మేకప్ మనకు తాత్కాలికమైన అందాన్ని అందిస్తే.. మనం నిత్యం చేసే స్నానం మన చర్మాన్ని శుభ్రం చేసి చక్కటి మెరుపునిస్తుంది. ఈ మెరుపుని మరింత పెంపొందించుకోవడానికి ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు బాత్ బ్రష్‌లను ఉపయోగిస్తున్నారు. మృదువైన బ్రిజిల్స్‌తో కూడిన ఈ బ్రష్‌లు చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన జిడ్డును తొలగించడంతో పాటు చర్మానికి మసాజ్‌లాగా ఉపయోగపడతాయి. అయితే ఇలా మనం స్నానం చేసేటప్పుడు ఉపయోగించే బాత్ బ్రష్లలో కొన్ని వీపు రుద్దుకోవడానికి వీలుగా ఉండవు. మరి, చేత్తో నేరుగా రుద్దుకుందామంటే మన వీపు మనకు అందదు. అందుకే ఈ పనిని మరింత సులభతరం చేయడానికి వీలుగా బోలెడన్ని 'బ్యాక్ బ్రష్'లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇవి వీపును శుభ్రం చేయడమే కాదు.. వీటికుండే మృదువైన బ్రిజిల్స్ వల్ల ఆ భాగంలో చక్కటి మసాజ్ కూడా అందుతుంది. మరి, వీపు రుద్దుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరిన బాత్ బ్రష్లేవి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

బ్యాక్ బ్రష్ లూఫా
స్నానం చేసే క్రమంలో మన వీపు మనకు అందదు. అలాగని వీపును శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే అక్కడి చర్మ రంధ్రాల్లో చేరిన మురికి వల్ల మృతకణాలు పెరిగే అవకాశముంటుంది. అందుకే ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రోజూ వీపును శుభ్రం చేసుకోవాల్సిందే! అందుకోసం ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరిన బాత్ బ్రష్లలో 'బ్యాక్ బ్రష్ లూఫా' ఒకటి. ఫొటోలో చూపించినట్లుగా హ్యాండిల్‌కి పైభాగంలో గుబురుగా, పొడవుగా ఉండే లూఫా స్పాంజి ఉంటుంది. ఈ లూఫా స్పాంజిపై కొద్దిగా లిక్విడ్ బాతింగ్ సోప్ పోసి.. దాంతో వీపు ఈజీగా రుద్దుకోవచ్చు. లేదంటే వీపుకి అందినంత మట్టుకు సబ్బు రాసి.. లూఫాతో రుద్దితే అది వీపంతా పరుచుకుంటుంది. అంతేకాదు.. ఈ ఫొటోలో హ్యాండిల్ లేకుండా ఉన్న పొడవాటి మరో లూఫా ఉంది. దానికి రెండు చివర్లకున్న గ్రిప్స్ని వేళ్లతో పట్టుకొని వీపును సులభంగా రద్దుకోవచ్చు. ఇలా వీటిలో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఎంచుకోవచ్చు. ఈ లూఫా స్పాంజి సెట్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 165 నుంచి రూ. 599 వరకు ఉంది.

వుడెన్ బాత్ బ్రష్
చాలామంది పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్లాస్టిక్‌కు బదులుగా చెక్క వస్తువుల్ని ఉపయోగించడం ఇప్పుడు కామనైపోయింది. ఈ క్రమంలో చెక్కతో తయారుచేసిన టూత్‌బ్రష్‌లు వాడే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్టులో 'వుడెన్ బాత్ బ్రష్'లు కూడా చేరిపోయాయి. ఫొటోలో చూపించినట్లుగా చెక్కతో తయారుచేసిన హ్యాండిల్, దానికి పైవైపున గుండ్రటి మృదువైన బ్రిజిల్స్‌తో కూడిన బ్రష్ ఉంటుంది. అంతేకాదు.. అక్కడక్కడా కాస్త మందంగా ఉండే మృదువైన బ్రిజిల్స్ ఉంటాయి. దీనిపై లిక్విడ్ బాత్ సోప్ వేసి లేదంటే సబ్బును వీపుకి అప్త్లె చేసుకొని ఈ వుడెన్ బ్రష్ సహాయంతో వీపును రుద్దుకోవచ్చు. తద్వారా బ్రిజిల్స్ చర్మం రంధ్రాల్లోని మురికిని తొలగిస్తే, అక్కడక్కడా ఉన్న మందపాటి బ్రిజిల్స్ చర్మానికి మసాజ్‌ని అందిస్తాయి. ఇలా వీపు రుద్దుకోవడానికి ఉపయోగించే ఈ వుడెన్ బాత్ బ్రష్‌లు ప్రస్తుతం విభిన్న డిజైన్లలో మార్కెట్లో కొలువుదీరాయి. వీటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 769 నుంచి రూ. 1,085 వరకు ఉంది.

ఎక్స్‌ఫోలియేటింగ్ లూఫా
వీపుపై పేరుకున్న జిడ్డు, మృతకణాల్ని తొలగించడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బాత్ బ్రష్లలో 'ఎక్స్‌ఫోలియేటింగ్ లూఫా' ఒకటి. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం వెయిస్ట్ బెల్టులా ఉండే దీనికి ఒకవైపు మధ్యభాగంలో లూఫా స్పాంజి లేదా అల్లికలాంటి గరుకైన అమరిక ఉంటుంది. దీనిపై లిక్విడ్ బాత్ సోప్ వేసి లేదంటే వీపుకి నేరుగా సబ్బు అప్త్లె చేసుకొని లూఫాకు ఇరువైపులా ఉండే హ్యాండిల్స్ సహాయంతో ఈజీగా రుద్దుకోవచ్చు. ఇలా వీటితో కిందికి, పైకి అనడం వల్ల వీపుపై ఉండే మృతకణాలు ఇట్టే తొలగిపోతాయి. అంతేకాదు.. ఇలా రుద్దుకునే క్రమంలో వీపు చర్మానికి మంచి మసాజ్ అందుతుంది. ఇలా రెండు రకాలుగా చర్మానికి మేలు చేసే ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ లూఫా స్పాంజి నాణ్యత, డిజైన్‌ను బట్టి దీని ధర రూ. 299 నుంచి రూ. 599 వరకు ఉంది.

ఐస్‌క్రీమ్ స్పాంజి లూఫా
మనమే కాదు.. పిల్లలూ స్నానం చేసే క్రమంలో వారి వీపు వారు రుద్దుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. అలాగని మనం ఉపయోగించే పెద్ద పెద్ద బ్యాక్ బ్రష్‌లను వారికి ఇస్తే.. అవి వారికి బరువుగా అనిపిస్తాయి. అలాకాకుండా వారికి తేలిగ్గా ఉండి, వారిని ఆకర్షించేలా ఉండే లూఫా అయితే భలే బాగుంటుంది కదూ!! అలాంటిదే ఈ 'ఐస్‌క్రీమ్ స్పాంజి లూఫా' కూడా! పేరుకు తగినట్లుగానే ఫొటోలో చూపించినట్లుగా అచ్చం ఐస్క్రీమ్లాగే ఉంటుందీ లూఫా. ఐస్‌క్రీమ్ స్టిక్ దానిపై ఐస్‌క్రీమ్ మాదిరిగా కాస్త గట్టిగా ఉండే మృదువైన స్పాంజి ఉంటుంది. దీనిపై లిక్విడ్ బాత్ సోప్ వేసి లేదంటే వీపుకి నేరుగా సబ్బు అప్త్లె చేసుకొని ఈ స్పాంజి సహాయంతో సులభంగా వీపును రుద్దుకోవచ్చు. ఇలా ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ స్పాంజి ఒక్కటే కాదు.. పిల్లల కోసం ప్రస్తుతం చాలా రకాల బాత్ స్పాంజిలు మార్కెట్లో కొలువుదీరాయి. వాటి ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 245 నుంచి రూ. 399 వరకు ఉంది.

లోషన్ అప్లికేటర్
సబ్బుతో వీపు రుద్దుకోవడమే కాదు.. మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవడమూ కష్టమైన పనే. అయితే ఇకపై వీపుకి మాయిశ్చరైజర్ రాసుకోవడానికి అంత శ్రమ పడక్కర్లేదు. ఎందుకంటే 'లోషన్ అప్లికేటర్' ఉందిగా! ఫొటోలో చూపించినట్లుగా అచ్చం బాత్ బ్రష్‌లాగా ఉండే దీనికి ఒక హ్యాండిల్, పై భాగంలో గుండ్రటి హెడ్ ఉంటుంది. దానిపై నిర్ణీత దూరాల్లో తెల్లగా, గుండ్రంగా ఉన్న మృదువైన బాల్స్ ఉంటాయి. ఇవి వీపుకి మాయిశ్చరైజర్ సమానంగా పరచుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు గుండ్రటి హెడ్ వెనక భాగాన్ని తెరిచి అందులో మాయిశ్చరైజర్ వేయాలి. దాన్ని మూసేసి.. వీపుపై రుద్దుకోవడం వల్ల ఆ బాల్స్ గుండ్రంగా తిరుగుతూ మాయిశ్చరైజర్ చక్కగా పరచుకొని, చర్మంలోకి ఇంకిపోయేలా చేస్తాయి. అంతేకాదు.. ఈ బొడిపెలతో వీపు చర్మానికి చక్కటి మసాజ్ కూడా అందుతుంది. ఇలా మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవడమూ ఎంతో సులువవుతుంది. ఇలాంటి లోషన్ అప్లికేటర్లు ప్రస్తుతం బోలెడన్ని డిజైన్లలో, ఆకృతుల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అప్లికేటర్ నాణ్యత, డిజైన్‌ను బట్టి దీని ధర రూ. 688 నుంచి రూ. 1,500 వరకు ఉంది.
గమనిక: ఇలా మీరు వీపు రుద్దుకోవడానికి ఉపయోగించే బ్యాక్ బ్రష్ ఏదైనా సరే.. పని పూర్తయ్యాక వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టడం మంచిది. తద్వారా మన చర్మంలో నుంచి ఆ లూఫాల్లోకి చేరిన బ్యాక్టీరియా నశించిపోతుంది. ఆపై వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇతర చర్మ సమస్యలేవీ తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.