ఏ వయసు వారికైనా సరే.. చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం జిడ్డుగా, నిర్జీవంగా, పొడిబారిపోవడం ఖాయం. ఫలితంగా మొటిమలు, అలర్జీ.. వంటి సమస్యలు తప్పవు. మరి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్ చక్కటి మార్గమంటున్నారు సౌందర్య నిపుణులు. వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే పంచదార చాలు.. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.. మచ్చలను మాయం చేస్తుంది.. తేమను, మెరుపును అందిస్తుంది. ఈ క్రమంలో పంచదార, ఇతర పదార్ధాలతో ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం రండి..
నిమ్మరసంతో మచ్చలు మాయం..

కావాల్సినవి
* పంచదార - 1 టేబుల్‌స్పూన్
* నిమ్మరసం - అర టేబుల్‌స్పూన్
* తేనె - 1 టేబుల్‌స్పూన్
స్క్రబ్ ఇలా..!
ఓ గిన్నెలో పంచదార, నిమ్మరసం, తేనెలను మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా రాసుకోవాలి. ఓ 15-20 నిమిషాలపాటు ఆరనిచ్చి.. చేతిని కాస్త తడి చేసుకుని మృదువుగా చర్మంపై రుద్దుకోవాలి. ఇలా ఓ 3 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకున్నాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పంచదార మృతకణాలను తొలగిస్తుంది. నిమ్మరసం మచ్చలకు, అలర్జీలకు చెక్ పెడుతుంది. ఇక తేనె సహజతేమను అందిస్తుంది.
గ్రీన్‌టీతో మొటిమలకు చెక్..

కావాల్సినవి
* గ్రీన్‌టీ పొడి - 1 టీస్పూన్
* పంచదార - 1 టీస్పూన్
* ఆలివ్ నూనె - 1 టీస్పూన్
స్క్రబ్ ఇలా..!
ఓ చిన్న గిన్నెలో పైన తెలిపిన పదార్థాలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని ఓ 10 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు ఓ రెండు నిమిషాల పాటు చేతివేళ్లతో మృదువుగా రుద్దుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. అలాగే గ్రీన్‌టీ మొటిమలకు చెక్ పెడుతుంది. ఇక ఆలివ్ నూనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
పంచదార – ఓట్స్‌తో..

కావాల్సినవి
* ఓట్స్ పొడి - 1 టేబుల్‌స్పూన్
* పంచదార - 1 టీస్పూన్
* ఆలివ్ నూనె/తేనె - 1 టీస్పూన్
స్క్రబ్ ఇలా..!
ఓట్స్ పొడి, పంచదార, ఆలివ్ నూనె లేదా తేనెలను ఓ గిన్నెలో మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖమంతా రాసుకుని చేతివేళ్లతో మృదువుగా రుద్దుకోవాలి. అలా ఓ రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత ఓ 5 నిమిషాలపాటు ఆరనిచ్చి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరి. ఓట్స్ స్క్రబ్‌లా పనిచేయడంతో పాటు చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది.. అలాగే అలర్జీలకు చెక్ పెడుతుంది. ఇక తేనె, ఆలివ్ నూనె చర్మానికి తేమనందిస్తాయి.
పసుపుతో..

కావాల్సినవి
* పసుపు - టీస్పూన్
* పంచదార - అర టీస్పూన్
* కొబ్బరినూనె - అర టీస్పూన్
స్క్రబ్ ఇలా..!
పైన తెలిపిన పదార్థాలను ఓ గిన్నెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా స్క్రబ్ చేసుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఆపై చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. అలర్జీ, మొటిమలు, గుల్లలు, మచ్చలు, నల్లటి వలయాలు.. వంటి వాటి నుండి విముక్తి కలిగిస్తుంది. కొబ్బరినూనె చర్మంలోకి బాగా ఇంకి తేమనందిస్తుంది. అలాగే పంచదార మృతకణాలను తొలగిస్తుంది.
టొమాటోతో నవయవ్వనంగా..

కావాల్సినవి
* సగానికి కట్ చేసిన టొమాటో - 1
* పంచదార - టీస్పూన్
స్క్రబ్ ఇలా..!
సగానికి కట్ చేసిన టొమాటో ముక్కను పంచదారలో అద్ది..ముఖంపై రుద్దుకోవాలి. ఇలా కొన్ని నిమిషాలపాటు రుద్దుకున్న తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చివరగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరి. టొమాటో చర్మానికి టోనర్‌లా పనిచేసి అధిక జిడ్డుని తొలగిస్తుంది.
పెరుగుతో ముడతలకు గుడ్‌బై..

కావాల్సినవి
* పెరుగు - 1 టేబుల్‌స్పూన్
* పంచదార - 1 టీస్పూన్
స్క్రబ్ ఇలా..!
ఓ గిన్నెలో పెరుగు, పంచదార వేసి స్క్రబ్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఓ 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చేతులను తడి చేసుకొని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా ఓ 2 నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. ఆపై ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు.. వయసు పైబడిన ఛాయలను తగ్గించడంతో పాటు.. చర్మానికి తేమను అందిస్తుంది. ఇక పంచదార పేరుకుపోయిన మురికిని వదిలిస్తుంది.
నూనె లేదా తేనెతో..

కావాల్సినవి
* పంచదార - 1 టీస్పూన్
* తేనె లేదా నూనె (కొబ్బరి నూనె/బాదం నూనె/ఆలివ్ నూనె) - 1 టేబుల్‌స్పూన్
తయారీ
పంచదారకు తేనె లేదా నూనెను కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మసాజ్ కూడా అందుతుంది. ఇలా ఓ 5 నిమిషాలపాటు రుద్దిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. నూనె లేదా తేనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అలాగే పంచదార మృతకణాలను తొలగించి మేనికి మెరుపును అందిస్తుంది.
చూశారుగా.. ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈజీగా స్క్రబ్ ఎలా తయారుచేసుకోవచ్చో! మరి, మీరూ వీటిని ట్రై చేసి కుందనపు బొమ్మలా మెరిసిపోండి..!