చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే పుండు మీద కారం చల్లినట్లు ఇంకొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి శీతాకాలం పూర్తయ్యే లోపు సంబంధిత చర్మ సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని ఉపయోగించే కొన్ని ప్యాక్స్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

చలికాలం రాగానే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పగుళ్లు రావడం.. వంటి సౌందర్యపరమైన సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అయితే వీటికి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు చాలామంది రకరకాల ప్యాక్స్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇవి పూర్తిగా తగ్గినప్పుడే డల్‌గా మారిన చర్మం తిరిగి పూర్తి ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది. అందుకు ఉపకరించే ప్యాక్స్..

వేపాకులతో..
వేపాకులు, తులసి ఆకులను గుప్పెడు చొప్పున తీసుకొని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పొడిని చెంచా చొప్పున తీసుకొని అందులో తేనె, చందనం చెంచా చొప్పున వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడ, చేతులు.. చర్మం డల్‌గా మారిన ప్రాంతంలో అప్త్లె చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మంపై ఉండే మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు.. వంటి వాటిని తగ్గుముఖం పట్టేలా చేయడంలో వేప ముందు వరుసలో ఉంటుంది. అలాగే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపించేలానూ చేస్తుంది.

ఆరెంజ్, గ్రీన్ టీతో..
ఎండబెట్టిన గ్రీన్ టీ ఆకులు కొద్దిగా తీసుకొని పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్, ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని డల్ స్కిన్ ఉన్న చోట అప్త్లె చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందించడం ద్వారా తిరిగి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి.

కలబంద, బాదం నూనె..
చలికాలంలో తలెత్తే రకరకాల చర్మ సమస్యలకు ఒక్క ప్యాక్‌తో చెక్ పెట్టాలనుకునేవారు ఈ ప్యాక్‌ని ప్రయత్నించవచ్చు. కలబంద గుజ్జు ఒక చెంచా తీసుకొని అందులో అరచెంచా బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు.. మొదలైన ప్రాంతాల్లో అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మానికి అవసరమైన తేమ అందడంతో పాటు తక్షణమే మెరుపు కూడా సంతరించుకుంటుంది.

అరటి, పెరుగుతో..
సహజసిద్ధంగా బాగా పండిన అరటిపండు తీసుకొని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న అరటిపండు గుజ్జు అరచెంచా తీసుకొని దానికి తేనె, పెరుగు చెంచా చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని డల్ స్కిన్ ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. పెరుగు, తేనె చర్మానికి తేమని అందిస్తే, అరటిపండు నిర్జీవంగా మారిన చర్మానికి తిరిగి జీవం పోస్తుంది.
బాదంతో..
బాదంపై ఉండే పొట్టు తొలగించి కొద్దిగా పాలు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందడమే కాదు.. శీతాకాలంలో ఎలాంటి చర్మసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందే జాగ్రత్తపడచ్చు. ఈ ప్యాక్ ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. తాజా చర్మం మన సొంతం అవుతుంది.

శెనగపిండి, టొమాటోతో..
కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో తగినంత టొమాటో రసం వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కాస్త రోజ్‌వాటర్ కూడా జత చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌లా పని చేసి నిర్జీవమైన చర్మాన్ని తిరిగి జీవంతో తాజాగా కనిపించేలా చేస్తుంది.
ఇవి కూడా..
చలికాలంలో డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ముద్దగా చేసిన గులాబీ పూరేకలు, పచ్చిపాలు, రోజ్‌వాటర్, తేనె, చక్కెర (తెలుపు+ బ్రౌన్), ఓట్స్, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, క్యారట్స్, చాక్లెట్, వాల్నట్స్, కొబ్బరినూనె.. మొదలైన పదార్థాలు ఉపయోగించి కూడా ప్యాక్స్ వేసుకోవచ్చు. ఇవి తరచూ క్రమం తప్పకుండా వేసుకుంటూ ఆరోగ్యరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం.. వంటివి చేయడం ద్వారా డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మార్చి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.