సీజన్‌తో సంబంధం లేకుండా శ్రావ్య ముఖం ఏ కాలంలోనైనా జిడ్డుగానే ఉంటుంది. ఇక ఈ జిడ్డును వదిలించుకోవడానికి రసాయనాలతో కూడిన ఫేస్‌వాష్‌తో పదే పదే ముఖం కడుక్కుంటోందామె.
చలికాలమంటే కావ్యకు తెగ చిరాకు! కారణం.. ఆమె చర్మం విపరీతంగా పొడిబారిపోతుంటుంది. ఇక ముఖ చర్మం గురించైతే చెప్పనక్కర్లేదు. అయినా సరే రోజుకు నాలుగైదు సార్లు ముఖం శుభ్రం చేసుకోనిదే ఆమెకు మనసొప్పదు.
చర్మతత్వం, కాలంతో సంబంధం లేకుండా కొంతమంది తమ ముఖం తాజాగా ఉండాలన్న ఉద్దేశంతో రోజులో ఎక్కువ సార్లు కడుగుతూనే ఉంటారు. అది కూడా రసాయనాలు అధికంగా ఉండే ఫేస్‌వాష్‌లతో! ఇలా చేయడం వల్ల ముఖ చర్మం పొడిబారిపోయి నిర్జీవమైపోతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. ఒక్కో చర్మతత్వం ఉన్న వారు తమ ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ఒక్కో రకమైన జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకొని ఆచరించేద్దామా?!
తాజాగా ఉండాలన్న ఉద్దేశంతో కొంతమంది ముఖాన్ని పదే పదే కడుగుతుంటారు. ఇంకొందరైతే బయట దొరికే రసాయనాలతో నిండిన ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తుంటారు కూడా! తద్వారా తాజాదనం ఏమోగానీ చర్మం తేమను కోల్పోయి పొడిబారిపోతుంది.. నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి మీ ముఖచర్మతత్వాన్ని బట్టి ముఖం కడుక్కునే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

మీది పొడిచర్మమా?
కాలంతో సంబంధం లేకుండా కొంతమంది చర్మం ఎప్పుడు చూసినా పొడిబారిపోతుంటుంది. ఇక చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్లు ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే ఫేస్వాష్లలో ఆల్కహాల్, పారాబెన్.. వంటి రసాయనాలు లేని, సువాసనభరితం కాని ఫేస్‌వాష్‌లను ఎంచుకోమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు.. రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇక ఫేస్‌వాష్ కోసం సహజసిద్ధమైన పదార్థాలనే ఉపయోగిస్తామనుకునే వారు.. పెరుగు+తేనె, తేనె+కోడిగుడ్డు, పాలు+తేనె.. వంటి న్యాచురల్ క్లెన్సర్లను తయారుచేసుకొని వాడుకోవచ్చు. ఇక ఇలా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఏదైనా అత్యవసర నూనెను ముఖానికి రాసుకొని.. కాసేపు మృదువుగా మర్దన చేయాలి. కాసేపటి తర్వాత టిష్యూతో తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నూనె చర్మంలోకి ఇంకి పొడిబారకుండా చేస్తుంది.

జిడ్డు తొలగించాలంటే..!
ఎంత కడిగినా కొంతమందికి తమ ముఖంపై పేరుకునే జిడ్డు తొలగిపోదు. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. కాబట్టి అలాంటివారు గాఢత తక్కువగా ఉండే నురుగు (ఫోమ్) ఆధారిత ఫేస్‌వాష్‌ను ఎంచుకోమంటున్నారు నిపుణులు. ఉదయం లేవగానే ఈ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కొని శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. ఇక సహజసిద్ధమైన ఫేస్‌వాష్‌లు కావాలంటే రోజ్‌వాటర్, యాపిల్ సిడార్ వెనిగర్, పాలు, చామొమైల్ టీ, నిమ్మ+తేనె మిశ్రమం, కీరాదోస+టొమాటో.. వంటి పదార్థాలను ఉపయోగించచ్చు. జిడ్డు చర్మతత్వం ఉన్న వారు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తద్వారా జిడ్డు పేరుకుపోకుండా.. మొటిమలు, మచ్చలు రాకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇలా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ని ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా కనిపిస్తుంది.

కాంబినేషన్ స్కిన్ కోసం..
నుదురు, గడ్డం.. వంటి ముఖ భాగాల్లో జిడ్డుగా; మిగతా భాగాల్లో పొడిగా ఉండే కాంబినేషన్ స్కిన్ కలిగిన వారి తిప్పలు చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి వారు అటు జిడ్డు పేరుకుపోకుండా, ఇటు పొడిబారకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్స్ఫోలియేషన్ గుణాలుండే ఫేస్‌వాష్/ఫేస్స్క్రబ్ను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ముల్తానీ మట్టి, బొప్పాయి, శెనగపిండి.. వంటి పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్స్‌ని కూడా ఉపయోగించచ్చు. దీంతో ముఖంపై నెమ్మదిగా రుద్దుకోవడం వల్ల జిడ్డుగా ఉండే భాగాల్లో దుమ్ము-ధూళి, జిడ్డుదనం తొలగిపోతుంది.. అదే పొడిబారిన భాగాలకు చక్కటి మసాజ్ అంది రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా తేమను సంతరించుకుంటుంది. ఇలా ముఖం శుభ్రపరచుకున్న తర్వాత రోజ్‌వాటర్, కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె, కలబంద గుజ్జు.. వంటి వాటిని టోనర్‌గా ఉపయోగించచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!
*మేకప్ వేసుకునే వారు ఇంటికొచ్చాక ముందుగా మేకప్ రిమూవర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి. అప్పుడే చర్మ రంధ్రాల్లోకి చేరిన మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.
*ఎలాంటి చర్మతత్వం ఉన్న వారైనా సరే ముఖం శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చగా ఉండే నీళ్లు లేదంటే చల్లటి నీళ్లను ఉపయోగించాలి. అదే మరీ వేడి ఎక్కువగా ఉండే నీటిని వాడితే చర్మం మరింత పొడిబారి నిర్జీవమైపోతుంది.
*ముఖమంటే బుగ్గల వరకే రుద్దుకొని శుభ్రం చేసుకుంటారు చాలామంది. కానీ గడ్డం కింది భాగం, మెడ కూడా అందులో భాగమే! అక్కడ చేరిన దుమ్ము, ధూళి కూడా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ముఖం కడుక్కున్న ప్రతిసారీ గడ్డం కింద, మెడను కూడా శుభ్రం చేసుకోవాలి.
*ముఖం కడుక్కున్న తర్వాత త్వరగా ఆరిపోవాలని టవల్‌తో బాగా రుద్దడం కాకుండా మృదువైన టవల్‌తో నెమ్మదిగా అద్దుతూ తుడుచుకోవాలి. ఫలితంగా ముఖ చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
*ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే ఫేస్‌వాష్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో మీ చర్మతత్వాన్ని బట్టి ఎంత ఫేస్‌వాష్ వాడడం మంచిదో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే మీరు ఎంచుకునే ఫేస్‌వాష్ లేబుల్‌ని ఓసారి పరిశీలించినా సరిపోతుంది.
*ఇక ముఖం కడుక్కున్న తర్వాత చర్మం పొడిబారిపోకుండా, ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో జిడ్డు చర్మం ఉన్న వారు ఆయిల్ రహిత మాయిశ్చరైజర్స్ వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. లేదంటే మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది.
చర్మతత్వాన్ని బట్టి ముఖం ఎలా కడుక్కోవాలి? ఈ క్రమంలో ఎలాంటి ఫేస్‌వాష్‌లు వాడాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకున్నారుగా! అయితే ఇలాంటి చర్మ సంబంధిత ఉత్పత్తుల గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు. అలాగే వీటిని ఉపయోగించే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోకండి.