Photo: Instagram
పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ దెబ్బతీస్తుంది. వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు.. వంటివి చర్మ రంధ్రాల్లోకి చేరిపోయి మృతకణాలు, మొటిమలు ఏర్పడడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు బయట దొరికే సౌందర్య ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే మేలంటోంది బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా. తన అందాన్ని సంరక్షించుకోవడానికి అమ్మ చెప్పిన చిట్కాల్నే పాటిస్తున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వాటిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతోనూ పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ టిప్‌ని మన ముందుకు తీసుకొచ్చింది మలైకా. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..
వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తుంది బాలీవుడ్ అందాల అమ్మ మలైకా అరోరా. యాభైకి చేరువవుతున్నా ఇప్పటికీ నవయవ్వనమైన చర్మంతో మాయ చేస్తోందీ బ్యూటీ. ఇందుకు కారణం వంటింటి చిట్కాలే అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన అందానికి కారణమైన సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటుంది మలైకా. ఈ క్రమంలో వాడేసిన కాఫీ పొడితో బాడీ స్క్రబ్ ఎలా తయారుచేసుకోవాలి? దాంతో చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో వివరిస్తూ రూపొందించిన వీడియోను ఇన్‌స్టా ద్వారా తాజాగా పంచుకుందీ బ్యూటిఫుల్ మామ్.
వాడిన కాఫీ పొడితో..!
‘చర్మ సౌందర్యానికి సంబంధించిన బోలెడన్ని చిట్కాలను అమ్మ మాతో పదే పదే చెబుతుండేది. స్నానం చేసేటప్పుడు లూఫా లేదంటే ప్యూమిస్ స్టోన్ ఉపయోగించమని సలహా ఇచ్చేది. ఈ చిట్కాల్ని ఇప్పటికీ నేను పాటిస్తున్నా. అయితే వీటితో పాటు క్రమంగా వంటింట్లో ఉండే పదార్థాలతోనే బాడీ స్క్రబ్స్, ఫేస్‌ప్యాక్స్.. వంటివి తయారుచేసుకొని వాడడం అలవాటు చేసుకున్నా. అలాంటి ఓ అద్భుతమైన బాడీ స్క్రబ్ రెసిపీసే ఈ రోజు మీ అందరితో పంచుకోబోతున్నా. అందుకోసం కేవలం మూడు పదార్థాలుంటే సరిపోతుంది. చాలామంది వాడేసిన కాఫీ పొడిని పడేస్తుంటారు. అలా చేయకుండా దీంతోనే స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. అలాంటి కాఫీ పిప్పిని కొద్దిగా తీసుకోండి. అందులో కాస్త బ్రౌన్ షుగర్ కలపాలి. ఒకవేళ మీ ఇంట్లో బ్రౌన్ షుగర్ లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఆపై కాస్త కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసి జారుడుగా కలుపుకోవాలి. ఇలా తయారైన స్క్రబ్‌ని స్నానం చేసే ముందు చర్మానికి పట్టించి.. గుండ్రంగా, మృదువుగా రుద్దుకోవాలి. కాసేపటి తర్వాత స్నానం చేసి చర్మాన్ని పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కా వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు మేనికి మెరుపును అందిస్తాయి.. సూర్యరశ్మి ప్రభావం చర్మంపై పడకుండా కాపాడతాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ అందం.
బోలెడు ప్రయోజనాలు!

ఎంతో సులభంగా తయారుచేసుకునే ఈ కాఫీ స్క్రబ్‌తో సౌందర్య పరంగా ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి. * కాఫీలోని పాలీఫినోల్స్, హైడ్రోసినమిక్ ఆమ్లం, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉబ్బిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి చేర్చడంలో సహాయపడతాయి. * కాఫీ స్క్రబ్‌తో గుండ్రంగా, మృదువుగా మర్దన చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
 * కాఫీలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నవయవ్వనంగా, ప్రకాశవంతంగా మార్చుతాయి. * అలసట వల్ల కళ్ల కింద చర్మం ఉబ్బినట్లుగా మారుతుంటుంది. అలాంటప్పుడు కాస్త కాఫీ స్క్రబ్‌ని ఆ ప్రదేశంలో మృదువుగా మర్దన చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. * చర్మం కింది పొరల్లో ఉన్న కొవ్వు నిల్వల్ని తగ్గించుకొని చర్మాన్ని బిగుతుగా మార్చుకోవాలన్నా కాఫీ స్క్రబ్ చక్కటి మార్గం!
|
చూశారుగా.. కాఫీ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల సౌందర్య పరంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో! కాబట్టి మిగిలిపోయిన కాఫీ పొడిని పడేయకుండా ఇలా అందానికి ఉపయోగిద్దాం.. అపురూప లావణ్యాన్ని మన సొంతం చేసుకుందాం..!