అందం కోసం వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం మనలో చాలామందికి అలవాటే..! అయితే వీటిలో కొన్ని ఉత్పత్తులు చర్మాన్ని తాత్కాలికంగా అందంగా కనిపించేలా చేస్తే.. మరికొన్ని మాత్రం మన అందాన్ని పెంపొందించుకునేేందుకు సాయపడేవిగా ఉంటాయి. కానీ క్యాలమైన్ లోషన్ రెండు రకాలుగానూ పనిచేస్తూ చర్మ వర్ఛస్సును మరింత పెంచుకునేందుకు తోడ్పడుతుంది. క్రీస్తుపూర్వం నుంచి ఇప్పటివరకూ దీన్ని మహిళలు తమ సౌందర్య పరిరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారంటే దీని విలువేంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్యాలమైన్ లోషన్‌ని మన బ్యూటీకిట్లో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఇంతకీ ఈ క్యాలమైన్ లోషన్ మన సౌందర్య పరిరక్షణకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి..
మొటిమలకు చెక్
క్యాలమైన్ లోషన్లో జింక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ వంటి చర్మానికి హాని కలిగించని రసాయనాలు మాత్రమే ఉంటాయి. ఇవి ముఖ చర్మానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించవు సరికదా చర్మానికి హాని కలిగించి మొటిమలు వచ్చేలా చేసే బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి. అందుకే మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు ఈ లోషన్‌ని తరచూ ఉపయోగించడం వల్ల సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే దీన్ని రోజూ ఉపయోగిస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.

మృతకణాలు మాయం
మన చర్మంపై ప్రతి నిమిషం కొన్ని వేల సంఖ్యలో కణాలు మరణిస్తుంటాయి. అలాగే వాటి స్థానంలో కొత్త కణాలు కూడా పుడుతూ ఉంటాయి. అయితే ఈ చనిపోయిన కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే అవి చర్మంపై అలాగే ఉండిపోయి స్వేదగ్రంథులు మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్.. వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజూ క్యాలమైన్ లోషన్ రాసుకోవడం ద్వారా ఈ మృత కణాల సమస్య కూడా తగ్గుతుందట..! ఈ లోషన్ చర్మానికి అంటుకుపోయి తిరిగి మనం ముఖం కడుక్కున్నప్పుడు మృతకణాలతో సహా తొలగిపోతుంది. కాబట్టి క్యాలమైన్ లోషన్‌తో ఎన్నో చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టచ్చు.
ఆయిలీ స్కిన్‌కి దూరం..
మృదువైన, అందమైన చర్మం కావాలని కోరుకోనివారు ఎవరూ ఉండరేమో..! కానీ ప్రస్తుతం దుమ్ము, కాలుష్యం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోవడం, జిడ్డుచర్మం.. వంటి సమస్యలు సహజమైపోయాయి. ఈ క్రమంలో క్యాలమైన్ లోషన్‌ని రోజూ రాసుకోవడం ద్వారా జిడ్డు చర్మం సమస్య తగ్గించుకోవచ్చు. చర్మగ్రంథుల్లో ఎక్కువగా ఉన్న నూనెను తొలగించి, చర్మాన్ని జిడ్డుగా కనిపించకుండా చేయడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది తద్వారా మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని మన సొంతం చేసుకోవచ్చు.

మేకప్ బేస్‌గానూ..
మేకప్... ప్రస్తుతం ఇది చాలామంది మహిళల జీవితాల్లో భాగమైపోయింది..! అయితే ఈ మేకప్ లుక్ మొత్తం ఫౌండేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఫౌండేషన్ సరిగ్గా ఉంటేనే మేకప్ లుక్ సరిగా ఉంటుంది. అందుకే సరైన మేకప్ లుక్ అందించే ఫౌండేషన్‌గా ఈ క్యాలమైన్ లోషన్‌ని ఉపయోగించి చూడండి.. సులభంగా పర్ఫెక్ట్ మేకప్ లుక్ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. మేకప్‌లోని పదార్థాల వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగకుండా సంరక్షణ కూడా పొందవచ్చు.
చూశారుగా.. క్యాలమైన్ లోషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో.. మరి, మీరూ ఈ లోషన్‌ని మీ రోజువారీ సౌందర్య ఉత్పత్తుల్లో భాగం చేసుకోండి.