సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే మగువలు.. పెళ్లంటే తమ లావణ్యాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటారు. ఇందుకోసం బ్రైడల్ ఫేషియల్స్ అంటూ పార్లర్ల వెంట పరుగులు పెడుతుంటారు. ఇక ఈ విషయంలో సెలబ్రిటీలు చేయించుకునే బ్యూటీ ట్రీట్మెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నఖశిఖపర్యంతం తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి వివిధ రకాల సౌందర్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయితే తాను మాత్రం తన పెళ్లికి బ్రైడల్ ఫేషియల్ చేయించుకోలేదని అంటోంది బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్. దీనికి బదులు తాను వాడిన ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్ తనకు బ్రైడల్ గ్లోని తీసుకొచ్చిందని చెబుతోంది. అంతేకాదు.. తన అందానికి మెరుగులద్దుకునే విషయంలో సహజసిద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యమిస్తానంటూ తను పాటించే పలు సౌందర్య చిట్కాలను వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ సెలబ్రిటీ వైఫ్. మరి, మీరా అందం వెనకున్న ఆ న్యాచురల్ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
బాలీవుడ్ కండల వీరుడు షాహిద్ కపూర్ ఇల్లాలిగానే కాదు.. తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది మీరా రాజ్‌పుత్. ఆయా సందర్భాలకు తగినట్లుగా ఫ్యాషనబుల్ దుస్తులు ధరించడం, ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే! దీంతో పాటు తను పాటించే సౌందర్య చిట్కాలను సైతం తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఈ తరం అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది మీరా. ఇందులో భాగంగానే తాను రోజువారీ పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలకు సంబంధించిన ఓ వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో పంచుకుందీ బ్యూటిఫుల్ మామ్. ఆ టిప్స్ ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
అమ్మ చెప్పిన చిట్కాలే!
అందాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రస్తుతం మనకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే నేను మాత్రం సహజసిద్ధంగా సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికే ప్రాధాన్యమిస్తా. ఇప్పుడే కాదు.. నాకు ఈ అలవాటు 14 ఏళ్ల వయసు నుంచే ఉంది. సంపూర్ణ సౌందర్యాన్ని సొంతం చేసుకోవడానికి అమ్మ చెప్పిన సహజ చిట్కాలనే పాటిస్తున్నా. నిజానికి మన చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని ఇనుమడించే పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయి. వాటితో తక్కువ ఖర్చుతో, ఎంతో సులభంగా అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ఈ క్రమంలో నేను పాటించే కొన్ని న్యాచురల్ బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నా..!
తాజాదనం కోసం..!
చర్మం తాజాగా ఉంటేనే అందంగా కనిపిస్తాం.. అలాంటి తాజాదనాన్ని పొందడానికి నేను ఉపయోగించే ఫేస్ ప్యాక్ ఇదే. ఇందుకోసం టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు తీసుకొని ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖం, మెడపై అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ అలసిపోయి కళ తప్పిన ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తే, పసుపులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యల్ని దూరం చేసి ప్రకాశవంతంగా మార్చుతాయి.

‘పచ్చి పాల’తో పాలుగారే అందం!
పచ్చి పాలను సౌందర్య పోషణలో భాగం చేసుకోవడమనేది అమ్మ చెప్పిన చిట్కా! చర్మం పొడిబారినట్లనిపించినా, ఎండ వల్ల కందిపోయినా, నిర్జీవమైపోయినా.. తిరిగి చర్మాన్ని మెరిపించుకోవడానికి తను పచ్చి పాలనే ఉపయోగిస్తుంటుంది. ఈ క్రమంలో రోజూ ఉదయాన్నే పచ్చి పాలలో ముంచిన దూదితో ముఖమంతా అద్దుకోవడం తనకు అలవాటు. ఇలా తనను చూసి నేనూ ఈ చిట్కా అలవాటు చేసుకున్నా. పచ్చి పాలతో రోజూ ఉదయాన్నే ఇలా చేయడం వల్ల చర్మానికి తక్షణ మెరుపుతో పాటు తేమ కూడా అందుతుంది. ట్యాన్ దూరమవుతుంది.. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈ ప్యాక్‌తో ‘బ్రైడల్’ గ్లో!
ఫేషియల్ అంటే చాలామంది పార్లర్లకే పరుగులు తీస్తుంటారు. కానీ నేను ఇంత వరకు ఒక్కసారి కూడా పార్లర్లో ఫేషియల్ చేయించుకోలేదు. ఆఖరికి నా పెళ్లికి కూడా! పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే ఇంట్లో తయారుచేసుకున్న సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌తో బ్రైడల్ గ్లోని సొంతం చేసుకున్నా. ఈ క్రమంలో చిరోంజీ స్క్రబ్ (చిరోంజీ అనేది బాదంపప్పుల్ని పోలి ఉండే ఒక రకమైన నట్. కొన్ని చిరోంజీ నట్స్‌ని తీసుకొని అందులో కమలాఫలం తొక్కల్ని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆపై ఇందులో కొన్ని పాలు, కొద్దిగా తేనె వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిరోంజీ స్క్రబ్ అంటారు)లో కొద్దిగా మైసూర్ పప్పు పొడి, కొన్ని పాలు పోసి పేస్ట్‌లా తయారుచేసుకున్నా. దీంతో ముఖం, ఇతర శరీర భాగాల్లో మర్దన చేసుకున్నా. ఈ ప్యాక్ చర్మంపై ఏర్పడిన మృతకణాల్ని తొలగించడంలో సహకరిస్తుంది. తద్వారా మేను మెరుపును సంతరించుకుంటుంది.
నా ఫేషియల్ ఇలా ఉంటుంది!
* ఫేషియల్‌లో భాగంగా ముందుగా నిమ్మకాయ ముక్కతో ముఖంపై గుండ్రంగా మర్దన చేసుకుంటా. కాసేపటి తర్వాత కడిగేసుకుంటా. అయితే సున్నితమైన చర్మం ఉన్న వారు నిమ్మకాయను నేరుగా కాకుండా ఈ రసంలో కొన్ని నీళ్లు కలుపుకొని ముఖానికి పట్టించుకోవాలి.
* ఆ తర్వాత ముఖానికి మాస్క్ వేసుకుంటా. ఇందుకోసం శెనగపిండి, పెరుగు కలిపిన ఫేస్‌మాస్క్‌ని వాడతాను. అప్పుడప్పుడూ ఎండిన కమలాఫలం తొక్కల పొడి, గంధం, వేపాకుల పొడి, కుంకుమపువ్వు, రోజ్‌వాటర్.. వంటివి కలుపుతుంటా. మీరు కూడా మీ చర్మతత్వాన్ని బట్టి వీటిని కలుపుకోవచ్చు. ఇక ఇలా తయారైన మాస్క్‌ను ముఖానికి పట్టించి కొద్దిగా ఆరిన తర్వాత గుండ్రంగా రుద్దుకుంటూ తొలగిస్తా. ఇలా మర్దన చేయడం వల్ల ముఖంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి.
* ఇలా ఫేస్‌మాస్క్ తొలగించుకున్న తర్వాత టొమాటో రసం అప్లై చేసుకుంటా. పదిహేను నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడిగేసుకుంటా.
* ఇక ఆఖరుగా.. కలబంద గుజ్జును ముఖానికి పట్టిస్తా. చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా, మృదువుగా మారడానికి అలోవెరా చక్కగా పనిచేస్తుంది.
ఇలా రెండు వారాలకోసారి ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటా. దీనివల్ల ముఖానికి తాజాదనం, తక్షణ మెరుపు సొంతమవుతాయి.

‘తులసి’తో మొటిమలు మాయం!
పీసీఓఎస్, జిడ్డు చర్మతత్వం గల వారు ముఖంపై మొటిమలతో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాను పాటించచ్చు. ఇందుకోసం గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకుల్ని వేసి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక అందులో ఒక కాటన్ బాల్ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మొటిమల కారణంగా మచ్చలు ఏర్పడకుండా చేస్తుందిది. మొటిమల వల్ల ఎరుపుదనం, వాపు వంటివి తక్షణమే తగ్గి మెరిసిపోవాలంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది. నేనూ చాలాసార్లు ఈ టిప్‌ని పాటించి మంచి ఫలితం పొందాను.
మందారం నూనెతో కురులకు మెరుపు!
నా జుట్టు ఆరోగ్యం కోసం నేను మందార నూనె వాడుతుంటా. అంతేకాదు.. చాలా హెయిర్ప్యాక్స్లో కూడా మందార పూలను భాగం చేసుకుంటా. అయితే ఈ మందార నూనె ఎలా తయారుచేసుకోవాలంటే.. ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకొని అందులో ఏడెనిమిది మందార ఆకులు, రెండు మందార పూల రెక్కలు, కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకులు, కొద్దిగా ఉసిరి పొడి, కొద్దిగా వేపాకుల పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా తయారైన మందార నూనెను తరచూ కురులకు పట్టించడం వల్ల అవి పట్టులా మెరుస్తాయి.

సిల్కీ హెయిర్ కోసం జెల్!
గడ్డిలా ఉన్న జుట్టును సిల్కీగా మార్చుకోవడానికి ఈ న్యాచురల్ హెయిర్ జెల్ వాడుతుంటా. ఈ చిట్కాను నేను నా ఫ్రెండ్ దగ్గర్నుంచి తీసుకున్నా. ఇందుకోసం ఒక చిన్న కుండలో నీళ్లు తీసుకొని అందులో అరకప్పు అవిసె గింజల్ని వేసి బాగా మరిగించాలి. కాసేపటి తర్వాత ఈ మిశ్రమం జెల్లా మారుతుంది. దీన్ని జల్లెడ సహాయంతో వేరు చేయాలి. ఈ జెల్‌ను హెయిర్‌మాస్క్‌లా ఉపయోగించుకోవచ్చు. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించి కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. బన్, పోనీటెయిల్.. వంటి హెయిర్‌స్టైల్స్ నీట్‌గా రావాలంటే అవి వేసుకునే ముందు ఈ జెల్ మాస్క్ అప్లై చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ పదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే అయినప్పటికీ కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. ఈ క్రమంలో అలర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆపై ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఫేస్‌ప్యాక్స్, హెయిర్ప్యాక్స్లో మనం ఉపయోగించే ప్రతి పదార్థం కల్తీ లేకుండా స్వచ్ఛమైనదే ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందచ్చు. ఇక వీటితో పాటు ప్యాక్ తయారుచేసుకునే పాత్రల్ని శుభ్రంగా కడగడం, మీరు కూడా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి!
సో.. ఇవండీ! మీరా న్యాచురల్ బ్యూటీ వెనకున్న అసలు సిసలైన రహస్యాలు! మరి, మీరు మీ అందాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగిస్తుంటారు? కింది కామెంట్ బాక్స్ ద్వారా మీ బ్యూటీ సీక్రెట్స్‌ని అందరితో పంచుకోండి.. నలుగురికీ బ్యూటీ పాఠాలు నేర్పండి!