిప్పుకుంటోంది. మరి, ఈ క్రమంలో ఈ చక్కనమ్మ ధరించిన ‘లోకల్’ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
చీరకట్టు అదిరేట్టు!
ఎన్ని సరికొత్త ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా మన భారతీయ సంప్రదాయం చీరకట్టుకు ఏదీ సాటి రాదని చెప్పడం అతిశయోక్తి కాదు. అందులోనూ చేనేత చీరలంటే అతివలు ఎంతో మక్కువ చూపుతుంటారు. చీరకట్టుకున్న వారికి అది అందించే హుందాతనమే అందుకు ప్రధాన కారణం. మన బాలీవుడ్ అందాల తార విద్యా బాలన్ కూడా అదే విషయం చెబుతోంది. చీరకట్టు విషయంలో అందరికంటే ముందుండే విద్య.. ఆన్‌స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ చీర కట్టుకొని కుందనపు బొమ్మలా ముస్తాబవడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఇక ఇప్పుడు తన సినిమా ‘శకుంతలా దేవి’ ఈ-ప్రమోషన్లలో భాగంగా ఓ అందమైన చేనేత చీరలో దర్శనమిచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ. ఓ చేనేత ఎగ్జిబిషన్లో తాను కొనుక్కున్న నలుపు-పసుపు రంగులతో కూడిన కోర్వాయ్ కాటన్ చేనేత చీరను ధరించింది విద్య. చీరంతా ప్లెయిన్గానే ఉన్నా.. డబుల్ బోర్డర్ రావడం చీరకు హైలైట్ అని చెప్పచ్చు. అందులోనూ బ్లాక్ బోర్డర్‌పై వచ్చిన జరీ, పసుపు రంగు బోర్డర్‌పై అద్దిన బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చీర అందాన్ని రెట్టింపు చేశాయి. ఇలా తన చీరకు మ్యాచింగ్‌గా బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను స్టైలిష్‌గా ధరించి అదరగొట్టేసింది. ఇక సింపుల్ మేకప్, ఇయర్ రింగ్స్, పోనీ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన ఈ అందాల తార.. సింప్లీ సూపర్బ్ అనిపించుకుంది.
డై సిల్క్ ప్యాంట్‌సూట్!
ప్యాంట్‌సూట్ వంటి మోడ్రన్ అవుట్‌ఫిట్స్ అంటే చాలు.. వాటిని పాశ్చాత్య దుస్తులుగానే భావిస్తుంటారు చాలామంది. కానీ మన దేశంలోనూ విభిన్న మోడ్రన్ అవుట్‌ఫిట్స్ తయారవుతాయని, అది కూడా సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసినవి దొరుకుతాయని తన అవుట్‌ఫిట్‌తో నిరూపిస్తోంది విద్య. ‘రౌకా’ క్లాతింగ్ లైన్ నుంచి ఎంచుకున్న పసుపు రంగు ప్యాంట్‌సూట్‌లో మెరిసిందీ కుందనపు బొమ్మ. సహజసిద్ధమైన డై సిల్క్ ఫ్యాబ్రిక్‌తో దీన్ని రూపొందించడం ఈ డ్రస్ ప్రత్యేకత! ఇక డ్రస్ పై నుంచి కింది వరకు అక్కడక్కడా వచ్చిన క్లాంప్ డై షిబోరీ డాట్స్ (ఇదొక డై పద్ధతి) , కేప్లా వచ్చిన క్రాప్‌టాప్ స్లీవ్స్.. వంటివన్నీ ఈ అవుట్‌ఫిట్‌కు అదనపు వన్నెలద్దాయని చెప్పచ్చు. ఇక ఈ దుస్తుల్ని మున్నార్‌కు చెందిన ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు తయారుచేయడం మరో విశేషం. ఇక సింపుల్ మేకప్, బన్ హెయిర్‌స్టైల్‌తో పాటు తాను ధరించిన స్టైలిష్ ఇయర్ రింగ్స్ తన లుక్‌ని మరింత హైలైట్ చేశాయని చెప్పుకోవచ్చు.
‘మ్యాక్సీ’తో మతిపోగొడుతోంది!
మ్యాక్సీ డ్రస్సులు ప్రస్తుతం ప్రతి మగువ వార్డ్‌రోబ్‌లోనూ భాగమయ్యాయి. అటు శరీరమంతా కప్పి ఉండేలా, ఇటు ఎంతో సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుందీ అవుట్‌ఫిట్. అందుకే సింపుల్ అకేషన్స్‌కి ఈ సూపర్బ్ డ్రస్‌ని ఎంచుకొని మెరిసిపోతున్నారు ఈ తరం అమ్మాయిలు. విద్య కూడా అలాంటి ఓ చక్కనైన మ్యాక్సీ గౌన్‌లో మన ముందుకొచ్చేసింది. ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన ఈ బ్లూ కలర్ టైర్డ్ మ్యాక్సీని పాయల్ ప్రతాప్ క్లాతింగ్ స్టోర్ నుంచి ఎంచుకుందీ ముద్దుగుమ్మ. మన దేశ వస్త్రాలైన చందేరీ సిల్క్, కాటన్ ఫ్యాబ్రిక్స్‌తో దీన్ని రూపొందించారు డిజైనర్లు. ఇక ఈ డ్రస్‌కు ఉన్న ‘వి’ నెక్, త్రీ-బై-ఫోర్త్ లూజ్ స్లీవ్స్ మ్యాక్సీని మరింత అందంగా మార్చేశాయి. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా న్యూడ్ మేకప్, పోనీ హెయిర్‌స్టైల్, లాంగ్ చెయిన్ ఇయర్‌రింగ్స్‌తో అదరగొట్టేసింది విద్య.
పువ్వుల్లో దాగున్న స్టైలెంతో అతిశయం!
ఆడవారికి సహజంగానే పువ్వులంటే ఇష్టం.. అలాంటిది ఆ పూలే దుస్తులపైకి చేరితే వాటిని కొనకుండా ఎలా ఉంటారు చెప్పండి..! పైగా ఈ మధ్య ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రస్సులైనా, చీరలైనా తెగ కొనేస్తున్నారు అమ్మాయిలు, అతివలు. అలాంటి ఓ ఫ్లోరల్ ప్రింట్ అవుట్‌ఫిట్ ధరించింది మన ఆన్‌స్క్రీన్ శకుంతల. పసుపు రంగు ఫ్యాబ్రిక్‌పై పెద్ద పెద్ద పువ్వులతో రూపొందించిన పలాజో డ్రస్ వేసుకొని స్టైలిష్‌గా మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఆహార పదార్థాల, గార్డెన్ వ్యర్థాలను కంపోస్ట్ చేయడం ద్వారా తయారైన సహజసిద్ధమైన ఫైబర్ మెటీరియల్‌తో ఈ అవుట్‌ఫిట్‌ని తయారుచేయడం దీని ప్రత్యేకత! ప్రముఖ డిజైనర్ ఆయుష్ కేజ్రీవాల్ ఈ డ్రస్ రూపకర్త. ఇలా వంద శాతం సహజసిద్ధమైన మెటీరియల్‌తో రూపొందించిన పలాజో డ్రస్ ధరించిన విద్య.. ప్రతి ఒక్కరూ ఇలాంటి న్యాచురల్ అవుట్ఫిట్స్కే ప్రాధాన్యమివ్వాలని కోరుతోంది. సింపుల్ ఇయర్స్టడ్స్, కాస్త హెవీ మేకప్, పోనీతో తన లుక్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చిందీ సుందరి.
కాంట్రాస్ట్ కలర్‌తో కళగా!
మగువలు ఇష్టపడే కలర్ కాంబినేషన్స్‌లో ప్రస్తుతం కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్ నడుస్తోంది. అది చీరైనా, లంగా-వోణీ అయినా, డ్రస్సయినా.. ఇలా అవుట్‌ఫిట్ ఏదైనా సరే.. దానికి జతగా ధరించే బ్లౌజ్, వోణీ, దుపట్టా, ప్యాంట్.. ఇలా ఏదో ఒకటి అపోజిట్ కలర్లో ఉంటే బాగుంటుందనుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. విద్య కూడా అదే అనుకున్నట్లుంది.. అందుకే ఎవర్గ్రీన్ యెల్లో-టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ చీరలో తళుక్కుమంది. కోయంబత్తూరుకు చెందిన చేతివృత్తుల కళాకారులు తయారుచేసిన ఈ కోర్వాయ్ కోరా కాటన్ చీరను ఓ ఎగ్జిబిషన్లో కొన్నానంటోంది విద్య. ఇక చీరపై వచ్చిన చిన్న చిన్న చెక్స్, పసుపు రంగు బోర్డర్ ఆమెకు సింప్లీ సూపర్బ్ లుక్‌ని అందించాయి. ఇక దీనికి జతగా పసుపు రంగు ప్లెయిన్ బ్లౌజ్‌ను జతచేసిన విద్య.. హూప్ ఇయర్రింగ్స్, కాస్త హెవీ మేకప్, పోనీతో కుందనపు బొమ్మలా కనిపించింది.
టాప్ టు బాటమ్ - సేమ్ టు సేమ్!
టాప్ టు బాటమ్ ఒకే డిజైన్ లేదంటే ఒకే కలర్‌తో రూపొందించిన అవుట్‌ఫిట్‌ని వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కారణం.. ఎబ్బెట్టుగా కనిపిస్తుందేమోనని! కానీ అలాంటి డ్రస్‌లో ఇలా స్టైలిష్‌గా మెరిసిపోవచ్చని తన అటైర్‌తో నిరూపిస్తోంది విద్య. చేత్తో రూపొందించిన ఫుచ్సియా కలర్ ట్యూనిక్ టాప్, దానికి జతగా అదే రంగు ధోతీ ప్యాంట్‌ను జతచేసిందీ అందాల తార. ప్రముఖ డిజైనర్ ఊర్వశీ కౌర్ రూపొందించిన ఈ డ్రస్‌కు మ్యాచింగ్‌గా చేతికి గోల్డ్ కలర్ బ్రేస్లెట్, పోనీ హెయిర్‌స్టైల్, సింపుల్ ఇయర్ రింగ్స్‌తో పాటు చక్కటి మేకప్‌తో అదరగొట్టిందీ బాలీవుడ్ సుందరి.
తన సినిమా ప్రమోషన్లతో పాటు భారతీయ వస్త్ర కళానైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికి విద్య ధరించిన విభిన్న అవుట్‌ఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదా! వీటిని ఎలాంటి ప్రత్యేక సందర్భంలోనైనా ఇట్టే ధరించచ్చు.. సింపుల్ అండ్ స్వీట్‌గా, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మెరిసిపోవచ్చు..!