ముద్దుగుమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే ‘అబ్బ.. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో’ అనుకుంటాం.. మేకప్ మహిమతో ఇంత క్యూట్‌గా మెరిసిపోవచ్చా.. అని ఆశ్చర్యపోయేవారూ ఉన్నారనుకోండి. అయితే వారు ఇంత అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవడం వెనుక మేకపే కాదు.. సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలూ ఉన్నాయ్! ఈ క్రమంలోనే చాలామంది నటీమణులు అప్పుడప్పుడూ తమ న్యాచురల్ బ్యూటీ సీక్రెట్స్‌ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటారు. తాజాగా బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ కూడా అదే చేసింది. తన అధరాల మెరుపుకి కారణమైన న్యాచురల్ చిట్కాలేంటో ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ సొగసరి. ‘వ్యానిటీ విన్యెట్స్’ పేరుతో నిర్వహిస్తోన్న బ్యూటీ సిరీస్‌లో భాగంగా తన సౌందర్య రహస్యాల్ని బయటపెడుతోన్న ఈ క్యూటీ తన లిప్ కేర్ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..
సరికొత్త ఫ్యాషన్లను ప్రయత్నిస్తూ బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరు తెచ్చుకున్న సోనమ్.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటోంది. ఇటీవలే తన పీసీఓఎస్ అనుభవాలను పంచుకుంటూ మహిళల్లో స్ఫూర్తి నింపిన ఈ సొగసరి.. తాజాగా తాను పాటించే సౌందర్య రహస్యాల్ని పంచుకోవడానికి ముందుకొచ్చింది. ‘వ్యానిటీ విన్యెట్స్’ పేరుతో నిర్వహిస్తోన్న బ్యూటీ సిరీస్‌లో భాగంగా తన లిప్ కేర్ గురించి బయటపెట్టిందీ బాలీవుడ్ దివా.
మరీ ఎక్కువగా వద్దు!
పెదాలను మృదువుగా ఉంచుకోవడానికి స్క్రబింగ్ ప్రక్రియ బాగా తోడ్పడుతుందంటోంది సోనమ్. ‘నేను నా పెదాల్ని వారానికోసారి లేదంటే రెండుసార్లు స్క్రబ్ చేసుకుంటాను. అలాగని మరీ ఎక్కువగా స్క్రబ్ చేయను.. ఎందుకంటే పెదాల్ని పదే పదే స్క్రబ్ చేస్తే పిగ్మెంటేషన్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అది పెదాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక స్క్రబ్ విషయానికొస్తే.. చక్కెర, తేనెతో తయారుచేసిన స్క్రబ్‌ని పెదాలపై రాసుకొని నెమ్మదిగా మర్దన చేసుకుంటాను. కాసేపటి తర్వాత కడిగేసుకుంటాను. చక్కెర ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తే.. తేనె పెదాలకు తేమనందిస్తుంది. ఇక రాత్రి పడుకునే ముందు పెదాలపై కొబ్బరి నూనె రాసుకుంటాను. ఈ చిట్కాతో పెదాలు తేమను సంతరించుకుంటాయి..’ అంటూ తన అందమైన అధరాల వెనకున్న బ్యూటీ సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ సొగసరి.
అందుకే చక్కెర దూరం పెట్టాను!
ఇక అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా తన మేకప్ సీక్రెట్స్‌ని పంచుకుంటూ.. ‘చర్మ ఆరోగ్యం విషయంలో నేను అస్సలు అశ్రద్ధ చేయను. ఇందుకోసం చక్కెరను పూర్తి దూరం పెట్టాను. ఇక మేకప్ వేసుకోవడానికి మనం ఉపయోగించే బ్రష్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనైతే నా మేకప్ బ్రష్‌లను మూడు నాలుగు రోజులకోసారి శుభ్రం చేస్తాను. అయితే వాడిన ప్రతిసారీ వాటిపై యాంటీ బ్యాక్టీరియల్ క్లీనింగ్ స్ప్రేను స్ప్రే చేసి టిష్యూతో తుడిచేస్తాను..’ అంటోందీ బాలీవుడ్ అందం.
అధరాల మెరుపుకి..
చర్మం తేమను కోల్పోవడం వల్ల ఆ ప్రభావం పెదాలపై కూడా పడుతుంది. తద్వారా పెదాలు పొడిబారిపోయి నిర్జీవమైపోతాయి. అలాంటప్పుడు ఈ న్యాచురల్ లిప్ స్క్రబ్స్‌ని ఉపయోగిస్తే పెదాలు తిరిగి మెరుపును సంతరించుకుంటాయి.
* అరటీస్పూన్ చొప్పున దాల్చిన చెక్క పొడి, తేనె, ఆలివ్ నూనె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసి మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకొని లిప్ బామ్ రాసుకుంటే సరిపోతుంది.
* రెండు టేబుల్స్పూన్ల చొప్పున కమలాఫలం తొక్కల పొడి, బ్రౌన్ షుగర్ తీసుకొని అందులో కొన్ని చుక్కల బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో 30 సెకన్ల పాటు పెదాలపై మర్దన చేసుకొని కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.
* తేనె, బ్రౌన్ షుగర్.. వీటిని టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇందులో కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి పెదాలపై రాసుకోవాలి. రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దన చేసి ఆపై కడిగేసుకుంటే పెదాలు మృదువుగా మారతాయి.
* బరకగా ఉన్న కాఫీ పొడి, తేనె.. ఈ రెండింటినీ టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పెదాలపై నెమ్మదిగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పొడి బారిన పెదాలు మెరుపును సంతరించుకుంటాయి.
* కొన్ని గులాబీ రేకల్లో కొన్ని పచ్చి పాలు పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో పెదాలపై కాసేపు మృదువుగా రుద్దుకొని కడిగేసుకుంటే ఇటు పెదాలు తేమను తిరిగి పొందడంతో పాటు అటు మంచి రంగులోకి వస్తాయి.
|