ఇంకా ఎన్నెన్ని ఉపయోగాలో..!

* మొటిమలే కాదు.. వాటి చుట్టూ వచ్చిన వాపు, ఎరుపుదనం, మచ్చలు.. వంటి వాటిని తొలగించడంలోనూ టూత్‌పేస్ట్ సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం పావు టీస్పూన్ చొప్పున టూత్‌పేస్ట్, కలబంద గుజ్జుకు చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే సత్వర ఉపశమనం కలుగుతుంది. * దుస్తుల రంగుకు తగినట్లుగా గోళ్ల రంగు వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఇందుకు తగినట్లుగా గోళ్ల రంగును ఎప్పటికప్పుడు తొలగించుకునే క్రమంలో గోళ్లపై ఆ రంగు పూర్తిగా తొలగిపోకపోగా.. అవి పాలిపోయినట్లుగా మారిపోతాయి. అలాకాకుండా పాత నెయిల్‌పాలిష్ తొలగించినా గోళ్లు తెల్లగా తళతళలాడాలంటే వాటిపై కాస్త టూత్‌పేస్ట్ అప్లై చేసి చూడండి.. చక్కటి ఫలితం కనిపిస్తుంది. * బ్లో డ్రయర్, హెయిర్ స్ట్రెయిట్నర్, ముఖానికి ఆవిరి పట్టడం.. వంటివి చేసే క్రమంలో వాటి వేడికి అప్పుడప్పుడూ చర్మంపై గాయాలయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అలాంటి గాయాలను మాన్పే శక్తి టూత్‌పేస్ట్‌కి ఉందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కాలిన చర్మంపై కాస్త టూత్‌పేస్ట్ రాస్తే సరిపోతుంది.
 * టూత్‌పేస్ట్‌తో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల్ని కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం టూత్‌పేస్ట్, చక్కెర, నిమ్మరసం.. కొద్ది మొత్తాల్లో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకొని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్నాళ్లకు అవాంఛిత రోమాలు తొలగిపోయి ముఖం మృదువుగా మారుతుంది. * జుట్టుకు వేసుకున్న రంగు పొరపాటున చర్మానికి అంటుకుంటే అస్సలు వదలదు. ఇలాంటప్పుడు అక్కడ కాస్త టూత్‌పేస్ట్ రాసి మృదువుగా మర్దన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
 * కొంతమందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటాయి. తద్వారా వయసు పైబడిన ఛాయలు కనిపిస్తుంటాయి. వీటిని దాచేయాలంటే టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడాకు, టీస్పూన్ టూత్‌పేస్ట్ కలిపిన మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేయాలి. ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. * ఎండ తగిలిన చోట చర్మం కందిపోయి నల్లగా మారిపోతుంది. అలాంటప్పుడు టేబుల్‌స్పూన్ టూత్‌పేస్ట్‌కు టీస్పూన్ టొమాటో రసం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని నల్లగా మారిన చర్మంపై రాసి పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాధారణ రంగులోకి మారుతుంది.
 * బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలామంది అమ్మాయిల్ని వేధించే సౌందర్య సమస్యలు. వీటిని తొలగించడానికీ టూత్‌పేస్ట్ సహకరిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం టేబుల్‌స్పూన్ టూత్‌పేస్ట్‌లో టేబుల్‌స్పూన్ ఉప్పు, టీస్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాసి మూడు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై పది నిమిషాలయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే తక్షణ ఫలితం కనిపిస్తుంది.
 * చలికాలంలో ఎంత శ్రద్ధ తీసుకున్నా పెదాలు పొడిబారిపోయి నిర్జీవమైపోతుంటాయి. అలాంటప్పుడు పావు టేబుల్‌స్పూన్ చొప్పున టూత్‌పేస్ట్, బియ్యప్పిండి తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పెదాలపై రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక కడిగేసుకుంటే పెదాలు తేమను సంతరించుకుంటాయి. ఆపై లిప్‌బామ్ లేదా కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది.
|