లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మొదటి మూడు రోజుల ఫ్యాషన్స్ ఒకెత్తయితే, చివరి రెండు రోజుల ఫ్యాషన్స్ ఇంకో ఎత్తని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ఫ్యాషన్ షోలో చివరి రెండు రోజులు ప్రముఖ ఫ్యాషనర్స్తో పాటు బాలీవుడ్ అగ్ర తారాలోకం ర్యాంప్‌పై తమ హొయలతో ఫైర్ పుట్టించారు. బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్ నుంచి రైజింగ్ స్టార్ తారా సుతారియా వరకు పలువురు బాలీవుడ్ బ్యూటీస్ తమ స్టైల్స్‌తో లాక్మే స్టేజ్‌ని ఫ్యాషన్ పరేడ్‌గా మార్చేశారు. మరి లాక్మే స్టేజ్‌పై ఫ్యాషనబుల్ అటైర్స్‌లో మెరిసిన ఈ మెరుపుతీగల గురించి తెలుసుకుందాం రండి..
* బాలీవుడ్ డస్కీ బ్యూటీ ఈషా గుప్తా లాక్మే ఫ్యాషన్ వేదికను తనదైన స్టైల్‌తో షేక్ చేసింది. నిర్మూహా ఫ్యాషన్ లేబుల్ డిజైన్ చేసిన వైట్ కలర్ షార్ట్ స్కర్ట్‌ని ధరించిన ఆమె.. దానికి జతగా మ్యాచింగ్ క్రాప్‌టాప్‌ని జోడించింది. స్కర్ట్‌పై తళుకుల వర్క్, వీటిపైకి జత చేసిన డై డిజైన్ ఆర్గంజా కేప్ ఆమె లుక్‌కి మరింత హంగులద్దాయని చెప్పవచ్చు. సింపుల్ బాబీ పిన్స్‌తో తన హెయిర్ స్టైల్‌ని ముగించిన ఈ ముద్దుగుమ్మ ఆభరణాలేవీ ధరించకుండా.. కేవలం స్టైలిష్ హీల్స్‌తోనే సూపర్బ్ అనిపించింది. వేవీ హెయిర్, సింపుల్ మేకప్ తన లుక్‌కి సెక్సీ టచ్ అందించాయి.
* పటౌడీ బ్యూటీ సోహా అలీ ఖాన్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మోడ్రన్ లుక్‌లో తళుక్కుమంది. షాహిన్ మన్నన్ డిజైన్ చేసిన బ్లూ కలర్ స్కర్ట్ ధరించిన సోహా, దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్‌గా స్ట్రాప్‌లెస్ కోర్సెట్ని ధరించింది. ఆభరణాలేవీ ధరించకుండా.. స్టైలిష్ స్లింగ్ బ్యాగ్, బ్లాక్ బూటీస్ని జోడించిందీ అందాల తార. బీచ్ వేవీ హెయిర్, సింపుల్ మేకప్ తన స్టైలిష్ లుక్‌కి మరింత అందాన్నిచ్చాయని చెప్పాలి.
* బాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ తారా సుతారియా ట్రెడిషనల్ లెహెంగా లుక్‌లో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ప్రముఖ ఫ్యాషనర్ పునిత్ బాలనా డిజైన్ చేసిన పేస్టల్ షేడ్ సిల్క్ లెహెంగాకు మ్యాచింగ్ కలర్ క్రాప్‌టాప్‌ని జత చేసి అందరినీ తన వైపునకు తిప్పుకుందీ లేటెస్ట్ సెన్సేషన్. తన లెహెంగా అటైర్పై గోల్డెన్ వర్క్ అద్భుతమనిపించేలా ఉందని చెప్పక తప్పదు. తన అటైర్కి నప్పేట్లుగా జత చేసిన అదే కలర్ దుపట్టా తన లుక్‌ని సంపూర్ణం చేసిందని చెప్పుకోవచ్చు. హెవీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, రింగ్‌తో తన జ్యుయలరీ లుక్‌ని ముగించింది. బీచ్ వేవీ హెయిర్ స్టైల్, బ్లష్ మేకప్ తన లుక్‌ని మరింత ద్విగుణీకృతం చేశాయి.
* పూజా బేడీ గారాల పట్టి అలయా ఫర్నీచర్వల్లా లాక్మే ర్యాంప్‌పై హొయలొలికిస్తూ మురిసిపోయింది. సోనమ్, పరాస్ మోదీ ద్వయం డిజైన్ చేసిన చెవ్రాన్ లెహెంగాలో మెరిసిన ఈ బ్యూటీ దానికి ఎంబ్రాయిడరీ హై-నెక్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌ని జత చేసింది. సాఫ్ట్ కర్లీ లూజ్ హెయిర్, మినిమమ్ మేకప్‌తో తన లుక్‌ని ముగించిందీ ముద్దుగుమ్మ.
* టాలీవుడ్ బొద్దుగుమ్మ నిత్యా మేనన్ కూడా లాక్మే ర్యాంప్‌పై తళుక్కుమంది. డిజైనర్ కావేరి రూపొందించిన వైట్-గ్రే కలర్ టైర్డ్ స్కర్ట్ ధరించిన ఆమె.. దానికి జతగా లైట్ ఎల్లో కలర్ షార్ట్ కుర్తీ, గ్రే కలర్ దుపట్టాను జత చేసి తన లుక్‌కి ట్రెండీ టచ్ ఇచ్చింది. మెడలో ధరించిన ఫ్లోరల్ డిజైన్ నెక్‌పీస్ తన అటైర్కి సరిగ్గా నప్పింది. కర్లీ హెయిర్, హైలైటింగ్ మేకప్ తన లుక్‌కి మరింత వన్నెలద్దాయని చెప్పచ్చు. ఇక ర్యాంపుపై డిజైనర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరినీ కవ్వించిందీ కన్నడ కుట్టీ.
* క్రికెట్లోనే కాదు.. ఫ్యాషన్‌లో కూడా తను క్వీన్ అని నిరూపించింది మిథాలీ రాజ్. ఫ్యాషనర్ పాయల్ సింగాల్ డిజైన్ చేసిన పేల్ పింక్ లెహెంగాకు.. రఫుల్ ఆఫ్ షోల్డర్ టాప్‌ని జోడించిందీ హైదరాబాదీ క్రికెటర్. ఇక మెటాలిక్ బ్యాంగిల్స్‌తో తన జ్యుయలరీ లైన్‌ని సింపుల్‌గా ముగించింది. సింపుల్ మేకప్, బీచ్ వేవీ హెయిర్‌స్టైల్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించిందీ స్టార్ క్రికెటర్.
* ఫ్యాషనర్ ద్వయం పంకజ్, నిధి కోచర్ ప్రదర్శనలో భాగంగా ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ పూర్తి ట్రెండీ లుక్‌లో జిగేల్మంది. డెనిమ్ జీన్స్‌ని ధరించి.. దానికి జోడీగా స్ట్రాప్‌లెస్ లాటిస్ ఫ్రింజెస్ టాప్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చిందీ కపూర్ బ్యూటీ. టాప్‌కి ఎద భాగంలో క్యూబిక్ ఇల్యూజన్ డిజైన్ వావ్ అనిపించేలా ఉందని చెప్పక తప్పదు. సాఫ్ట్ హెయిర్, షైనీ మేకప్ తన లుక్‌ని మరింతగా తీర్చిదిద్దాయని చెప్పచ్చు.
* దేవకన్య ర్యాంప్‌పై నడిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? అయితే దివ్యా ఖోస్లా కుమార్ లాక్మే షోని చూస్తే సరి. ‘Krsna’ కోచర్ డిజైన్ చేసిన సిల్వర్ షిమ్మరీ లెహెంగాలో దర్శనమిచ్చిందీ సుందరీ. తను జోడించిన క్లీవేజ్ నెక్లైన్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ మ్యాచింగ్ క్రాప్‌టాప్ తన లుక్‌కి మరింత అందాన్నద్దిందని చెప్పుకోవచ్చు. చోకర్, హెవీ స్టడ్స్, రెడ్ లిప్స్‌తో ర్యాంప్‌పై మెరిసిందీ అందాల తార.
* వెండి తెరకు దూరంగా ఉన్నా.. తన అప్డేటెడ్ ఫ్యాషన్స్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తోంది రియా చక్రవర్తి. తాజాగా దీపా గోయల్ డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌లో లాక్మే ఫ్యాషన్ షోలో మెరిసిందీ బ్యూటీ. పింక్-రెడ్ కలర్ లేయర్డ్ లెహెంగాకు.. ఆఫ్ షోల్డర్ క్రాప్‌టాప్, పింక్ కలర్ షీర్ దుపట్టాతో తన అటైర్ని ముగించింది. ఆభరణాలేమీ ధరించకపోయినా.. సాఫ్ట్ కర్లీ హెయిర్, వెట్ మేకప్‌తో ట్రెడిషనల్ లుక్‌ని సొంతం చేసుకుందీ బాలీవుడ్ బేబ్.
* గోవా స్లిమ్ బ్యూటీ ఇలియానా లాక్మే-2020లో తనదైన స్టైల్‌తో అలరించింది. ఫ్యాషనర్ మృణాళినీ రావ్ రూపొందించిన పర్పుల్ కలర్ బ్రైడల్ లెహెంగాలో అదరగొట్టింది ఇల్లీ బేబీ. లెహెంగాపై సిల్వర్ ఎంబ్రాయిడరీ వావ్ అనిపించేలా ఉంది. లెహెంగాకు సరిగ్గా నప్పేట్లుగా క్లీవేజ్ నెక్లైన్ క్రాప్‌టాప్ విత్ సింగిల్ షోల్డర్ కేప్ స్టైల్ తన అవుట్‌ఫిట్‌కు అదనపు హంగులద్దిందని చెప్పుకోవచ్చు. ఆభరణాలేవీ లేకపోయినా బ్రైడల్ లెహెంగాలో అదుర్స్ అనిపించే లుక్‌ని సొంతం చేసుకుందీ అందాల తార.
* ఇలియానాతో పాటు డిజైనర్ మృణాళినీ రావ్ బ్రైడల్ కలెక్షన్‌కి అతియా శెట్టి కూడా షో-స్టాపర్‌గా వ్యవహరించింది. పీచ్ కలర్ మెర్మైడ్ కట్ లెహెంగాపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ సూపర్బ్ అని చెప్పచ్చు. దానికి జతగా పూర్తి అపోజిట్ రెడ్ కలర్ కీ-హోల్ నెక్ లైన్ క్రాప్‌టాప్, ఫ్లోరల్ ప్రింట్ దుపట్టాని జోడించింది. లూజ్ హెయిర్, వెట్ మేకప్ తన లుక్‌కి మరింత వన్నెలద్దాయి.
* క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడిన తహీరా ఈ ఫ్యాషన్ షోలో సిల్వర్ స్టార్లా మెరిసింది. పూజా ష్రాఫ్ డిజైన్ చేసిన సిల్వర్-గోల్డెన్ స్ట్రైప్ లెహెంగా విత్ కేప్ స్టైల్ క్రాప్టాప్లో అదరగొట్టింది. షార్ట్ హెయిర్, లాంగ్ ఇయర్ రింగ్స్ తన లుక్‌కి సరిగ్గా నప్పాయని చెప్పచ్చు. ఇక ర్యాంప్ పై చిరునవ్వులు చిందిస్తూ, హొయలు పోయిన తహీరా తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
* డిజైనర్ రాజ్‌దీప్ రూపొందించిన అటైర్లో మోడ్రన్ బ్రైడల్ లుక్‌లో ర్యాంప్‌ని షేక్ చేసింది అమైరా దస్తూర్. రెడ్ కలర్ డిజైన్ లెహెంగాకు.. అదే కలర్ బ్రాలెట్టిని జోడించింది. అన్నిటికంటే తను జత చేసిన మ్యాచింగ్ షార్ట్ జాకెట్ అద్భుతంగా ఉందని చెప్పక తప్పదు. తలపై ఫెదరీ డిజైన్‌లో తయారుచేసిన యాక్సెసరీని కిరీటంలా ధరించి అందాల యువరాణే ర్యాంప్ వాక్ చేసిందా? అనిపించేలా ముస్తాబైంది బ్యూటీ.
* తన సెక్సీ లుక్‌తో లాక్మే స్టేజ్‌ని హీటెక్కిచ్చింది మాళవికా మోహన్. డిజైనర్ తానియా కనుజా రూపొందించిన అటైర్లో అందరి చూపు తనపై నిలిచేలా చేసుకుందీ మలయాళ కుట్టి. మల్టీ కలర్ షిమ్మరీ ప్లంజింగ్ నెక్లైన్తో కూడిన థై-హై స్లిట్ గౌన్‌ను ధరించింది. వెట్ హెయిర్, స్టన్నింగ్ మేకప్‌తో సెక్సీ బేబ్లా దర్శనమిచ్చిందీ సుందరి.
ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా తన అద్భుతమైన లుక్‌తో లాక్మే ఫ్యాషన్ వీక్కి ముగింపు పలికింది కరీనా. ప్రముఖ ఫ్యాషనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన న్యూడ్ కలర్ ఆఫ్ షోల్డర్ డ్రేప్డ్ గౌన్ని ధరించి ప్రెస్‌మీట్‌కి హాజరైందీ ముద్దుగుమ్మ. అనంతరం డార్క్ గ్రీన్ కలర్ స్ట్రాప్‌లెస్ శాటిన్ డ్రేప్డ్ గౌన్‌లో ముస్తాబైన బెబో.. దానికి అదే కలర్ మెటాలిక్ ట్రెయిన్ని జత చేసింది. అలా ఆమె వయ్యారంగా ర్యాంప్‌పై నడుస్తుంటే ‘వాట్ ఎ బ్యూటీ’ అనుకోని వారుండరనడంలో అతిశయోక్తి లేదు.
చూశారుగా.. అందాల భామల లాక్మే సొగసులు. వీరితో పాటు.. కునాల్ ఖేము, అపర్శక్తి ఖురానా, అదా శర్మ, ప్రగ్యా జైస్వాల్, అనన్యా పాండే.. తదితరులు లాక్మే ఫ్యాషన్ షో- 2020 లో సందడి చేశారు.