'అబ్బా.. చలికాలం వచ్చిందంటే చాలు.. ఈ పెదాలను చూడలేం.. వీటిని ఏం చేసినా మళ్లీ మామూలుగా అవ్వవు..' అంటూ చిరాకు పడుతోంది స్నిగ్ధ. సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం కూడా తేమను కోల్పోయి పగిలినట్లుగా తయారవుతుంది. ముఖ్యంగా పెదాల్లాంటి సున్నిత భాగాలైతే మరీనూ.. ఇది అందరిలో ఎదురయ్యే సమస్యే అయినా కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది. మరి, చలికాలంలో పగిలి, నల్లబడిన పెదాలను తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం ఎలా అనుకుంటున్నారా? లిప్ ప్యాక్స్‌తో ఇది సాధ్యమే.. మరి, ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలతో అలాంటి లిప్ ప్యాక్స్ వేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి..
తేనెతో కోమలంగా..
పెదాలు ఎర్రగా, మృదువుగా, కోమలంగా మారేందుకు తేనె ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అరటీస్పూన్ దానిమ్మ రసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే సరి. కోమలమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇందులో తేనె చర్మానికి తేమను అందించి వాటిని సుతిమెత్తగా మారిస్తే.. దానిమ్మ రసం పెదాలకు మంచి రంగును అందించడంతో పాటు చర్మానికి కావాల్సిన పోషకాలను సమకూర్చి అది ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

గులాబీ అందం కోసం..
గులాబీ పువ్వులో విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే పావుకప్పు పాలల్లో కొన్ని గులాబీ రేకులను వేసి చేత్తో వాటిని నలుపుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ గ్లిజరిన్ కూడా వేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆరిపోకుండా అప్పుడప్పుడు మరో కోటింగ్ వేస్తూ ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై చల్లని నీటితో కడిగేస్తే సరి. గులాబీ రేకులు పెదాలకు మంచి రంగును అందించి తేమగా ఉండేలా చేస్తాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ పెదాలపై ఉన్న మృతచర్మాన్ని తొలగిస్తే, బాదం నూనె వాటిని మృదువుగా మారుస్తుంది.
గ్లిజరిన్ వాడుతూ..
గ్లిజరిన్‌ని రోజూ ఉపయోగించడం వల్ల పెదాలు సున్నితంగా తయారవుతాయట. నల్లబడిన పెదాల రంగును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. అందుకే ఐదుపాళ్ల నిమ్మరసంలో ఒక పాలు గ్లిజరిన్ వేసి రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆపై పావుగంట అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి.. ఇలా కొన్నిరోజుల పాటు చేస్తే పెదాలు సున్నితంగా మారతాయి.

బీట్రూట్ రసంతో..
బీట్రూట్ పెదాలకు చక్కటి రంగును అందించడంతో పాటు నలుపుదనాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. పెదాలను మృదువుగా చేసేందుకు గ్లిజరిన్ తోడ్పడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండిటి కలయికతో ప్యాక్ వేసుకుంటే పెదాలు మెరిసిపోవడం ఖాయం. దీనికోసం బీట్రూట్ని తురుముకొని జ్యూస్ చేసుకోవాలి. దీన్ని ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. లేదా కాస్త వేడిచేయచ్చు కూడా..! ఇలా చేయడం వల్ల అది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో ముప్పావు టీస్పూన్ గ్లిజరిన్ వేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆపై అరగంటకు చన్నీటితో కడిగేసుకుంటే సరి. ఈ ప్యాక్‌ని రోజూ ఉదయం వేసుకోవడం వల్ల రోజంతా ఎర్రని, మృదువైన పెదాలను సొంతం చేసుకోవచ్చు.

నిమ్మరసంతో..
నిమ్మరసం, తేనె.. అందానికి, ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పెదాల సంరక్షణలోనూ ఇవి బాగా తోడ్పడతాయి. ఇందుకోసం టీస్పూన్ చొప్పున నిమ్మరసం, తేనె తీసుకొని అందులో అరటీస్పూన్ ఆముదం వేసి పెదాలకు అప్త్లె చేసుకోవాలి. నిమ్మరసం బ్లీచ్‌లా పనిచేస్తే.. తేనె, ఆముదం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. కాబట్టి పెదాలు చక్కటి రంగుతో, మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి.
రాస్బెర్రీతో ఎర్రటి పెదాలు..
పండ్లలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. పెదాల సంరక్షణకు రాస్బెర్రీ చక్కగా సహాయపడుతుంది. ఇందుకోసం రాస్బెర్రీ గుజ్జును కొద్దిగా తీసుకొని తేనె, కలబంద గుజ్జు టేబుల్ స్పూన్ చొప్పున అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే సరి. ఎర్రని మృదువైన పెదాలు మీ సొంతమవుతాయి.
చూశారుగా.. చలికాలంలో మృదువైన పెదాలను మీ సొంతం చేసుకోవాలంటే ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలో.. మరి, మీరూ వీటిని ఉపయోగించి మీ పెదాల అందాన్ని కాపాడుకుంటారు కదూ..!