అమ్మాయంటేనే అందం.. అందమంటేనే అమ్మాయి.. ఇలా సౌందర్యానికి మారుపేరుగా నిలిచే అతివలు తమ అందం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కరోనా వచ్చిన దగ్గర్నుంచి పార్లర్స్‌కి వెళ్లే మహిళల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవాలి. దానికి బదులుగా కొంతమందైతే ఇంటికే బ్యుటీషియన్స్ని పిలిపించుకుంటూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకుండా కరోనాను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. మరి, ఇంతకీ బ్యుటీషియన్‌ని ఇంటికి పిలిపించుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..
కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఒకరిళ్లకు మరొకరు వెళ్లడం, ఇతరులు మన ఇంటికి రావడం చాలా వరకు తగ్గిపోయింది. పైగా ఏవైనా ఆన్లైన్ పార్శిళ్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వచ్చినా కాంటాక్ట్ లెస్ పద్ధతినే పాటిస్తున్నారంతా! ఇక ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలైతే తాము పార్లర్స్‌కి వెళ్లడం కంటే బ్యుటీషియన్స్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఇలా మీరు నలుగురిలోకి వెళ్లకపోవడం మంచిదే కానీ.. రోజూ ఎంతోమందితో కాంటాక్ట్ అవుతూ వారికి పార్లర్ సేవలందించే సౌందర్య నిపుణుల్ని ఇంటికి పిలవడమంటే కాస్త రిస్క్‌తో కూడుకున్నదే అని చెప్పాలి. అయితే మరీ తప్పని పరిస్థితుల్లో పిలిపించుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!

* పార్లర్ సేవల్ని ఇంటి వద్దే పొందడానికి బ్యుటీషియన్ అపాయింట్మెంట్ కోసం కొంతమంది ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఎలాంటి మొహమాటం లేకుండా వారి ఆరోగ్య పరిస్థితి గురించి ముందే ఆరా తీయడం మంచిది. అలాగే దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలు లేకపోతేనే వారిని ఇంటికి ఆహ్వానించండి.
* ఎవరో మనకు తెలియని బ్యూటీషియన్స్ కంటే మనకు తెలిసిన, మన ఇంటి దగ్గర ఉండే నిపుణుల్ని ఇంటికి పిలిపించుకోవడం మంచిది. ఎలాగో అప్పుడప్పుడూ వారి పార్లర్‌కి వెళ్లే ఉంటాం కాబట్టి వారితో మనకు పరిచయం ఉంటుంది.. పార్లర్లో వాళ్లు ఎంత నీట్‌గా ఉంటారో గతంలో మనం చూసే ఉంటాం కాబట్టి వారి పరిశుభ్రతా ప్రమాణాల గురించి ముందే మనకు ఒక అవగాహన వస్తుంది. పర్లేదు నీట్‌గానే ఉంటారు అనిపిస్తే వారిని ఇంటికి పిలవచ్చు.
* ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తెలిసిన వారే కదా అని వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడానికి మొహమాట పడద్దు. వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉందో, లేదో తెలుసుకోండి.

* మన ఇంటికి వచ్చే ముందే శుభ్రమైన మాస్కు, ఫేస్‌షీల్డ్, వీలైతే పీపీఈ కిట్, గ్లౌజులు ధరించి రమ్మని సౌందర్య నిపుణులతో చెప్పడానికి మొహమాట పడకండి. అలాగే మనకు ఫేషియల్స్, ఐబ్రోస్, మానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్‌కట్.. వంటివి చేసే క్రమంలో వారు వెంట తెచ్చుకునే ప్రతి వస్తువూ శుభ్రంగా శానిటైజ్ చేశాకే తీసుకురమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా పని పూర్తయ్యేంత వరకు మాస్క్ పెట్టుకునే ఉండాలి.
* ఇక టవల్స్, బ్లేడ్స్, టిష్యూస్.. వంటివైతే పూర్తిగా కొత్తవే ఉపయోగించమని చెప్పాలి. ఒకవేళ ఇలాంటి బ్యూటీ పరికరాలు మీ ఇంట్లో ఉన్నట్లయితే వాటినే ఉపయోగించడం మరీ మంచిది. పని పూర్తయ్యాక వాటిని శానిటైజ్ చేస్తే సరిపోతుంది.
* ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో శరీర ఉష్ణోగ్రతను చెక్ చేయడానికి ఎలక్ట్రిక్ థర్మామీటర్, ఆక్సిజన్ స్థాయులు పరీక్షించుకోవడానికి ఆక్సీమీటర్.. వంటివి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి బ్యుటీషియన్ మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందే వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయులు పరిశీలించడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చేతులు, కాళ్లు కడుక్కోమనడం లేదంటే చేతుల్ని శానిటైజ్ చేసుకోమని చెప్పండి.

* ఇక ఎలాగూ బ్యూటీషియన్ ఇంటికే వచ్చారు కదా అని వారితో పిచ్చాపాటీగా మాట్లాడడం, నవ్వుకోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వడం.. వంటివి అస్సలు చేయద్దు. ఎందుకంటే ఒకవేళ ఫేషియల్స్ వంటివి చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం కుదరకపోవచ్చు.. ఆ సమయంలో మాట్లాడడం, నవ్వడం వల్ల నోట్లోని తుంపర్లు గాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.. అసలే ఈ రోజుల్లో లక్షణాలు లేకుండానే ఈ మహమ్మారి విజృంభిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోండి.
* మీరు బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించుకోవడం మంచిది. ఆ గదిలోకి మీరు, బ్యుటీషియన్ తప్ప మరెవరికీ అనుమతి ఇవ్వకండి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులను మీకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
* ఇక బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసం మీ ఇంట్లో ఏవైనా వస్తువులు ఉపయోగించినట్లయితే ప్రతిదీ శానిటైజ్ చేయాల్సిందే. దీంతో పాటు మీరు వాడిన గది, కుర్చీలు, టేబుల్స్, అద్దం.. వంటివన్నీ శానిటైజ్ చేయాలి.
* ఇక బ్యుటీషియన్ తీసుకొచ్చిన వస్తువులు, పరికరాలు మరొకరికి వాడే ముందు తప్పనిసరిగా శానిటైజ్ చేయమని చెప్పండి.
* అన్ని శానిటైజ్ చేసిన తర్వాత మీరు వేసుకున్న దుస్తులు, మాస్క్ (తిరిగి ఉపయోగించేదైతే), ఇతర క్లాత్స్.. అన్నీ వేడి నీళ్లలో ఉతికి బయట ఆరేయాలి. ఆ తర్వాత మీరు కూడా తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఇలా పార్లర్ ట్రీట్మెంట్ కోసం బ్యుటీషియన్‌ని ఇంటికి పిలిచే క్రమంలో ఈ జాగ్రత్తలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తే అటు మీ అందాన్ని సంరక్షించుకోవచ్చు.. ఇటు కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.. ఏమంటారు?!