ప్రపంచంలోని ఏ దేశ మహిళలకైనా.. భారతీయ దుస్తులు ఇట్టే నప్పేస్తాయని, వారు ఆ దుస్తుల్లో భువికి దిగొచ్చిన దేవకన్యల్లా అత్యద్భుతంగా కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్ ధరించిన ఫ్యాషన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు మోడ్రన్‌గా, హుందాగా కనిపిస్తూనే .. మరోవైపు వాటికి భారతీయ శైలిని అద్ది తమ ఫ్యాషన్ సెన్స్‌తో ఇక్కడి ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేశారీ అమెరికన్ లేడీస్. అంతేకాదు.. ఇలా తమవైన ఫ్యాషన్లతో భారతదేశంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారీ పవర్ఫుల్ ఉమెన్. మరి, భారత పర్యటనలో భాగంగా తమ సింపుల్ కమ్ ఇండో-ట్రెడిషనల్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమెరికన్ అందాలు ధరించిన ఫ్యాషన్స్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..
లేడీ బాస్‌లా..
భారతదేశ పర్యటనలో భాగంగా మొదటి రోజు జంప్ సూట్లో లేడీ బాస్‌లా దర్శనమిచ్చింది అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. డిజైనర్ పియర్ హెర్వ్ రూపొందించిన వైట్ కలర్ జంప్ సూట్‌కి నడుము భాగంలో భారతీయ మూలాలు గల వస్త్రాన్ని బెల్ట్‌లా జతచేసింది. ఈ క్రమంలో గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్‌పై గోల్డెన్ జరీ వర్క్ సూపర్బ్ లుక్కించిందని చెప్పచ్చు. ఈ వస్త్రం ఫినిషింగ్‌కి ఉపయోగించిన ఫ్యాబ్రిక్ భారతదేశానికి చెందిన ఎంతో అరుదైన వస్త్రమని తన ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు డిజైనర్ పియర్ హెర్వ్. ఇలా తాను తొలిరోజు ధరించిన డ్రస్‌తో దేశంపై ఉన్న మక్కువను చాటుకుందీ బ్యూటిఫుల్ లేడీ.

ఈ గౌన్ ప్రత్యేకతలెన్నో!
సాధారణంగా తెలుపు రంగు దుస్తులను ఎక్కువగా ఇష్టపడే మెలానియా.. తన రెండో రోజు పర్యటనలో కరోలినా హెరేరా ఫ్యాషన్ స్టోర్ నుండి ఎంచుకున్న తెల్లని గౌన్‌లో మెరిసింది. ఆ డ్రస్‌పై మల్టీకలర్ లోటస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ తన లుక్‌ని మరింత హైలైట్ చేసిందని చెప్పచ్చు. అంతేకాదు.. ఈ వైట్ డ్రస్‌లో మరో ప్రత్యేకత కూడా దాగుంది. కమలాన్ని మన జాతీయ పుష్పంగా, అభివర్ణిస్తాం. భారతీయ జనతా పార్టీ గుర్తు కూడా ఇదే కావడం గమనార్హం. అలాంటి రంగురంగుల కలువ పువ్వుల్ని తన డ్రస్‌పై డిజైన్ చేయించుకొని మరోసారి భారతీయుల మనసు దోచుకుందీ అమెరికన్ ఫస్ట్ లేడీ. రూ. 1.15లక్షల విలువ గల ఈ గౌన్‌కి నడుము భాగంలో జత చేసిన కాంట్రాస్ట్ కలర్ లెదర్ బెల్ట్ తనకు, తన అటైర్‌కు అదనపు హంగులద్దిందని చెప్పచ్చు. లూజ్ వేవీ హెయిర్.. సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని ముగించింది మెలానియా.

మెలానియా.. ఓ ఫ్యాషన్ ఐకాన్!
తమ పర్యటన సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ధరించిన ఫ్యాషన్లు భారతీయులందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘ఆమె దుస్తులు అత్యద్భుతంగా ఉన్నాయం’టూ అందరూ ఆమె ఫ్యాషన్ల గురించి ముచ్చటించేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యులే కాదు.. పలువురు భారతీయ డిజైనర్లు కూడా మెలానియా ఫ్యాషన్ అభిరుచిని కొనియాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వరూపా రెడ్డి మెలానియా ధరించిన ఫ్యాషన్ గురించి తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు ‘మెలానియా అమెరికాకు ప్రథమ మహిళ కావడం వల్ల ఆమె ఏది చేసినా కేవలం అమెరికా మహిళలపైనే కాదు.. ప్రపంచ దేశాల మహిళలపై ప్రభావం చూపుతుంది. అటు ఫ్యాషన్ ట్రెండ్‌ని అనుకరిస్తూనే.. ఇటు సంప్రదాయాన్ని మరవకుండా.. తనకు ఎటువంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయో వాటిని ఎంచుకోవడంలో తను ఆసక్తి కనబరుస్తున్నారు. సందర్భానికి తగ్గ రంగుల దుస్తులను ఎంచుకుంటూ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు. ఈ క్రమంలో భారత్‌లో అడుగుపెట్టే రోజున ఆమె ధరించిన తెలుపు రంగు దుస్తులు స్నేహానికి, శాంతికి సూచిక. కొంతకాలంగా మెలానియా బోల్డ్ ఫ్యాషన్ల పట్ల ఆసక్తి చూపడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారీ ఫ్యాషనర్.

సంప్రదాయ ఫ్యాషన్‌కే ఆమె ఓటేస్తున్నారు!
మరో యంగ్ ఫ్యాషనర్ శిరీషా రెడ్డి మెలానియా ఫ్యాషన్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘మెలానియా పక్కా పొలిటికల్ డ్రస్సింగ్ ఫాలో అవుతున్నారు. తను హాజరైన ప్రతి కార్యక్రమంలో అమెరికాతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆమె డ్రస్సింగ్ ఉంటుంది. సంస్కృతి ఉట్టిపడుతుంది. అంతేకాదు.. ఏ డ్రస్‌లోనైనా ఆత్మవిశ్వాసం నిండిన మహిళగా కనిపిస్తారు. జంప్ సూట్ ధరించి ఓవైపు అమెరికా సంస్కృతిని చాటుతూనే.. నడుముకు పట్టు వస్త్రాన్ని బెల్ట్‌లా ధరించి భారతీయ సంప్రదాయాన్నీ ప్రతిబింబించారు. ఎక్కడి వారు అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను బట్టి వారికి అనుకూలమైన దుస్తులను ధరించడం కామన్.. కానీ మెలానియా ఫ్యాషన్‌ని పరిశీలిస్తే సంప్రదాయ ఫ్యాషన్‌కే తను ఓటేస్తున్నారని అర్థమవుతోంది..’ అంటూ మెలానియా డ్రస్సింగ్ సెన్స్‌ను ప్రశంసల్లో ముంచెత్తారీ ఇండియన్ డిజైనర్.

ఆ గౌన్ వెనకున్న కథ ఇదే!
సాధారణంగా మనమే ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. సరికొత్త డిజైనర్ దుస్తుల్ని డిజైన్ చేయించుకొని అందంగా మెరిసిపోతుంటాం. అలాంటిది స్వతహాగా ఫ్యాషనర్, మోడల్ అయినా ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ విషయంలో ఇంకెంత అప్డేటెడ్గా ఉంటుంది చెప్పండి.. భారత పర్యటనలో భాగంగా ఆమె ధరించిన ఫ్యాషన్లు చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి కూతురైనా ఒదిగి ఉండే నైజం ఆమెలోనే కాదు.. ఆమె ధరించే ఫ్యాషన్లలోనూ తొణికిసలాడుతుందనడంలో అస్సలు సందేహమే లేదు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ వేదికగా జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు’కు హాజరైన ఆమె.. ఆద్యంతం భారతీయ ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోయి ఇక్కడి వారి మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం రెండోసారి భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలోనూ అదే ధోరణిని అనుసరించిందీ వైట్ బ్యూటీ.
ఈ క్రమంలో తొలిరోజు పర్యటనలో భాగంగా పౌడర్డ్ బ్లూ కలర్ ఫ్లోరల్ గౌన్‌లో మెరిసిన ఇవాంక.. తన నిండైన ఫ్యాషన్‌తో భారతీయులను మరోసారి ఆకట్టుకుంది. సాధారణంగా ఒకసారి వేసుకున్న డ్రస్‌ని మళ్లీ ధరించి ప్రపంచానికి చూపించడం అనేది సెలబ్రిటీల విషయంలో చాలా అరుదు. కానీ ఇవాంక తొలిరోజు పర్యటనలో వేసుకున్న ప్రోయాంజ షూలర్ బ్రాండ్‌కు చెందిన ఈ డ్రస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో అర్జెంటీనా పర్యటనలో ధరించడం విశేషం. అయితే అందుకు కారణం లేకపోలేదు. రూ. 1.7 లక్షల విలువ గల ఈ ‘V’ నెక్ ఫ్లోరల్ మిడ్డీ డ్రస్ రీసైక్లింగ్ చేయడం ద్వారా తయారైంది. ఈ ప్రింటెడ్ గౌన్ని తన భారతీయ పర్యటన కోసం ఎంచుకుని సస్టెయినబిలిటీ ఫ్యాషన్‌కి మద్దతుగా నిలవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా సందేశాన్నందించిందీ అమెరికన్ లేడీ.
నాటి డ్రస్.. నేటి ట్రెండ్!
ఇక తన రెండో రోజు భారత పర్యటనలో భాగంగా భారతీయత ఉట్టిపడే దుస్తుల్లో మెరిసింది ఇవాంక. మనదేశానికి చెందిన ప్రముఖ లేడీ ఫ్యాషనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఐవరీ కలర్ బంద్‌గాలా ఫుల్ స్లీవ్డ్ షేర్వాణీని ధరించిందీ అమెరికన్ బ్యూటీ. దానికి మ్యాచింగ్ ప్యాంట్‌ని జోడించి వావ్ అనిపించే లుక్‌లో ముస్తాబైందీ పడమటి నెలవంక. ఇక తన డ్రస్‌పై మెటాలిక్ గోల్డెన్ బటన్స్ అదుర్స్ అనిపించే లుక్‌ని అందించాయి. ఈ దుస్తులను ముర్షీదాబాద్ పట్టుతో తయారుచేయడం విశేషం. అంతేకాదు.. ఈ మోడల్ని డిజైనర్ 20 సంవత్సరాల క్రితమే రూపొందించారు. అలనాటి ఫ్యాషన్‌ను ఇప్పుడు ఇవాంక ధరించి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ముస్తాబవడంతో అటు దేశీయ ఫ్యాషనర్లు, ఇటు ఫ్యాషన్ ప్రియులు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
అప్పుడూ అదుర్స్ !
2017 నవంబర్‌లో ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు’కు హాజరైన ఇవాంక హైదరాబాద్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాపార దిగ్గజం తన స్పీచ్‌తోనే కాదు.. ఫ్యాషన్స్‌తో కూడా హైదరాబాదీలను ఫిదా చేసేశారు. నాడు ఆమె ధరించిన ఈ ఫ్యాషనబుల్ లుక్స్‌ని నేడు మరోసారి చూసేయండి.
వెస్ట్రన్ డ్రస్.. ఇండియన్ జుంకీస్!
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా భారతీయత ఉట్టిపడే ఫ్యాషన్లలో మెరిసిన వైట్ బ్యూటీస్ మెలానియా, ఇవాంకాలు.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులోనూ మరింత రాయల్‌గా కనిపించారు. ఈ క్రమంలో అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా అందమైన లాంగ్ గౌన్‌లో అదరగొట్టారు. అటు తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా, ఇటు నిండుదనం ఉట్టిపడేలా ఉన్న ఈవెనింగ్ గౌన్‌లో మెరిసిందీ పడమటి తార. కరోలినా హెరారా డిజైన్ చేసిన బబుల్గమ్ పింక్ నీ-లెంత్ స్లిట్ లాంగ్ గౌన్‌లో ముస్తాబయ్యారు మెలానియా. వైడ్ స్లీవ్స్, మెడ భాగంలో బో-టై డిజైన్ తన డ్రస్‌కి అదనపు లుక్కిచ్చాయని చెప్పచ్చు. డ్రస్ విషయంలో తమ దేశ పద్ధతి ప్రకారం ఈవెనింగ్ గౌన్ని ధరించినా.. నిండైన దుస్తులతో భారతీయత తొణికిసలాడేలా ముస్తాబయ్యారీ ఫస్ట్ లేడీ. అంతేకాకుండా.. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా చెవులకు బుట్టా కమ్మలు, తన డ్రస్‌కు మ్యాచ్ అయ్యేవిధంగా కాళ్లకు పింక్ కలర్ ఎంబ్రాయిడరీ జ్యూతీస్ని జతచేసి లవ్లీగా మెరిశారామె. ఇలా మెస్సీ బన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన మెలానియా.. లాంగ్ గౌన్‌లో ఎంతో హుందాగా కనిపించారని చెప్పచ్చు.
అనార్కలీలో వైట్ బ్యూటీ!
భారత పర్యటన ఆద్యంతం ఇండియన్ ట్రెడిషనల్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన విందుకు హాజరైన సమయంలో కూడా భారతీయ డిజైనర్ రోహిత్ బల్ రూపొందించిన లుక్‌ని ఎంచుకుని అందరీ చూపూ తనవైపు తిప్పుకుంది. ఐవరీ కలర్ ఫ్లోర్ లెంత్ అనార్కలీ లుక్‌లో ముస్తాబైందీ ముద్దుగుమ్మ. ఫుల్ స్లీవ్స్‌పై గోల్డెన్ త్రెడ్ వర్క్.. క్లోజ్డ్ నెక్ మొదలు డ్రస్ ఆసాంతం ఎర్ర గులాబీల ఎంబ్రాయిడరీ, మల్టీకలర్ త్రెడ్ వర్క్ వావ్ అనిపించేలా ఉంది. సింపుల్ మేకప్, మెస్సీ బన్‌తో తెల్ల కలువలా మెరిసింది ఇవాంకా. ఇలా ఇవాంక డ్రస్ చూడగానే రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు’లో భాగంగా ఆమె ధరించిన ఇండియన్ ట్రెడిషనల్ దుస్తులు జ్ఞప్తికి వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారి స్టైల్స్ ప్రభావితం చేస్తాయి!
మెలానియా, ఇవాంకా భారత పర్యటనలో భాగంగా వారు ఎంచుకున్న ఫ్యాషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖ డిజైనర్స్ వరకు ఎవరినోట విన్నా వారి స్టైలిష్ లుక్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ఫ్యాషన్స్ గురించి పలువురు ఫ్యాషన్ డిజైనర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై ప్రముఖ డిజైనర్ మంగారెడ్డి మాట్లాడుతూ.. ‘భారతీయ ఫ్యాషన్స్‌పై పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. ఫ్యాషన్స్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సింపుల్ స్టైల్‌ని ఫాలో అవడం లేదంటే డబ్బుకు వెనకాడకుండా ట్రెండ్‌ని పాటించడం చేస్తున్నారు. అయితే మెలానియా స్టైల్స్.. ఫ్యాషన్ రంగంపై ప్రభావం చూపుతాయి. తను పాటించిన ఇండో-వెస్ట్రన్ స్టైల్‌ని నేటి తరం అమ్మాయిలందరూ ఫాలో అయ్యే అవకాశాలు లేకపోలేదు. మన రంగులకు, మన ఫ్యాబ్రిక్ డిజైన్స్‌కు జరీరి జత చేస్తూ డిజైన్స్ రావచ్చు..’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారామె.
ట్రెండ్ సెట్ చేశారు!
మరో ఫ్యాషనర్ నిహారికా రెడ్డి మెలానియా ఫ్యాషన్స్ గురించి చెప్తూ.. ‘ఫ్యాషన్ రంగంలో కొత్త మార్పులను, ఆలోచనలను స్వాగతించడమే కాదు.. అనుకరించాలి కూడా! మెలానియా విషయంలోనూ అంతే..! తన ఫ్యాషన్స్‌పై చాలా ఆసక్తి నెలకొంది. మన సంప్రదాయాలను తను ధరించే దుస్తులకు మేళవించారు. అందుకే.. ఆమె ధరించిన ఆకుపచ్చ రంగు బెల్ట్‌కు జరీతో డిజైన్ చేశారు. ప్రస్తుతం సింపుల్‌గా ఉండడాన్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మెలానియా ఫ్యాషన్స్ తరహాలో సరికొత్త ట్రెండ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సింగిల్ పీస్ దుస్తులపై ఆసక్తి చూపవచ్చు..’ అంటూ మెలానియా ఫ్యాషన్స్ ప్రభావం గురించి తనదైన తరహాలో వివరించింది డిజైనర్ నిహారిక.
ఇలా తమ భారత పర్యటనలో భాగంగా ఆద్యంతం భారతీయత ఉట్టిపడే దుస్తులతో ఇక్కడి యువతకు ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలిచారీ అమెరికన్ సూపర్బ్ లేడీస్. ఇలా వారు ధరించిన డ్రస్సులు కేవలం ఫ్యాషన్ పరంగానే కాదు.. ఎన్నో ప్రత్యేకతలనూ చాటుకున్నాయి.