పచ్చపచ్చని ప్రకృతి సౌందర్యానికే కాదు.. దాన్ని తలదన్నే అందాల రాశులున్న అద్భుతమైన నగరాల్లో బ్రెజిల్ ఒకటి. లేలేత చర్మం, వెండి వెన్నెలను తలపించే ముఖం, జాలువారే కురులు, సోగకళ్లు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు అక్కడి ముద్దుగుమ్మలు. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సూపర్ మోడల్స్ ఉన్న దేశంగా బ్రెజిల్‌ను పేర్కొంటారు. అడ్రియానా లిమా, అలెసాండ్రా ఆంబ్రోసియో, గిసెల్లే బుండ్చెన్.. తదితరులు ఆ కోవకు చెందిన వారే. మరి, వారు ఇంత అందంగా ఉండడానికి రోజూ ఎక్కువ సమయాన్ని పార్లర్‌కి కేటాయించడం, బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి సౌందర్య చికిత్సలు చేయించుకోవడమేనేమో.. అనుకుంటే పొరపడినట్లే!! ఎందుకంటారా.. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో పదార్థాలనే తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగిస్తుంటారు బ్రెజిలియన్ మహిళలు. అందుకే వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందంతో అందరినీ కట్టిపడేస్తున్నారు. మరి, బ్రెజిలియన్ భామల సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందామా.. అయితే రండి..

ఇసుకలో దాగున్న అందం!
మనం బీచ్‌కి వెళ్లినప్పుడు ఇసుకతో వివిధ రకాల ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తాం.. కానీ అదే ఇసుక (బీచ్ శాండ్) సౌందర్య పరిరక్షణకూ ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా? మరో విషయం ఏంటంటే.. బ్రెజిలియన్ భామల సౌందర్య రహస్యాల్లో ఇది ముఖ్యమైంది. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.. బ్రెజిల్ మహిళలు బీచ్ నుంచి ఇసుకను తెచ్చుకొని దాన్ని వారు బాడీ స్క్రబ్‌గా ఉపయోగిస్తారు. తద్వారా శరీరంపై పేరుకుపోయిన మట్టి, ఇతర మలినాలు.. వంటివన్నీ సులభంగా తొలగిపోతాయని వారి నమ్మకం. అలాగే ఈ ఇసుకతో స్క్రబ్ చేసుకోవడం వల్ల చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు.. చర్మం కింద పేరుకున్న కొవ్వు కణజాలం విచ్ఛిత్తి అయి నాజూగ్గా మారతారు కూడా!

ఆ నూనెతో జిడ్డు దూరం!
జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి జిడ్డు నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం కనిపించదు. అయితే అందుకు పర్మినెంట్ రెమెడీని తాము ఫాలో అవడమే కాదు.. మనకూ అందిస్తున్నారు బ్రెజిలియన్లు. తమ చర్మంపై ఏర్పడిన జిడ్డును పోగొట్టుకొని ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందడానికి బ్రెజిల్ మహిళలు పాటించే బ్యూటీ సీక్రెట్ బబాసు నూనె. 'కుసి ఆయిల్'గా పిలిచే ఈ లేత పసుపు రంగు నూనెను బబాసు మొక్క నుంచి సేకరిస్తారు. కొబ్బరి నూనెలో ఉన్న సుగుణాలన్నీ ఈ నూనెలో ఉండడం విశేషం. అందుకే దీన్ని వారు రోజువారీ ఫేస్‌మాస్కులు, స్క్రబ్‌లు.. వంటి సౌందర్య చికిత్సల్లో భాగం చేసుకుంటారు. తద్వారా చర్మంపై పేరుకున్న జిడ్డు సమస్య వదిలిపోవడంతో పాటు చర్మానికి చక్కటి పోషణనందిస్తుందీ నూనె. అలాగే ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మెరిపిస్తుంది.

మసాజ్‌తో మంత్రమేస్తారు!
బ్రెజిలియన్ల బ్యూటీ సీక్రెట్స్లో మసాజ్దీ కీలకపాత్రే. 'లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్'గా పిలిచే ఈ ప్రత్యేకమైన మర్దన వల్ల శరీరంలో ఉండే అధిక నీటి నిల్వ క్రమంగా తగ్గుతుంది. తద్వారా నాజూగ్గా మారే అవకాశముంది. అలాగే దీనివల్ల ముఖం, చర్మంపై ఉండే లింఫ్ గ్రంథులపై మర్దన జరిగి ఆయా భాగాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. అయితే ఈ మసాజ్ మొదటగా 20 శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ప్రాచుర్యం పొంది.. ప్రస్తుతం బ్రెజిలియన్ల బ్యూటీ సీక్రెట్స్‌తో ముఖ్య భూమిక పోషిస్తోంది.

చర్మ సౌందర్యానికి క్యారట్ జ్యూస్!
ఓ రెండు గంటలు బయట ఎండలో తిరిగి చూడండి.. సూర్యరశ్మి పడిన చర్మమంతా నల్లగా కమిలిపోయినట్లుగా కనిపించడం మీరు గమనిస్తారు. దాన్నే ట్యాన్ అంటాం. కానీ బ్రెజిల్ భామలు మాత్రం తమ చర్మాన్ని ట్యాన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదెలా అంటారా..? క్యారట్ జ్యూస్‌తో. విటమిన్ 'ఎ', 'సి', బీటా-కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ రసాన్ని వారు రోజూ క్రమం తప్పకుండా తాగుతారు. విటమిన్ 'ఎ' చర్మ కణాల్ని ఆరోగ్యంగా ఉంచితే, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇక విటమిన్ 'సి' వల్ల చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి సాగే గుణాన్ని అందించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

కొబ్బరి నీళ్లు తాగాల్సిందే..!
బ్రెజిలియన్లు తమ అందం వెనుక కొబ్బరి నీళ్ల పాత్ర కూడా చాలానే ఉందంటున్నారు. ఈ విషయం బ్రెజిల్ సూపర్ మోడల్ అడ్రియానా లిమానే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. 'నా అందానికి కొబ్బరి నీళ్లు కూడా ఓ కారణమే.. నేను రోజుకు కనీసం ఒక బోండం అయినా తాగుతా.. దీనివల్ల నా చర్మానికి పోషణ అందడమే కాదు.. రిఫ్రెష్మెంట్ డ్రింక్‌గా కూడా ఇది నాకు ఉపయోగపడుతుంది..' అంటూ చెప్పుకొచ్చిందీ భామ. కొబ్బరి నీళ్లలో ఉండే సైటోకైనిన్ అనే సమ్మేళనం వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది. అంతేకాదు.. ఈ నీళ్లలోని మెగ్నీషియం, జింక్, ఐరన్, బి-విటమిన్లు.. వంటి పోషకాలన్నీ చర్మ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి.

దంతాలు మెరుస్తాయిలా!
అందమంటే.. కేవలం చర్మం, జుట్టు, ముఖమే కాదు.. దంత సిరి కూడా అందులో భాగమే. అందుకే బ్రెజిలియన్ మహిళలు దంతాల్ని తళతళా మెరిపించుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం కొబ్బరి, ఆలివ్ లేదా నువ్వుల నూనె.. ఈ రెండు నూనెల్ని టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకొని దాంతో ఐదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ (నూనెని నోట్లోకి తీసుకొని పుక్కిలించడం) చేయాలి. అది కూడా పరగడుపునే! ఇలా చేయడం వల్ల దంతాలకు సహజ మెరుపు అందడంతో పాటు దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు.. దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించే మాస్కులు, ప్యాక్‌లలో.. వంటల్లో సైతం భాగం చేసుకుంటారు బ్రెజిలియన్లు.

పట్టులాంటి జుట్టుకు అవకాడో!
ప్రపంచంలో 13 రకాల హెయిర్ టైప్స్ కేవలం బ్రెజిల్ మహిళలకే సొంతం అన్న విషయం మీకు తెలుసా? పలు పరిశోధనల్లో వెల్లడైన నిజం ఇది. అందుకే వారు జుట్టు సంపూర్ణ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. బ్రెజిల్ మహిళల ఒత్త్తెన, పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టులో దాగున్న రహస్యమేంటో తెలుసా? అవకాడో! అవకాడోను మెత్తగా చేసుకొని ఆ పేస్ట్‌ను కుదుళ్లకు, జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం వారి దినచర్యలో ఓ భాగం. తద్వారా అవకాడో తేమను కోల్పోయి నిర్జీవమైన జుట్టుకు పోషణనందిస్తుంది. అంతేకాదు.. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మారుతుంది.

అందుకే జుట్టును కాలుస్తారు!
జుట్టు చివర్లు చిట్లడం, డ్యామేజ్ అవడం సర్వసాధారణం. అయితే ఇందుకు మనం ఏం చేస్తాం? జుట్టు చివర్లు కత్తిరించుకోవడం.. వంటి చిట్కాలు పాటిస్తాం. కానీ ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బ్రెజిల్ మహిళలు ఏంచేస్తారో తెలుసా? జుట్టు చివర్లను కాలుస్తారు. 'వెలతెరపియా' లేదా 'క్యాండిల్ బర్నింగ్'గా పిలిచే ఈ బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా.. క్యాండిల్ని వెలిగించి.. ఆ మంటతో చిట్లిన చివర్లను, డ్యామేజ్ అయిన జుట్టును కాలుస్తారు. తద్వారా వంద శాతం సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు అక్కడి సౌందర్య నిపుణులు. అయితే మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో చేయద్దు. కావాలంటే బ్యూటీ సెలూన్లకు వెళ్లి అక్కడి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మరికొన్ని రహస్యాలివే!

* ముఖంపై ఉండే మృతకణాల్ని తొలగించి చర్మాన్ని మెరిపించడానికి బ్రెజిలియన్ మహిళలు ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తారు. బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనె, కొన్ని చుక్కల నీళ్లు.. ఈ మూడింటితో స్క్రబ్ తయారుచేసుకొని దాంతో చర్మానికి స్క్రబ్ చేసుకుంటారు. తద్వారా చక్కటి ఫలితాలు లభిస్తాయి. అందుకు వారి లేలేత చర్మమే నిదర్శనం. * పరగడుపునే గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగడంతోనే బ్రెజిలియన్ల రోజు మొదలవుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడడం, జీర్ణ వ్యవస్థ పటిష్టమవడంతో పాటు చర్మ ఆరోగ్యానికి ఈ చిట్కా మేలు చేస్తుంది.
 * పండ్లు, కూరగాయలతో రసాలు చేసుకొని తాగుతారు బ్రెజిలియన్లు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తాయనేది వారి నమ్మకం. అంతేకాదు.. వీటితో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగించడం వీరికి అలవాటు. * రోజూ ఓ గ్లాసు బీట్రూట్ రసాన్ని సేవించడం బ్రెజిల్ అతివలకు అలవాటు. తద్వారా చర్మానికి సరైన రీతిలో రక్తప్రసరణ జరిగి చర్మ కణాలు ఆరోగ్యంగా మారతాయి. * చర్మంపై వృద్ధాప్య ఛాయలు, ముడతలు, గీతలు.. వంటివి రాకుండా బ్రెజిలియన్లు రోజూ బెర్రీస్‌ని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ముఖ్యంగా అకాయ్ బెర్రీ, గోజీ బెర్రీ.. వంటి పండ్లను తింటారు. వీటిలో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు పైన పేర్కొన్న చర్మ సమస్యలన్నీ దరిచేరకుండా కాపాడతాయి. * ఇక సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోనిదే బయటకు అడుగుపెట్టరు బ్రెజిలియన్ మహిళలు. వారి చర్మ సౌందర్యంలో ఇదీ ఓ భాగమే.
|
బ్రెజిలియన్ భామల అందం వెనకున్న రహస్యాలేంటో తెలుసుకున్నారుగా! ఇంట్లో సహజంగా లభించే పదార్థాలతోనే ఎంతో సులభంగా ఉన్న వీరి బ్యూటీ సీక్రెట్స్‌ని మీరూ ఫాలో అయిపోండి.. నిత్యయవ్వనంతో మెరిసిపోండి..!