మరికొన్ని రోజుల్లో చలికాలం రానుంది. ఇతరత్రా ఇబ్బందుల కంటే చర్మానికి ఎదురయ్యే సమస్యల కారణంగా చాలామంది ఈ కాలాన్ని ఇష్టపడరు. శరీరాన్ని స్వెటర్లు, క్యాప్లతో కప్పేసినా చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పెదాలు, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ ఇన్‌స్టా వేదికగా కొన్ని సౌందర్య చిట్కాలను షేర్ చేసుకుంది. మరి, ఆమె చెప్పిన ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటోంది రవీనా టాండన్. ఈ క్రమంలో ‘బ్యూటీ టాకీస్ విత్ రావ్జ్ సిరీస్’ పేరిట పలు సౌందర్య చిట్కాలను అందిస్తోంది. ఇందులో భాగంగా చలికాలంలో ఎలా స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుందో తాజాగా ఓ వీడియో ద్వారా పంచుకుంది.
రవీనా చెప్పిన ఆ చిట్కాలేంటంటే!
*ఎలాంటి రసాయనాలు లేకుండా సహజమైన పదార్థాలతో తయారు చేసే ఆర్గానిక్ సోప్‌ను మాత్రమే స్నానానికి ఉపయోగించాలి.
* స్నానం పూర్తయిన తర్వాత టవల్‌తో చర్మాన్ని మృదువుగా తుడవాలి. అదే పనిగా గట్టిగా రుద్దితే చర్మం పాడైపోతుంది.
* ఆ తర్వాత శరీరాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. ఇందుకోసం స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. నేను కూడా మాయిశ్చరైజర్‌గా పాలనే వాడతాను. మొదట మృదువైన మస్లిన్ వస్త్రాన్ని తీసుకుని పాలలో ముంచండి. దాన్ని చర్మంపై మెల్లగా అద్దండి. ఆ తర్వాత సుమారు 15 నిమిషాల పాటు ఆరనివ్వండి ’ అని వీడియోలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ అందం.
చర్మాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే!
ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల తార...‘చల్లటి వాతావరణాన్ని చాలామంది ఇష్టపడతారు. కానీ ఈ కాలంలో మన చర్మాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
శిరోజాలను సంరక్షించుకోండిలా!
చలికాలంలో కేవలం చర్మానికే కాదు... జుట్టుకూ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకునేందుకు కొద్ది రోజుల క్రితం ఓ చక్కటి చిట్కాను అందరితో షేర్ చేసుకుంది రవీనా. ఈ సందర్భంగా ప్రతిరోజూ కొన్ని ఉసిరికాయలు తినడం ద్వారా దృఢమైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చంటూ ప్రాచీన కాలం నాటి ఈ పద్ధతిని వీడియో రూపంలో వివరించింది. ‘ముందుగా ఆరు ఉసిరి కాయలు, కప్పు పాలు తీసుకుని బాగా మరిగించాలి. ఉసిరి మెత్తగా అయిన తర్వాత గింజలు తీసేసి ముద్దలా చేసుకోవాలి. ఈ గుజ్జును జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను పాటిస్తే షాంపూ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే పుల్లటి ఉసిరి జుట్టులో ఉండే ధూళి కణాలను పూర్తిగా శుభ్రం చేస్తుంది. అంతేకాదు జుట్టు కొత్త మెరుపుని సంతరించుకుంటుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ ఉసిరి ప్యాక్‌ను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఉసిరితో చుండ్రుకు చెక్! చలికాలంలో విరివిగా లభించే వాటిలో ఉసిరి కూడా ఒకటి. ఇందులో విటమిన్-సి, ఈ, ట్యానిన్స్, ఫాస్ఫరస్, ఐరన్, క్యాల్షియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు... తదితర పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులోని విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహకరిస్తే, విటమిన్-సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా చుండ్రు లాంటి సమస్యలు తగ్గిపోయి జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
|
మరి, రవీనా చెప్పిన ఈ చిట్కాలను మనమూ ట్రై చేద్దాం... చలికాలంలో చర్మాన్ని, శిరోజాలను సంరక్షించుకుందాం.