జుట్టు రాలడం.. ప్రతి మహిళకు సాధారణంగా ఎదురయ్యే సమస్యే ఇది. అయితే జీవన శైలిలో మార్పులు, వాతావరణ కాలుష్యం.. వంటివి దీనికి ముఖ్య కారణాలన్న విషయం మనకు తెలిసిందే!
అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ బ్యూటీ మలైకాకు ఇప్పుడు మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలుతోందట. మొన్నామధ్య ఈ మహమ్మారి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయితే జుట్టు రాలే సమస్య మాత్రం గతంలో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఉందంటోంది. అంతేకాదు.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కడికో పరుగు పెట్టాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే.. అది కూడా ఒకే ఒక్క పదార్థంతో పరిష్కరించుకోవచ్చని చెబుతోంది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..
కరోనా బారిన పడి కోలుకున్నా చాలామందిని వివిధ రకాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో - ఇటీవల కరోనా నుంచి కోలుకొని తిరిగి ఎప్పటిలాగే ఆరోగ్యంగా, ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తోన్న మలైకాకు ఇప్పుడు మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలుతోందట. అయితే దాన్ని పరిష్కరించుకోవడానికి ఓ వంటింటి చిట్కాను మనందరికీ సూచించిందీ చక్కనమ్మ.
జుట్టు రాలకుండా ఇలా చేస్తున్నా!
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి తాను పాటించే చిట్కాలను సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకునే మలైకా.. ప్రస్తుతం తాను కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నానంటోంది. ఈ క్రమంలోనే జుట్టు రాలకుండా ఉండేందుకు ఓ చక్కటి చిట్కాను పాటిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
‘జుట్టు రాలడం మన జీవితంలో రోజూ జరిగేదే! అయితే ఈ సమస్య కొంతమందిలో కొన్ని దశల్లో ఎదురవ్వచ్చు.. మరికొంతమందిలో రోజూ తలెత్తచ్చు.. అంతమాత్రాన దీనికే కంగారు పడాల్సిన పనిలేదు.. సులభమైన చిట్కాలతో, పోషకాహారంతో ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటిదే! నేను ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నా అలసట, నీరసం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే గతంలో కంటే ఇప్పుడు జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోయింది. అందుకోసం ప్రస్తుతం నేను పోషకాహారం తీసుకోవడంతో పాటు ఈ సింపుల్ టిప్‌ని ప్రయత్నిస్తున్నా.
ఒక ఉల్లిపాయను తీసుకొని తురుముకోవాలి. దీన్నుంచి రసం తీసి.. కాటన్ బాల్ సహాయంతో జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 30-45 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే తేడా మీకే తెలుస్తుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి..’ అంటోంది మలైకా.
ఉల్లిరసంతో ఉపయోగాలెన్నో!

* ఉల్లిపాయ రసాన్ని కుదుళ్లు, జుట్టుకు అప్లై చేయడం వల్ల దానిలోని సల్ఫర్ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా, బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే ఇది కుదుళ్లలో కొలాజెన్ ఉత్పత్తికి కూడా సహకరిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మ కణాలు పుట్టుకొస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి. * ఉల్లిపాయలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ కుదుళ్లకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. తద్వారా కుదుళ్లు పొడిబారకుండా, చుండ్రు సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. * ఒక్కోసారి కుదుళ్లలో దురద వస్తుంటుంది. అలాంటప్పుడు కూడా ఉల్లిపాయలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆ దురద మటుమాయమవుతుంది. * కొంతమందిలో కుదుళ్లలో అక్కడక్కడా ప్యాచుల్లా జుట్టు రాలిపోయి అసౌకర్యానికి గురిచేస్తుంది. దీన్నే అలొపేషియా అంటారు. ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడానికీ ఉల్లిపాయ రసం చక్కగా ఉపయోగపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
|