ఎక్కువశాతం ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా ఒకటి. కూరగాయలు, పండ్లు, కిరాణా, బట్టలు, పుస్తకాలు.. ఇలా ఒకటేమిటి మనతో పాటు ఏ వస్తువు తీసుకెళ్లాలన్నా ప్టాస్టిక్ బ్యాగ్ కావాల్సిందే..! అయితే కొందరు తమ పనుల కోసం ఒకే ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఎక్కువసార్లు వాడితే.. కొంతమంది మాత్రం ఒక బ్యాగును కేవలం ఒక్కసారే వాడి పక్కన పడేస్తుంటారు. వీటి వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండంటూ తనదైన స్టైల్లో ప్రచారం చేస్తోంది ఫ్యాషనర్ మసాబా గుప్తా.
ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తోన్న సమస్యల్లో ‘మితిమీరిన ప్లాస్టిక్ వాడకం’ కూడా ఒకటి. మనిషి జీవన విధానంలో ప్లాస్టిక్ అతి ముఖ్యమైన అంశంగా మారింది. భోజనం చేసే కంచం, మంచినీళ్లు తాగే బాటిల్, కూర్చునే కుర్చీ, పూలకుండీ, టూత్ బ్రష్, షాంపూ బాటిల్స్.. ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమయ్యే దాదాపు అన్ని వస్తువుల్లో ప్లాస్టిక్ ఉంది. వీటిలో చాలావరకు వస్తువులు రీ-సైకిల్ చేయడానికి ఉపయోగపడితే.. కొన్నింటిని రీ-సైకిల్ చేయడం వీలు కాదు. వీటి వల్ల వాతావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాదు, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసి ఎన్నో సముద్ర జీవులు చనిపోవడానికి కారణమవుతున్నాయి. పైగా మితిమీరిన ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషికి అనేక రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్), ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాతో కలిసి ఓ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ని నిర్మూలించేందుకు మసాబా తనకెంతో ప్రావీణ్యమున్న ఫ్యాషన్ రంగాన్నే ఎంపిక చేసుకోవడం విశేషం. మరి ఈ విభిన్న ప్రచారం గురించి మనమూ తెలుసుకుందాం రండి..!

నేను ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తాను..!
UNEP, మసాబా సంయుక్తంగా #Iwillwearoutplastic (నేను ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తాను) అనే ఆన్లైన్ ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలే ముంబైలో ప్రారంభించారు. నిజానికి #Iwillwearoutplastic అంటే మసాబా డిజైన్ చేసిన కొత్త ఫ్యాషన్ దుస్తుల కలెక్షన్ పేరు. ఈ దుస్తుల ప్రత్యేకతేంటంటే.. ఓ రీ-యూజబుల్ క్లాత్ బ్యాగు డ్రస్‌కు జత చేసి ఉంటుంది. పైగా అది బయటకు కనిపించకుండా ఫ్యాషనబుల్‌గా డిజైన్ చేశారు మసాబా. అవసరమైనప్పుడు ఈ బ్యాగును డ్రస్ నుంచి వేరు చేసి వాడుకోవచ్చు. ఈ ఫ్యాషనబుల్ దుస్తులు ప్రస్తుతం బయట అన్ని ఫ్యాషన్ స్టోర్లతో పాటు, ఆన్లైన్ (www.houseofmasaba.com) లో అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త ఫ్యాషన్ డిజైన్ గురించి మసాబా స్పందిస్తూ ‘ప్రస్తుతం పర్యావరణం ఎలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. దీనిని నాశనం చేయకుండా భవిష్యత్ తరాల వారికి అందించాలనేదే మనందరి ప్రయత్నం. ఈ క్రమంలో ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ‘ది హౌస్ ఆఫ్ మసాబా’ (తన కంపెనీ పేరు) చేస్తోన్న చిన్న ప్రయత్నమిది. మనిషి జీవన విధానం నుంచి ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిర్మూలించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశం..! ఇకపై మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. ఎక్కడ మీకు ప్లాస్టిక్ బ్యాగు అవసరమని అనిపించినా వెంటనే మీ డ్రస్‌కు జత చేసి ఉన్న క్లాత్ బ్యాగుని తీసి వాడండి. ప్లాస్టిక్ నిర్మూలనకు ఇదే ఫ్యాషనబుల్ పరిష్కారం..’ అంటూ తన కార్యక్రమ ముఖ్యోద్దేశం గురించి చెప్పుకొచ్చిందీ ప్రముఖ ఫ్యాషనర్.

ఫ్యాషన్స్‌లో దాగిన బ్యాగులు!
ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా #Iwillwearoutplastic ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మసాబా డిజైన్ చేసిన దుస్తులను తను ధరించింది. దియా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ‘మసాబా డిజైన్ చేసిన ఈ కొత్త కలెక్షన్లో డ్రస్‌కే బ్యాగు జత చేసి ఉంది. ప్లాస్టిక్ బ్యాగులను నిర్మూలించేందుకు ఇదొక ఫ్యాషనబుల్ మార్గం. ఇలాంటి వినూత్న మార్గాలతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిద్దాం..!’ అని రాసుకొచ్చింది.
#Iwillwearoutplastic కలెక్షన్లో భాగంగా మసాబా డిజైన్ చేసిన కొన్ని ఫ్యాషనబుల్ దుస్తులు ఇలా ఉన్నాయి.
బ్లేజర్
బ్లేజర్ సెట్ డిజైన్‌లో భాగంలో ప్యాంట్ కింది భాగానికి బటన్ల సహాయంతో రెండు బ్యాగులు జత చేసి ఉంటాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీకు అవసరమైనప్పుడు ఆ బటన్లు తీసి బ్యాగులను వాడుకోవచ్చు.
జిరాఫీ పాప్ ర్యాప్ డ్రస్
ఈ మోడల్ డ్రస్‌లో వరుసగా ఉండే బటన్స్ సహాయంతో బ్యాగ్ బెల్ట్‌కి జత చేసి ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్లుగా మీకు అవసరమైనప్పుడు ఆ బటన్లు తీసి బ్యాగ్‌ను వాడుకోవచ్చు.
జిరాఫీ పాప్ ట్యూనిక్ సెట్
ఈ తరహా డ్రస్‌లో రెండు బ్యాగులు స్లీవ్స్లాగా డ్రస్‌కు ముడేసి ఉంటాయి. ఆ ముడి విప్పినప్పుడు స్లీవ్స్ కాస్తా క్యారీ బ్యాగులుగా మారతాయి.
వన్ షోల్డర్
ఈ తరహా మోడల్లో స్లీవ్ ఉన్న చేతికి చివర్లో జిప్ సహాయంతో బ్యాగ్ జత చేసి ఉంటుంది. ఆ జిప్ తీసేస్తే డ్రస్ నుంచి బ్యాగ్ వేరవుతుంది.
షార్ట్ డ్రస్
షార్ట్ డ్రస్‌లో భాగంగా క్యారీ బ్యాగ్‌ను కాలర్ వెనుక వైపు బటన్ల సహాయంతో జత చేస్తారు. బ్యాగ్ కావాలనుకున్నప్పుడు బటన్స్ తీసేస్తే సరి.. మిగతా డిజైన్లతో పోలిస్తే ఈ డిజైన్ దుస్తుల్లో బ్యాగ్ కాస్త పొడవుగా, పెద్ద పరిమాణంలో ఉంటుంది.
హై-లో డ్రస్
ముందువైపు షార్ట్‌గా, వెనకవైపు పొడవుగా.. చూడ్డానికి అసిమెట్రికల్గా ఉంటుందీ డ్రస్. ఇందులో భాగంగా బ్యాగు డ్రస్ వెనుక వైపు బ్యాగ్ జత చేసి ఉంటుంది. అంటే వెనక వైపు పొడవుగా ఉన్నదంతా బ్యాగేనన్న మాట! జిప్ సహాయంతో అటాచ్ చేసిన ఈ బ్యాగ్‌ను వాడుకోవాలనుకున్నప్పుడు జిప్ తొలగిస్తే సరిపోతుంది.
టాప్ స్కర్ట్ సెట్
టెంపుల్ స్వాన్ ప్రింట్‌తో కూడిన ఈ టాప్ స్కర్ట్ సెట్‌కి.. స్కర్ట్‌కు ముందువైపు ఐమూలగా క్యారీ బ్యాగ్ జత చేసి ఉంటుంది. బ్యాగ్ హ్యాండిల్స్‌ని నడుం దగ్గర చెక్కినట్లుగా ఉంటుంది. కావాల్సినప్పుడు హ్యాండిల్స్‌ని లాగితే బ్యాగ్ రడీ!
మరికొన్ని డిజైన్లు..!
పై వీడియోల్లో చూపించినట్లుగా బటన్లు/జిప్/ముడులు తీసేస్తే డ్రస్ నుంచి బ్యాగులు వేరవుతాయి. అవసరమైనప్పుడు వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు.. లేదంటే డ్రస్‌తోనే ఉంటూ అటు మిమ్మల్ని ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేస్తాయి.. ఇలా రెండు రకాలుగా అదరగొడుతున్నాయీ ప్లాస్టిక్ ఫ్రీ ఫ్యాషన్స్! ఇలా ప్లాస్టిక్‌ను నిర్మూలించే దిశగా ఫ్యాషనర్ మసాబా డిజైన్ చేసిన ఈ విభిన్న దుస్తులు ప్రస్తుతం బయట అన్ని ఫ్యాషన్ స్టోర్లతో పాటు ఆన్లైన్ (www.houseofmasaba.com) లోనూ లభ్యమవుతున్నాయి. సో.. ప్లాస్టిక్‌ను నిర్మూలించే దిశగా మీరూ కృషి చేయాలనుకుంటే.. వెంటనే ఈ బ్యాగ్ కమ్ డ్రస్ ఫ్యాషన్స్‌ని మీ వార్డ్‌రోబ్‌లో చేర్చేసుకోండి.. అటు ఫ్యాషనబుల్‌గా, ఇటు ఎన్విరాన్మెంట్-ఫ్రెండ్లీగా మారిపోండి.. ఏమంటారు?!
Image Courtesy: instagram.com/masabagupta