తెరపై మేకప్ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్ బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం..
గత మూడున్నర నెలలుగా షూటింగ్స్ ఏవీ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు మన సినీతారలు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన పనుల్లో వారు నిమగ్నమై ఈ ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకుంటున్నారు. కొందరు ముద్దుగుమ్మలు తమ అందంపై దృష్టి సారిస్తూ మరింత అందంగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాల్ని పాటిస్తూ.. వాటికి సంబంధించిన రెసిపీలను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటూ.. తమది సహజసిద్ధమైన అందం అని చెప్పకనే చెబుతున్నారీ అందాల రాశులు.
దీంతో నా చర్మానికి మెరుపు..!

ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్ వేసుకొని క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న బిపాసా.. ‘శెనగపిండి, మందార పొడి, కలబంద.. వంటి సహజసిద్ధమైన పదార్థాలు కలిపి తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్ ఇది..’ అంటూ దానికి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫేస్‌ప్యాక్ తన చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేసిందంటోందీ డస్కీ గర్ల్. ఇక ఈ ఫేస్‌ప్యాక్‌లో ఉపయోగించిన శెనగపిండి ముఖం మీద ఉండే జిడ్డును, ట్యాన్‌ను తగ్గిస్తుంది. మందార పొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు హైపర్ పిగ్మెంటేషన్ సమస్యకు ఔషధంగా పనిచేస్తాయి. తద్వారా వయసు పైబడిన ఛాయలు దరిచేరవు. ఇక కలబంద చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
|
ఇది నా ఫేవరెట్ బ్యూటీ టిప్!
వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తుంది బాలీవుడ్ అందం మలైకా అరోరా. ప్రస్తుతం 46 ఏళ్ల వయసులోనూ తనదైన అందంతో ఆకట్టుకుంటోందీ యమ్మీ మమ్మీ. మరి, మీరింత అందంగా ఉండడానికి కారణమేంటి అనడిగితే చాలు.. సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే అంటోందీ అందాల తార. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ‘బొప్పాయి, బంగాళాదుంప, టొమాటో.. ఈ మూడూ కలిపి తయారుచేసిన ఫేస్‌ప్యాక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పదార్థాలను బ్లెండ్ చేసి దానికి కొన్ని చల్లటి నీళ్లు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టేయాలి. ఇలా తయారైన ఐస్క్యూబ్ని ముఖంపై రుద్దుకోవాలి. ఆపై కాసేపు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఈ క్రమంలో ఆయా పదార్థాల్లోని సద్గుణాలు చర్మ రంధ్రాల్లోకి బాగా ఇంకుతాయి. ఇలా ఐస్‌క్యూబ్‌తో ముఖంపై మర్దన చేయడం వల్ల ముఖం తాజాదనాన్ని సంతరించుకుంటుంది..’ అంటూ తన బ్యూటీ సీక్రెట్, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
|
అమ్మ చెప్పిన చిట్కా ఇది!
తాను పాటించే ఎన్నో సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే. ఈ క్రమంలోనే మొన్నామధ్య తన తల్లి తనకు చెప్పిన ఓ బ్యూటీ టిప్‌ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ ఇదే తన ఫేవరెట్ బ్యూటీ టిప్ అంటూ క్రెడిట్ అంతా అమ్మకు ఇచ్చేసింది. తాను ఆ ఫేస్‌ప్యాక్ వేసుకున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘టీస్పూన్ పసుపు, టీస్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పెరుగు.. ఈ మూడింటినీ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి..’ అంటూ క్యాప్షన్ పెట్టిందీ సుందరి. ఇక ఇందులో ఉపయోగించిన పసుపులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలకు చెక్ పెడతాయి. అలాగే పెరుగు, తేనె చర్మానికి తగిన పోషణను అందిస్తాయి.
|
నా మేని మెరుపుకి కారణమిదే!
బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ మచ్చలేని చందమామలాంటి తన చర్మ సౌందర్యానికి తాను పాటించే సహజసిద్ధమైన చిట్కాలే కారణమంటూ పలు సందర్భాల్లో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తన న్యాచురల్ బ్యూటీ బాక్స్‌లో నుంచి ఓ న్యాచురల్ ఫేస్‌ప్యాక్‌ను అందరితో పంచుకుంది. గ్రీన్ కలర్లో ఉన్న ఫేస్‌ప్యాక్ వేసుకొని తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ ‘నేను వేసుకున్న ఈ ఫేస్‌ప్యాక్ ఏంటో చెప్పుకోండి చూద్దాం..!’ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రశ్నను సంధించింది. దాంతో ఫ్యాన్స్ పదే పదే తన ఫేస్‌ప్యాక్ ఏంటో చెప్పాలని కోరగా.. ‘పుదీనా, మట్టితో కలిపి తయారుచేసిన ఫేస్‌ప్యాక్ ఇది. ఇది మేనికి మెరుపునిస్తుంది..’ అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టిందీ సొగసరి.
|
ఎలా తయారుచేసుకోవాలంటే..?
రెండు టీస్పూన్ల పెరుగులో ఐదు చుక్కల పుదీనా నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి వేసి మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఇలా తయారైన గ్రీన్ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకొని ఆరేంత వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖానికి మెరుపు, తేమను అందించడంతో పాటు ప్రకాశవంతంగా మార్చుతుంది.
మన అందాల తారలు పంచుకున్న సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారుగా! అయితే మనమూ ఈ టిప్స్ ఫాలో అయిపోయి సహజసిద్ధమైన సౌందర్య రాశుల్లా మెరిసిపోదామా..!
Also Read:
సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!
ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!
ఈ మెరుపు... ఆ మట్టి స్నానంతోనే!
ఈ గ్రీన్‌టీ ఫేస్ మాస్క్‌తో మేం మెరిసిపోతున్నాం... మరి మీరు?