అందమైన ముఖారవిందం, మోముపై చెరగని చిరునవ్వు, నయాగరా జలపాతం లాంటి కురులు, దొండపండును పోలిన పెదాలు, నాజూకైన నడుము.. ఇలా తను పుట్టాకే అందం పుట్టిందేమో అన్నంత అపురూప లావణ్యం ఆస్ట్రియా మహారాణి ఎలిజబెత్ అమాలీ యుగెనీ (సిసీ) సొంతం. ఆస్ట్రియా దేశపు సామ్రాజ్ఞిగానే కాదు.. అందాల రాశిగా, సౌందర్య దేవతగా చరిత్రలో నిలిచిపోయిందామె. మరి, ఆమె అంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్ని వాడడం వల్లే! అందుకే నేటికీ ఆ దేశపు మగువలు మహారాణి సిసీ బాటలోనే నడుస్తూ, తాను పాటించిన సహజమైన సౌందర్య పద్ధతుల్నే అనుసరిస్తూ.. అందానికి తమదైన రీతిలో నిర్వచనమిస్తున్నారు. అందం విషయంలో ఇతర దేశాల్లోని మగువలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా దేశపు మగువలు నాటి నుంచి నేటి వరకు పాటిస్తోన్న ఆ సహజమైన సౌందర్య పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఆలివ్ నూనెతో స్నానం..
మనం అందం గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నా ఈ వాతావరణంలోని కాలుష్యం మన చర్మాన్ని మరింత అంద విహీనంగా మార్చుతుంది. వాతావరణంలోని దుమ్ము, ధూళి, ఇతర విష కారకాలు చర్మంపైకి చేరడం వల్ల మేను తేమను కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. మరి, ఈ చర్మ సమస్యల్ని తొలగించుకొని కళను తిరిగి పొందడానికే ఆస్ట్రియా మగువలు రోజూ ఆలివ్ నూనెతో స్నానం చేస్తుంటారు. బాత్‌టబ్‌లో వేడి నీటిని (మరీ గోరువెచ్చగా కాకుండా, మరీ వేడిగా కాకుండా చూసుకోవాలి) నింపి.. అందులో కప్పు ఆలివ్ నూనె పోయాలి. ఆ నీటిలో పది నిమిషాల పాటు సేదదీరితే చక్కటి ఫలితం ఉంటుంది. ఒకవేళ బాత్‌టబ్ లేకపోయినా.. ఒంటికి ఆలివ్ నూనెను పట్టించి పది నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది. ఈ నూనెలో పుష్కలంగా లభించే 'ఎ', 'ఇ' విటమిన్లు చర్మానికి తేమనందించి మృదువుగా మార్చితే; యాంటీఆక్సిడెంట్లు చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, ఇతర విష కారకాల్ని తొలగిస్తాయి. ఇలా అప్పటి మహారాణి సిసీ పాటించిన ఈ సౌందర్య చిట్కాని నేటికీ ఆస్ట్రియన్ మగువలు పాటిస్తూ తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు.

చక్కటి చర్మ ఛాయకు ఈ ప్యాక్!
చర్మ ఛాయను పెంపొందించుకోవడానికి చాలామంది నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఫేషియల్స్ చేయించుకునే వారు కొందరైతే.. మరికొందరు అంతర్జాలంలో లభించే న్యాచురల్ బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతుంటారు. అయితే తమ చర్మ ఛాయను రెట్టింపు చేసుకోవడానికి ఆస్ట్రియన్ అతివలు నాటి కాలంలో మహారాణి సిసీ పాటించిన ఓ సహజసిద్ధమైన చిట్కానే ఇప్పటికీ పాటిస్తూ చక్కటి ఫలితాల్ని పొందుతున్నారు. ఒక బౌల్లో నాలుగు టేబుల్స్పూన్ల రోజ్ వాటర్, రెండు టేబుల్స్పూన్ల పాలు, టేబుల్‌స్పూన్ ద్రాక్ష రసం, ఐదు చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసి.. ఈ పదార్థాలన్నింటినీ కలిసే వరకూ బాగా కలుపుకోవాలి. ఆఖరున రెండు గుడ్లలోని తెల్లసొన వేసి మరోసారి కలుపుకొని.. ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడకు పట్టించాలి. రాత్రి పడుకునే ముందు ఈ ప్యాక్ వేసుకొని ఉదయం వరకూ అలాగే ఉంచుకొని ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ చర్మ ఛాయ మెరుగుపడడం మీరు గమనించవచ్చు. అంతేకాదు.. ఈ ప్యాక్ మేనికి తేమనందించి మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది కూడా!!

బుగ్గలకు న్యాచురల్ బ్లష్!
సాధారణంగా మనం మేకప్ వేసుకునే క్రమంలో బుగ్గలు ఎర్రగా కనిపించాలని బ్లష్ చేసుకోవడం మామూలే. అయితే ఇలాంటి మేకప్ వల్ల బుగ్గలు తమ సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మహారాణి సిసీ ఇందుకోసం సహజసిద్ధమైన పద్ధతినే అనుసరించేవారట! మెత్తగా మెదిపిన (క్రష్ చేసిన) స్ట్రాబెర్రీలపై కొద్దిగా తేనె వేసి ఆ మిశ్రమంతో తన బుగ్గలపై రుద్దుకునేదట! ఇదే చిట్కాని నేటికీ ఆస్ట్రియన్ మగువలు పాటిస్తూ సహజసిద్ధంగా మెరిసిపోతున్నారు. పది నిమిషాల పాటు ఇలా రుద్దుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవడం వల్ల వల్ల బుగ్గలు న్యాచురల్‌గానే ఎర్రగా కనిపిస్తాయంటున్నారు ఆ దేశపు మహిళలు. ఇదే చిట్కాను చర్మానికి సైతం అప్త్లె చేయడం వల్ల మేను లోలోపలి నుంచి శుభ్రపడి, మరింత మృదువుగా, ప్రకాశవంతంగా మారే అవకాశం ఉంటుంది.

మేని మెరుపుకి రోజ్ క్రీమ్!
తన చర్మాన్ని మెరిపించుకోవడానికి, నవయవ్వనంగా కనిపించేలా చేసుకోవడానికి మహారాణి సిసీ ఎన్నో సహజసిద్ధమైన సౌందర్య చిట్కాల్ని వాడేవారట! అలాంటిదే ఈ రోజ్ క్రీమ్ కూడా! అదెలా తయారుచేసుకోవాలంటే.. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని దానిపై మూత పెట్టి స్టౌ మీద సిమ్‌లో పెట్టాలి. కాసేపటి తర్వాత అందులో 25 గులాబీ మొగ్గల్ని కాస్త క్రష్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 50 గ్రాముల ల్యానోలిన్ (ఇదొక రకమైన వ్యాక్స్), 20 గ్రాముల ఉప్పు లేని బటర్‌ను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త వేడెక్కాక.. దీన్ని బ్లెండర్లో వేసి క్రీమ్‌లా మారేంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన క్రీమ్నే గులాబీ క్రీమ్‌గా పిలుస్తుంటారు ఆస్ట్రియన్ మగువలు. ఈ క్రీమ్‌ను ఒక గ్లాస్ జార్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది. రోజూ ఉదయం లేవగానే ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుంటే కొద్ది రోజుల్లో చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారడం గమనించచ్చు.

జుట్టుకు బ్రాందీతో స్నానం!
పొడవైన జుట్టు కూడా ఆడవారి అందాన్ని మరింతగా రెట్టింపు చేస్తుంది. ఆస్ట్రియా మహారాణి సిసీని చూస్తే ఇది నిజమనిపించకమానదు. నయాగరా జలపాతం లాంటి పొడవైన కురులు ఆమె సొంతం. మరి, తన కేశ సంపదను సంరక్షించుకోవడానికి సిసీ ఏం వాడే వారో తెలుసా? బ్రాందీ. ఆల్కహాల్ అంటూ మనం దూరం పెట్టే ఆ బ్రాందీతోనే తన జుట్టును శుభ్రం చేసుకునేవారట ఆమె! వారానికి మూడుసార్లు కోడిగుడ్లు, బ్రాందీ కలిపి తయారుచేసిన మిశ్రమంతో జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు శుభ్రం చేసేవారట! ఆపై చల్లటి లేదంటే గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేసేవారామె. ఇక అంత పొడవాటి వెంట్రుకలు ఆరాలంటే బోలెడంత సమయం పడుతుంది. అయినా ఓపికతో సహజంగానే జుట్టును ఆరబెట్టుకునేవారట సిసీ. ఇలా సహజసిద్ధమైన చిట్కాలతో తన కేశ సంపదను కాపాడుకునే వారీ మహారాణి. ఆనాడు సిసీ పాటించిన ఈ చిట్కానే నేటికీ అక్కడి మహిళలు పాటిస్తూ తమ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ఇవి కూడా!
* గులాబీ, లావెండర్ పూలతో తయారుచేసిన సహజసిద్ధమైన ఫేస్ స్ప్రేలు వాడడం ఆస్ట్రియన్ మగువలకు అలవాటు. 19వ శతాబ్దపు మహారాణి సిసీ కూడా తన చర్మాన్ని మెరిపించుకోవడానికి ఈ సౌందర్య పద్ధతినే పాటించేవారట!
* కోడిగుడ్లు, కమలాఫలం, పాలు.. వంటివి అక్కడి మగువలు రోజూ తమ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. ఇవి తమ అందానికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మంచివనేది వారి అభిప్రాయం.
* అందమంటే కేవలం ముఖ సౌందర్యం మాత్రమే కాదు.. చక్కటి శరీరాకృతి కూడా! అంటున్నారు ఆస్ట్రియన్ అతివలు. అందుకే నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి డంబెల్ ఎక్సర్సైజులు, బరువులెత్తే వ్యాయామాలు బాగా చేస్తుంటారట!

19వ శతాబ్దపు ఆస్ట్రియా మహారాణి సిసీ పాటించిన సౌందర్య చిట్కాల్ని పాటిస్తూ అందానికి సరికొత్త నిర్వచనమిస్తోన్న ఆస్ట్రియన్ మగువల సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలేంటో తెలుసుకున్నారుగా! మరి, మనమూ ఈ న్యాచురల్ సీక్రెట్స్‌ని ఫాలో అయిపోయి అందగత్తెలుగా మారిపోదామా!!