శిరోజాలకు వేసవి, వానాకాలంలోనే కాదండోయ్.. శీతాకాలంలో కూడా సమస్యలు వస్తాయ్.. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం- ఈ కాలంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి, శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?? తదితర విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయాల్సిందే..!
శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల కేవలం శరీరంలోనే కాదు.. శిరోజాల్లో కూడా తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతేకాకుండా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుంది. కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకుంటూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలల్లాంటి ముంగురులతో అందంగా ఉండచ్చు.
తరచూ తలస్నానం వద్దు..!
కొందరు రోజూ తలస్నానం చేస్తే, మరికొందరు వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటారు. శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపూ కూడా మీ శిరోజాలకు సరిపడినదై ఉండాలి.

కండిషనింగ్ కూడా..
తలస్నానానికి ముందు జుట్టుకు కండిషనర్ (ప్రీవాష్ కండిషనర్స్) తప్పకుండా అప్త్లె చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. షాంపూలో ఉండే రసాయనాల ప్రభావం కూడా జుట్టుపై అంతగా ఉండదు.
అతి వేడి వద్దు..
ఈ కాలంలో స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి.
అలాగే జుట్టుకు సంబంధించి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా వాడకపోవడం మంచిది. అంటే డ్రయర్స్, కర్లర్స్, స్ట్రయిటనర్స్.. మొదలైన వాటిని దూరంగా ఉంచాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. అలాగే కండిషనర్ పెట్టుకున్న తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకున్నా కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది.
నూనె కూడా..
చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన కూడా సరైనది ఎంచుకోవాలి. పళ్లు కాస్త దూరంగా, వెడల్పుగా ఉన్నవైతే మంచిది.

అట్టకట్టినట్లు ఉంటే..
చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా అవుతోందా?? అయితే రోజూ రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఈ ఉన్న నూనెని రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని కూడా కవర్ చేసేలా స్కార్ఫ్, టోపీ.. ఇలా ఏదో ఒకటి విధిగా ధరించాలి. ఒకవేళ బయట ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురైతే మీ దగ్గర ఉన్న బాడీలోషన్ కొద్దిగా తీసుకుని రెండు చేతులకూ రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతుల మధ్య జుట్టు ఉంచి మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల శిరోజాల పెళుసుదనం పోయి, ప్రకాశవంతంగా మారతాయి.
జుట్టు రాలకుండా..
* ఒక అరటిపండు తీసుకుని దానిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుంచి 25 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులోని గుణాల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
* నిమ్మతో కేవలం చుండ్రు దూరం కావడమే కాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. నిమ్మరసాన్ని నేరుగా తలకు పట్టించవచ్చు లేదా ఏదైనా హెయిర్ మాస్క్‌కు జత చేయచ్చు. లేదంటే కొద్దిగా పెరుగు తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
* మందార పూలను ముద్దగా చేసి అందులో రెండు లేదా మూడు చుక్కల బాదంనూనె, 2 చెంచాల ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇలా 2గం|| ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని, తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి.
ఇవే కాకుండా జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడానికి ఇంట్లోనే పాటించగల చిట్కాలు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ గుర్తుంచుకుని ఈ శీతాకాలంలో మీ శిరోజాలను కూడా సంరక్షించుకోండి. అలల్లాంటి ముంగురులతో అందంగా మెరిసిపోండి.