మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్ పెట్టిందీ క్యూట్ బ్యూటీ.
అలనాటి అందాల తార పూజా బేడీ కూతురుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, తొలి చిత్రం ‘జవానీ జానేమన్’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అలయ. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్‌కి బ్రేక్ రావడంతో ఇంట్లోనే ఉంటోన్న ఈ బ్యూటీ.. కొత్త కొత్త వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ గడుపుతోంది. మరోవైపు తన అందానికీ మెరుగులద్దుతోందీ బ్యూటిఫుల్ బేబ్. ఈ క్రమంలోనే తాను పాటించే ఓ సహజసిద్ధమైన సౌందర్య చిట్కాను ఇన్‌స్టా పోస్ట్ రూపంలో అందరితో పంచుకుంది.
ఇది నా ఫేవరెట్!
ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, ముఖ చర్మం పొలుసులుగా ఊడిపోవడం.. ఇలాంటి సమస్యలు మనకూ అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వాటికి ఈ కాఫీ స్క్రబ్ చక్కటి పరిష్కారం చూపుతుందని అంటోంది అలయ. అంతేకాదు.. ఇది తన ఫేవరెట్ స్క్రబ్ అని.. దీన్ని ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం పొందానంటూ స్క్రబ్ తయారీని వీడియోలో పంచుకుందీ బాలీవుడ్ బేబ్.
‘ఇప్పుడు నేను మీ అందరికీ నా ఫేవరెట్ ఫేస్‌మాస్క్‌ని తయారుచేసి చూపించబోతున్నా. ముఖం ఉబ్బినట్లుగా తయారవడం, పొలుసులుగా ఊడిపోవడం.. వంటి సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఈ ఫేస్‌మాస్క్/స్క్రబ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని నా స్వీయానుభవంతో చెబుతున్నా. నేనూ ఈ మాస్క్‌ని పదే పదే ఉపయోగిస్తుంటాను. ఇందుకోసం కావాల్సినవి..
* బరకగా దంచిన కాఫీ పొడి - 2 టీస్పూన్లు
* బ్రౌన్ షుగర్ - ఒకటిన్నర స్పూన్లు
* ఆలివ్ నూనె - టీస్పూన్
* తేనె - టీస్పూన్
* పాలు - టీస్పూన్
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అన్ని పదార్థాలు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి గుండ్రంగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి..’ అంటూ ఫేస్‌ప్యాక్ తయారుచేసి చూపించిందీ చిన్నది.
ఆ సమస్యలకు చక్కటి పరిష్కారమిది!
ఈ ఫేస్‌ప్యాక్ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న అలయ.. ‘ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం అనేది నాకు పదే పదే ఎదురయ్యే సమస్య. ఇటీవలే దీనికి పరిష్కారం కనుక్కున్నా. అదే కాఫీ ఫేస్‌మాస్క్/స్క్రబ్. ఇది ఉబ్బిన ముఖాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంతో పాటు పొలుసులుగా ఊడిపోయే చర్మానికి చక్కటి పరిష్కారం చూపుతుంది. అలాగే ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.. ఈ కాఫీ స్క్రబ్‌ని బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగించచ్చు..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
వయసు ఛాయలు తగ్గించే ‘కాఫీ’!
బాలీవుడ్ బ్యూటీ అలయ పంచుకున్న ఫేస్‌మాస్క్ తయారుచేసుకోవడానికి ఎంతో సులభంగా ఉంది కదూ!! అంతేకాదు.. ఇందులో వాడిన పదార్థాల్లో బోలెడన్ని సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయి. ఇంతకీ ఎందులో ఏమున్నాయంటే..!
 * కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాతావరణ కాలుష్య ప్రభావం చర్మంపై పడకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు. అలాగే మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే శక్తి కూడా కాఫీకి ఉంది. * బ్రౌన్ షుగర్ చర్మం పొలుసులుగా ఊడే సమస్యను తగ్గించి మృదువుగా, యవ్వనంగా మార్చుతుంది. అలాగే మృతకణాల్ని తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, గ్లైకోలికామ్లం చర్మానికి మెరుపునందించడంలో సహకరిస్తాయి. * ఆలివ్ నూనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’ విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక ఆలివ్ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రభావం చర్మంపై పడకుండా రక్షిస్తాయి. * తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సహకరిస్తాయి. అలాగే మృతకణాలు, ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించే శక్తి తేనె సొంతం. * పొడిబారిన చర్మానికి సాంత్వన చేకూర్చడంలో పాలది మొదటి స్థానం. ఇందుకు పాలలోని ‘ఎ’ విటమిన్ తోడ్పడుతుంది. ఇక ఇందులోని విటమిన్ ‘డి’ ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించడంతో పాటు చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది.
|
సో.. ఇవండీ.. అలయ చెప్పిన బ్యూటీ మాస్క్, దాన్ని ఉపయోగించడం వల్ల సౌందర్య పరంగా కలిగే ప్రయోజనాలు! మరి, మనమూ మన సౌందర్య చిట్కాల్లో ఈ కాఫీ ఫేస్‌మాస్క్/స్క్రబ్‌కి చోటిచ్చేద్దాం.. అందంగా మెరిసిపోదాం..!