'నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవాలి..'.. ఇది ప్రతి అమ్మాయికీ ఉండే ఆశే. ఈ క్రమంలోనే గోళ్ల దగ్గర్నుంచి పాదాల వరకూ అందంగా ఉండాలని కోరుకుంటారు అతివలంతా. అందుకే వాటి సౌందర్య సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరి, మీ వీపు సంగతి ఏంటి?? ఏముంది.. అది ఎలానూ డ్రస్ లేదా హెయిర్‌తో కవర్ అయిపోతుంది కదా.. సో.. కనిపించదు.. అంటారా?? అయితే అక్కడే మీరు పప్పులో కాలేశారు.. ఎందుకంటే ప్రస్తుతం బ్యాక్‌లెస్ లేదా డీప్ బ్యాక్నెక్తో ఉన్న అవుట్‌ఫిట్స్ ధరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి, అలాంటి దుస్తుల్లో అందంగా, స్త్టెలిష్‌గా కనిపించాలంటే వీపు విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే..! అందుకోసం మనమే ఇంటి దగ్గర కొన్ని ప్యాక్స్ తయారుచేసుకొని ప్రయత్నిస్తే సరి..! అవేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

గులాబీ రేకలతో..
గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పచ్చిపాలు, శెనగపిండి, కాస్త పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్‌లా అప్త్లె చేసి ఆరే వరకు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారడం మాత్రమే కాదు.. వీపు భాగంలో వచ్చే చిన్న చిన్న మొటిమలు, గుళ్లల సమస్యలకు కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది.

గ్రీన్ టీ క్యూబ్‌తో..
ఒక కప్పులో వేడి నీళ్లు తీసుకొని అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి కాసేపు ఉంచాలి. తర్వాత టీ బ్యాగ్ తీసేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ నీటిని ఐస్ క్యూబ్ ట్రేల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా సిద్ధం చేసుకున్న గ్రీన్ టీ క్యూబ్స్‌తో రోజూ ఒకటి లేదా రెండుసార్లు వీపు భాగంలో మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం సొంతం చేసుకోవచ్చు.
ఓట్స్, టొమాటో గుజ్జుతో..
రెండు చెంచాల ఓట్స్ పౌడర్ తీసుకొని అందులో టొమాటో గుజ్జు, పెరుగు చెంచా చొప్పున వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్‌లా అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా ఉపయోగిస్తే వీపు భాగంలో చర్మం తక్కువ సమయంలోనే ప్రకాశవంతంగా మారుతుంది.

టీట్రీ ఆయిల్‌తో..
ఒక కప్పు నీటిలో మూడు లేదా నాలుగు చెంచాల టీట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి దానితో వీపు భాగంలో ఉన్న చర్మంపై మృదువుగా రుద్దుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం ద్వారా వీపు భాగంలో చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారడమే కాదు.. ఆ భాగంలో మొటిమలు, మచ్చల సమస్యలు కూడా ఉండవు.
పసుపుతో..
రెండు చెంచాల పెరుగులో అరచెంచా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వీపు భాగంలో ప్యాక్‌లా అప్త్లె చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం ద్వారా మెరిసే మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

చక్కెరతో..
చక్కెర చర్మానికి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, మలినాలు, మృతకణాలను తొలగించడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. కాబట్టి వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని అందులో కొద్దిగా రోజ్‌వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వీపు భాగానికి అప్త్లె చేసి కాసేపు మృదువుగా రుద్దుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి నాలుగు రోజులకోసారి క్రమం తప్పకుండా చేయడం ద్వారా వీపు భాగంలో మచ్చల్లేని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇవే కాదు.. పచ్చిపాలు, బొప్పాయి, బంగాళాదుంప రసం, నిమ్మరసం, తేనె.. మొదలైన పదార్థాలు ఉపయోగించి కూడా వీపు భాగపు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.