'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..' అంటూ తన ప్రేయసిని పొగుడుకున్నాడో హీరోగారు.. కానీ ఆ మొటిమలు, మచ్చలు అమ్మాయిలకి ఎంత సమస్యను సృష్టిస్తాయో చెప్పనవసరం లేదనుకుంటా..! మరి మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? మీ సమస్యను తగ్గించేందుకు మా దగ్గర ఓ మంచి చిట్కా ఉంది. అదేంటంటారా? మీ చర్మ సౌందర్యం కోసం 'వేప'ను వాడండి.. అందులోని యాంటీబయోటిక్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి..
వేప అనగానే.. 'ఛీ.. చేదు..' అనేస్తాం మనమంతా.. కానీ అది చేసే మేలు అంతా ఇంతా కాదు.. మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా వేప చక్కగా ఉపయోగిస్తుంది. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇంతకీ వేపను ఎలా వాడాలంటారా? అక్కడికే వస్తున్నాం..
స్కిన్ టోనర్
దాదాపు 50 వేపాకులను తీసుకొని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆకులు రంగు మారి నీళ్లంతా ఆకుపచ్చగా మారే వరకు నీటిని వేడి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని ఒక బాటిల్లో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో దాదాపు 100 మి.లీ మిశ్రమాన్ని కలిపి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.. దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. వేప నీటిలో ఓ కాటన్ బాల్ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.

వేప ప్యాక్..
ఓ పది వేపాకులను తీసుకొని, దానికి కొన్ని నారింజ తొక్కలను కలిపి కొద్దిపాటి నీటిలో గుజ్జులా మారే వరకు మరిగించండి. దాన్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు వంటివి కలపండి. దీన్ని వారానికి మూడుసార్లు మొహానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
హెయిర్ కండిషనర్
కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. దీన్లో తేనెను కలపండి. ఈ గుజ్జును జుట్టుకు పట్టించి అరగంట ఉంచి తర్వాత కడిగేయండి. ఇది జుట్టుకు కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది.
బెరడుతోనూ..
వేప బెరడు, వేర్లను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలకు పట్టించడం వల్ల పేల బాధ తొలగిపోతుంది. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.

వేప నూనె..
వేప నూనెను కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీని వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. జుట్టు మెరుస్త్తూ ఉంటుంది.
పొడి చర్మానికి
చర్మం పొడిబారిపోతోందా? వేప ప్యాక్‌ని ప్రయత్నించండి. వెంటనే ఫలితం కనిపిస్తుంది. వేప పొడిలో కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్‌ని కలపండి. దీన్ని మిశ్రమంలా చేసి మొహానికి పట్టించండి. రెండు, మూడు నిమిషాలుంచి చల్లని నీటితో కడిగేయండి. మీ సమస్య పరిష్కారమైపోతుంది.
పొడవాటి జుట్టుకు..
వేపాకుల పొడిని తరచూ ఉపయోగిస్తూ ఉంటే తలలోని ఇన్ఫెక్షన్లన్నీ దూరమవుతాయి. వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతో పాటు జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది.
ఇవండీ.. వేప సద్గుణాలు.. వేప వల్ల మన చర్మానికి, జుట్టుకు కలిగే లాభాలు.. వాటితో ఇంట్లోనే తయారు చేసుకునే సౌందర్య సాధనాలు.. మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే మూలికలతోనే తమ ఆరోగ్యాన్ని, అందాన్ని చక్కగా కాపాడుకునేవాళ్లట.. మన అమ్మమ్మలు, నానమ్మలు అందుకే ఇంకా 'ఓల్డ్ బట్ బ్యూటిఫుల్' అనిపించుకుంటూ ఉంటారు. మనమూ ఈ టిప్స్ పాటిస్తూ వాళ్లను ఫాలో అయిపోదామా మరి..?