వ్యాపార దిగ్గజాల కుటుంబంలో పుట్టినా, మెగా ఫ్యామిలీలో మెట్టినా.. ఓ బిజినెస్ వుమన్‌గా, సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన, నటుడు రామ్ చరణ్ భార్యగానే కాకుండా.. ‘అపోలో’ లైఫ్ వైస్-చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాల్లోనూ భాగమవుతోందీ సుపర్ వుమన్. అంతేకాదు.. ఫిట్నెస్, ఆరోగ్యం పట్ల పకడ్బందీగా ఉండే ఈ మెగా వారి కోడలు.. ఈ అంశాల గురించి సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. అంతేనా.. ఫ్యాషన్ విషయంలోనూ అప్డేటెడ్గా ఉంటుంది. తనకు నచ్చే, యువత మెచ్చే ఫ్యాషన్లు ఫాలో అవుతూ.. నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతుందీ మెగా డాటర్-ఇన్-లా. మరి, ఈ స్టార్ లేడీ ఫ్యాషనబుల్ వార్డ్‌రోబ్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
సంప్రదాయం ఉట్టిపడేలా..
భారతీయ ఫ్యాషన్స్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ఎన్ని సరికొత్త ఫ్యాషన్స్ వెల్లువలా మనందరినీ ముంచెత్తుతున్నా.. చీరకట్టుకుంటే ప్రాముఖ్యమే వేరు. భారతీయ సంప్రదాయానికి అద్దం పట్టే చీర కట్టుకుంటే మనదేశ మహిళలే కాదు.. విదేశీయుల్లోనూ భారతీయత ఉట్టిపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి ఇండియన్ ట్రెడిషన్ల్ వేర్లో మెరిసింది మెగా వారి కోడలు. ప్రముఖ ఫ్యాషనర్ తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన డబుల్ షేడెడ్ గ్రీన్ కలర్ చీరలో తళుక్కుమంది. దానికి బ్రాడ్ ‘V’ నెక్లైన్ ఎంబ్రాయిడరీ వెల్వెట్ బ్లౌజ్‌ని జత చేసి మరిన్ని వన్నెలద్దింది. ఇక్కడ తన జ్యుయలరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. తన చీరకట్టకు నప్పేట్లుగా హెవీ నెక్లెస్, ఇయర్రింగ్స్, కంగన్ డిజైన్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ రింగ్‌తో వావ్ అనిపించేలా ముస్తాబైంది ఉపాసన. చూడచక్కని మేకప్, సింపుల్ హెయిర్‌స్టైల్ తన లుక్‌కి అదనపు హంగులద్దాయని చెప్పచ్చు. సింపుల్, ప్లెయిన్ చీరలకు హైలైట్ టచ్ ఇవ్వాలనుకుంటే ఈ ఫ్యాషన్ దివా శారీ లుక్‌ని ఫాలో అవ్వాల్సిందే! సాధారణ చీరలకు డిఫరెంట్ స్టైల్, హెవీ వర్క్ బ్లౌజ్‌లను జత చేయడంతో పాటు మ్యాచింగ్ లేదా మోడ్రన్ జ్యుయలరీని జోడిస్తే అందరి ప్రశంసలందుకోవచ్చు.
ట్రెండీ కమ్ ట్రెడిషనల్ బ్యూటీ..
ట్రెడిషనల్ లుక్ అనగానే చీరనే గుర్తొస్తుంటుంది చాలామందికి. కానీ చిన్నపాటి జాగ్రత్తలతో ట్రెండీ స్టైల్లో క్లాసీ స్టార్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తోంది ఉపాసన. ప్రస్తుతం ట్రెండింగ్ ఫ్యాషన్స్‌గా అమ్మాయిల మెప్పునందుకుంటున్న గరారా లుక్‌లో ట్రెడిషనల్‌గా మెరిసిందీ బ్యూటీ. డిజైనర్ తరుణ్ తహ్లియానీ రూపొందించిన బ్లూ కలర్ గరారాని ధరించిన ఈ మెగా వుమన్.. దానికి జతగా మ్యాచింగ్ షార్ట్ టాప్‌ని జత చేసింది. కేప్ స్టైల్ క్లోజ్డ్ నెక్ డిజైన్, డ్రస్ ఆసాంతం గోల్డెన్ వర్క్.. అద్భుతః అనిపించేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తన డ్రస్ లుక్‌ని మరింత హైలైట్ చేస్తూ.. కుందన్-ఎమరాల్డ్ నెక్లెస్, ఇయర్రింగ్స్, బ్యాంగిల్స్ అందరి దృష్టినీ కట్టిపడేశాయి. లూజ్ వేవీ హెయిర్, స్టన్నింగ్ మేకప్ తన లుక్‌ని మరింత అందంగా తీర్చిదిద్దాయని చెప్పచ్చు. ట్రెడిషనల్ లుక్‌కి కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకునే వారికి ఈ లుక్ సెట్ అవుతుంది. అందులోనూ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో జోరుమీదున్న ఇలాంటి గరారా, షరారా, పలాజో స్టైల్స్‌లో ముస్తాబైతే అందరూ అలానే చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి ప్యాంట్స్‌కి లాంగ్ టాప్స్, రఫుల్ టాప్స్, ట్యునిక్ టాప్స్, క్యాఫ్టన్ టాప్స్.. ఇలా రకరకాల మోడల్స్‌ని కూడా జత చేసి స్టైల్ ఐకాన్‌లా మెరిసిపోవచ్చు.
బ్యూటీ ఇన్ బ్లాక్..
ఎన్ని కలర్‌ఫుల్ దుస్తులున్నా.. బ్లాక్ డ్రస్ లేనిదే అమ్మాయిల వార్డ్రోబ్ సంపూర్ణం కాదని చెప్పచ్చు. క్యాజువల్ లుక్కైనా.. స్పెషల్ ఫంక్షన్లో అట్రాక్టివ్‌గా మెరిసిపోవాలన్నా.. బ్లాక్ లుక్ సరైన ఎంపిక అని చెప్పచ్చు. అలాంటి ఒక బ్లాక్ లుక్‌లో తారలా మెరిసిపోతోంది ఉపాసన. బ్లాక్ కలర్ ప్లీటెడ్ స్కర్ట్‌కి.. అదే కలర్ హై-నెక్ ఫుల్ స్లీవ్ టాప్‌ని జత చేసింది. వేవీ హెయిర్‌స్టైల్.. మినిమల్ మేకప్‌తో తన లుక్‌ని ముగించింది మెగా కోడలు. ఇలాంటి బ్లాక్ లుక్స్ ఎలాంటి సందర్భాలకైనా అద్భుతంగా సరిపోతాయి. కాబట్టి క్యాజువల్ లుక్ నుండి పార్టీ వేర్ వరకు ప్రతి డిజైన్‌లో ఒక బ్లాక్ లుక్నైనా తన వార్డ్‌రోబ్‌లో నింపేస్తుంటారు అమ్మాయిలు. ఇక ఇలాంటి స్కర్ట్ అటైర్ క్యాజువల్‌గా బయటకు వెళ్లడానికి.. సినిమాలకు.. పార్టీలకు హాజరవడానికి.. సాధారణంగా కాలేజ్‌కి వేసుకెళ్లడానికి.. ఇలా ప్రతి సందర్భానికి నప్పుతుంది. మరి మీరు ఇలాంటి లుక్‌ని మీ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోండి.. స్టైలిష్‌గా మెరిసిపోండి.
బాస్ బేబీ..
జీన్స్ తర్వాత అమ్మాయిలకు కంఫర్ట్ లుక్ ఏదంటే వెంటనే ‘లెగ్గింగ్’ ప్యాంట్ అని చెప్తారు. కుర్తా, టీ-షర్ట్, టాప్స్.. ఇలా ఎలాంటి దుస్తులైన లెగ్గింగ్‌తో సంపూర్ణమైన లుక్‌గా మార్చవచ్చు. మరి క్యాజువల్ లెగ్గింగ్ లుక్‌ని బాసీ లుక్లా ఎలా మార్చాలో ఉపాసనని చూసి నేర్చుకోవచ్చు. సింపుల్ బ్లాక్ కలర్ లెగ్గింగ్కి.. అదే కలర్ క్యాజువల్ టీ-షర్ట్‌ని జత చేసింది ఉపాసన. తన లుక్‌కి బాసీ స్టైల్ టచ్ ఇచ్చే విధంగా బ్లాక్-వైట్ చెక్స్ జాకెట్‌ని జత చేసింది. క్యాజువల్ లుక్‌కి స్టైలిష్ జాకెట్‌ని జోడించి బాస్‌ని తలపించింది. ఆభరణాలేవీ ధరించకుండా.. తన లుక్‌కి నప్పేట్లుగా పోనీ, బ్లాక్ షూస్, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని ట్రెండీ స్టైల్లో ముగించిందీ స్టార్ లేడీ. మీరు కూడా చాలా సాధారణమైన లుక్‌కి ఇలా జాకెట్స్, బ్లేజర్స్.. లాంటి వాటిని జోడించడం వల్ల అఫిషియల్ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. ఆఫీస్‌లో అఫిషియల్ మీటింగ్స్‌కి, బిజినెస్ పార్టీస్‌కి ఇలాంటి కార్పోరేట్ అటైర్ సూపర్బ్‌గా నప్పుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఎవర్గ్రీన్ అనార్కలీ..
అనార్కలీని ఇష్టపడని అమ్మాయిలుండరనడంలో అతిశయోక్తి లేదు. చీర, లంగా-ఓణీ తర్వాత అమ్మాయిలకు ట్రెడిషనల్ లుక్కిచ్చేది అనార్కలీ అని చెప్పచ్చు. అందులోనూ కాస్త ఎత్తు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి అటైర్లో బుట్టబొమ్మలా మెరిసిపోవచ్చు. అలా బొమ్మలాంటి లుక్‌తో అందరి చూపూ తనవైపు తిప్పుకుందీ మోడ్రన్ లేడీ. తరుణ్ తహ్లయానీ డిజైన్ చేసిన గోధుమ కలర్ ప్రింటెడ్ ఫుల్ స్లీవ్స్ అనార్కలీకి.. అదే కలర్ ప్యాంట్.. దుపట్టాను జత చేసింది. దుపట్టాపై మెరూన్ కలర్ ప్రింట్ డ్రస్‌కి కొత్త కళను అద్దిందని చెప్పచ్చు. ఇక తన యాక్సెసరీస్ విషయానికొస్తే.. మస్కర్డ్ ఎల్లో కలర్ షూస్, హెవీ జుంకీలు ప్రత్యేకమైన లుక్కిచ్చాయని చెప్పచ్చు. లూజ్ హెయిర్, షైనీ మేకప్‌తో తన లుక్‌ని సింపుల్‌గా ముగించిందీ అందాల తార. అనార్కలీని ధరించడానికి సందర్భంతో సంబంధం లేదు. సాధారణ కాలేజ్ లుక్ నుండి గ్రాండ్ ఫంక్షన్స్ వరకు ప్రతి అకేషన్‌లోనూ ఇట్టే నప్పేస్తుందీ బ్యూటీఫుల్ ఫ్యాషన్. అందుకోసమే అనార్కలీలు వివిధ రకాల డిజైన్స్‌లో లభిస్తున్నాయి. హై-లో, టైర్డ్, మల్టీలేయర్, ప్లీటెడ్.. ఇలా ఎన్నో రకాల డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సందర్భానికి తగ్గట్టుగా ఎంచుకుంటే చక్కని చుక్కలా మెరిసిపోవచ్చు.
మల్టీకలర్లో కలర్ఫుల్గా..
కళ్లు చెదిరే మల్టీకలర్లో బ్యూటిఫుల్‌గా మెరిసిపోతున్నారు అమ్మాయిలు. ప్రస్తుతం చీరల దగ్గర్నుంచి మోడ్రన్ డ్రస్సుల వరకు అన్ని రకాల అవుట్‌ఫిట్స్ మల్టీకలర్స్లో లభించడం వల్ల అమ్మాయిలు వాటిపై తెగ మోజు పడుతున్నారు. అలాంటి ఓ మల్టీకలర్ లుక్ కలర్‌ఫుల్ క్వీన్‌లా వెలిగిపోతోంది ఉప్సీ. ఫేమస్ డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ కోశ్లా రూపొందించిన బ్లాక్ కలర్ లెహెంగాపై మల్టీకలర్ త్రెడ్ వర్క్‌ని చూసిన ఎవరైనా స్టన్ అవకుండా ఉండలేరు. దానికి జతగా ఆప్ షోల్డర్ బ్లాక్ కలర్ క్రాప్‌టాప్‌ని జతచేసిందీ ముద్దుగుమ్మ. బ్లాక్-మల్టీకలర్ బెల్ స్లీవ్స్ తన డ్రస్‌కి అదనపు హంగులద్దాయని చెప్పచ్చు. తన డ్రస్‌కి నప్పేట్లుగా ఎమరాల్డ్-రూబీ నెక్లెస్, రింగ్‌ని ధరించింది ఉపాసన. మెస్సీ హెయిర్‌స్టైల్, బ్లష్ మేకప్‌తో సింప్లీ సూపర్బ్ అనేలా ముస్తాబైందీ బ్యూటీ. ప్రస్తుతం మల్టీకలర్ లుక్ ఫ్యాషన్ ప్రపంచంలో జోరుమీదుందని చెప్పచ్చు. ఇలాంటి వివిధ రంగులతో త్రెడ్ వర్క్‌తో పాటు ప్రింటెడ్ డిజైన్స్‌లో రూపొందించిన ఫ్యాషనబుల్ దుస్తులు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్కర్ట్స్, చీరలు, సల్వార్.. ఇలా మనకు నచ్చిన మల్టీకలర్ లుక్‌ని ఎంచుకుని కలర్‌ఫుల్ ఫ్యాషన్‌లో అదరగొచ్చేయండి.
చూశారుగా.. మెగా కోడలిగా.. సమాజసేవకురాలిగా ఇలా పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుతూనే.. ఫ్యాషన్ రంగంలో కూడా తనది అందెవేసిన చేయని తన డిఫరెంట్ వార్డ్రోబ్ లుక్స్ ద్వారా నిరూపిస్తోంది ఉపాసన. ఇక ఆలస్యమెందుకు.. తన ఫ్యాషన్స్‌లో మీకు నచ్చిన, నప్పిన డిజైన్స్‌ని ఎంచుకుని అందాలా తారలా మెరిసిపోండి.. మరి!
గమనిక: టాలీవుడ్లో వారసులే తప్ప వారసురాళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టడం చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలుకొడుతూ.. తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగువారి మనసులో ‘మెగా ప్రిన్సెస్’గా పేరు సంపాదించిన ‘నిహారికా కొణిదెల’ డిఫరెంట్ లుక్స్ గురించి తెలుసుకోవాలంటే మార్చి 9 న www.vasundhara.net లో ‘సెలబ్రిటీ స్టైల్ఫైల్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.